శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 మార్చి 2021 (14:00 IST)

టాలీవుడ్‌లో విషాదం : 'వేదం' నాగయ్య ఇకలేరు..

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం "వేదం". ఈ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు నటుడుగా పరిచయమైన నాగయ్య. దీంతో ఆయన పేరు వేదం నాగయ్యగా మారిపోయింది. ఈయన శనివారం కన్నుమూశారు. గుంటూరు జిల్లా, నరసరావుపేట స‌మీపంలోని దేస‌వ‌రం పేట గ్రామ వాసి. సొంత గ్రామంలో ప‌ని దొర‌క‌క‌పోవ‌డంతో కొడుకుతో క‌లిసి హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. అక్కడ కూలిపని చేసుకుంటుంటే సినిమా అవకాశం వచ్చింది. 
 
'వేదం' సినిమాలో శ్రీను అనే బాలుడికి రాములు తాత పాత్ర‌లో న‌టించి, ఆ సినిమాలో బ‌న్నీతోనూ తాత అని పిలుపించుకున్న నాగ‌య్య పేరు ముందు 'వేదం' ఇంటి పేరులా మారిపోయింది. ఆ సినిమాతోనే ఆయ‌న అంద‌రి దృష్టిని ఆక‌ర్షించి వ‌రుస‌గా మ‌రిన్ని సినిమా అవ‌కాశాలు పొందారు.
 
దాదాపు 30కి పైగా సినిమాల‌లో నటించారు. లీడ‌ర్, నాగవల్లి,  రామయ్య వస్తావయ్యా, స్పైడర్ వంటి సినిమాలు ఆయ‌న‌కు మ‌రింత గుర్తింపు తెచ్చాయి. పాత్ర‌లో పూర్తిలో ఒదిగిపోయి, న‌టించ‌డమే కాకుండా అందులో జీవిస్తార‌న్న పేరును సంపాదించుకున్నారు. 
 
సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ ఆయ‌న ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోయారు. అనారోగ్యంతో ఆయన భార్య ఇటీవలే కన్నుమూశారు. ఆ బాధ నుంచి ఆయన కోలుకోలేక పోయారు. దీనికితోడు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. 
 
దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. అలాగే, మా అసోసియేషన్‌ నెలకు రూ.2,500 పింఛన్‌ను ఇప్పించింది. ఆయన మృతి ప‌ట్ల‌ పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.