గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Modified: బుధవారం, 30 జనవరి 2019 (15:11 IST)

ఎఫ్2 విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న మెగా హీరో వరుణ్‌కు షాక్...

ఈమధ్య కాలంలో హరీష్ శంకర్ చేస్తున్న సినిమాలు వివాదాలలో చిక్కుకోవడం సాధారణంగా మారిపోయింది. ఆ మధ్య డీజె సినిమాలోని గుడిలో బడిలో పాటపై బ్రాహ్మణుల సంఘం వివాదాన్ని లేవనెత్తింది. ఇప్పుడు ఆయన తాజాగా వరుణ్ తేజ్‌తో తీస్తున్న వాల్మీకి చిత్రం లోగోపై కొత్త వివాదం రాజుకుంది.
 
ఎఫ్2 విజయంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించిన మెగా ప్రిన్స్ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ హిట్ మీద హిట్ కొడుతున్నారు. సోదరి నిహారిక తొలి క్లాప్ కొట్టి, దిల్ రాజు వంటి ప్రముఖుల సమక్షంలో ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించారు. ఇందులో వరుణ్ నెగెటివ్ క్యారెక్టర్‌లో కనిపిస్తారని టాక్.
 
వాల్మీకి టైటిల్ లోగోలో పైన తుపాకీ, కింద రీలు ఉన్నాయి. వాల్మీకి పేరు పెట్టి, తుపాకీని ఉంచడంపై వాల్మీకి సంఘం నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రామాయణ మహాకావ్యాన్ని రచించి, ప్రపంచానికి అందించిన మహనీయుడు వాల్మీకి అని, ఆయనపై ఆధ్యాత్మిక చిత్రాలు తీస్తే తమకేమీ అభ్యంతరం లేదు కానీ, కించపరిచే విధమైన చిత్రాలు తీస్తే ఊరుకునేది లేదని వాల్మీకి సంఘ నాయకుడు సాయి ప్రసాద్ తెలిపాడు.
 
పైగా, తమ వర్గం వారంతా ఎప్పుడో ఫ్యాక్షనిజం వదిలేసారని, ఇప్పుడు టైటిల్‌లో తుపాకీని చేర్చడం వలన వారిని నేరస్థులుగా చిత్రీకరించే ప్రయత్నాలు ఆపాలని, లోగోను మార్చాలని డిమాండ్ చేసారు. దీనిపై ఇంకా ఆ చిత్ర బృందం యూనిట్ ప్రతిస్పందించాల్సి ఉంది. ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరి.