వేజళ్ళ నుంచి మెగాస్టార్ వరకు మేడే చైతన్యం
నేడు మేడే. దీక్షా దినం. అణచివేత, దోపిడిలపై పోరాటాన్ని కొనసాగిస్తామని కార్మికవర్గం ప్రతిన చేసే దినం. అణచివేస్తే ఆగని ఉద్యమం! కష్టాలొచ్చినా, కన్నీళ్లొచ్చినా వెన్ను చూపని పోరాటం. ఎర్రజెండా సందేశం, సమరనాదమై పోరుగీతమౌతుంది. సామ్రాజ్యవాద సంకెళ్లను తెంచేస్తూ వెల్లువై ఉప్పెనగా మారుతుంది. సమతా సందేశం వినిపిస్తుంది.
నిజం చెప్పాలంటే.. ఈ నినాదం మనది కాదు. రష్యాది. ప్రపంచంలోని సోషలిస్టు దేశాలు పెట్టుబడిదారీ కబంధ హస్తాలతో నలిగిపోతూ రోజుకు 12 గంటల పనిదినాలను 8 గంటలుగా పోరాడి, నెత్తురోడి మార్చుకున్న రోజు. దీన్ని ముఖ్యంగా భారతదేశం తమదిగా భావించింది. అప్పటి క్యమ్యూనిస్టు పార్టీలు దీన్ని పతాకస్థాయికి తీసుకువెళ్ళారు. అప్పటి పాలకులపై శ్రామికులతో కలిసి పోరాడారు. అప్పటి నాయకులు అప్పటి కమ్యూనిస్టు పార్టీ అనేవి గతంలా మిగిలిపోయాయి. నాయకులు ఎంత మంది కార్మికులను కూడగట్టుకుని పోరాడిన ఎక్కడో చోట పెట్టుబడిదారులు, భూస్వామ్యులు పెత్తందారులు ఇంకా పైచేయిగానే వున్నారు. అందుకే తమవంతు అండగా వుంటామని అప్పట్లోనే సినిమారంగం ముందుకు వచ్చింది. ఎన్నో అభ్యుదయ కథలను ముందుకు తెచ్చింది.
- వేజళ్ళ సత్యనారాయణ సారథ్యంలో `ఈ చరిత్ర ఏసిరాతో` మొదలు పలు సినిమాలు వచ్చాయి. అవన్నీ అప్పటి సమకాలీన పరిస్థితులనుంచి పుట్టిన కథలే. సాయిచంద్, రంగనాథ్వం, రాజేంద్రప్రసాద్ వంటివారిని హీరోలుచేసిన రోజులవి. డిగ్రీ చేసి ఉద్యోగాలులేక కూటికి ఇబ్బందిపడుతున్న తీరును ఓ సందర్భంగా దర్శకుడు అద్భుతంగా చూపించారు. ఓ షాపు తెరిచేముందు కొబ్బరికాయను దిష్టికింద కొడితే ముక్కలై రోడ్డుమీద చెల్లా చెదురుగా పడుతుంది. అది చూసిన ఆ ముగ్గురిలో ఒకడు ఆత్రంగా కొబ్బరి ముక్కలను ఏరుకుంటాడు. దీన్ని చాలా హృద్యంగా వేజెళ్ళ ఆవిష్కరించారు.
తదంతరం సి.పి.ఐ. నుంచి మరో దర్శకుడు వచ్చాడు. ఆయనే ధవళ సత్యం. ఆయన ఆధ్వర్యంలో హీరోగా చేసినవాడు మాదాల రంగారావు. ఎర్రమల్లెలు వంటి అద్భుతమైన సినిమాను అందించారు. ఇలా ఒక్కోరు ఒక్కో సినిమాను తీసి ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. ఆ కోవలోనే వచ్చిన మరో కథానాయకుడు ఆర్. నారాయణమూర్తి. ప్రజల పోరాట కథలు చేసినా తుపాకీతోనే శ్రామికులు బంధవిముక్తులవుతారంటూ నగ్జలైట్ నేపథ్యాన్ని ఎంచుకున్నారు.
ఆయన ఏకంగా `మేడే` అనే సినిమాను ముందుకు తెచ్చారు. అందులో నేడే.. మేడే.. అంటూ చైతన్యం రగిలించే పాటలో అలరించారు. సింగన్న పాత్ర పోషించిన ఆయన సినిమాకు ప్రపంచ కార్మికులారా.. సమన్త శ్రామికులారా.. మనంమతా మనుషులం .ఈ జగతికి ఇరుసులం.. ఒకే కేలం అదే శ్రమకులం.. అని ఎలుగెత్తి చాటాడు. పొలం పనీ చేస్తూ కష్టాన్ని మరిపించేలా భీముడు సినిమాలో వందేమాతరం ఆలపించిన `టపటప చెమటబొట్లు, పనీపాటతోటే జతకట్టింది..` అనేది రక్తికట్టింది. అది సినిమాకు వన్నె తెచ్చింది. ఇలా ఎంతోమంది గాయకులు, రచయితలు, కథానాయకులు తమ వంతు కృషి చేశారు శ్రామికులకోసం.
ఇక తెలంగాణా పెత్తందారుల పోకడలను ఎండగట్టుతూ డా. సి. నారాయణరెడ్డితోపాటు శ్రీశ్రీ కొద్దిమంది రచనలతో చైతన్యం కూర్చారు. `ఊరు మనదిలా.. ఈ వాడ మనదిరా.. పల్లె మనదిరా. ప్రతి పనికి మనంరా, బండి మనదిరా.. బండెడ్లు మనదిరా.. నడుమ దొర ఏందిరా ఆ పీకుడేందిరోయ్..` అంటూ ఎలుగెత్తి చాటాడు.
- ఇదంతా కాలాన్ని బట్టి నటులు, రచయితలు, గాయకులు తమవంతు పాత్రను పోషించారు. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి వంతు వచ్చినట్లుంది. `ఆచార్య` సినిమాలో నగ్జలైట్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. మేడేనాడు మెగాస్టార్ ఓ సందేశాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
`కష్టే ఫలి అనేది మన నానుడి. మనం పడే కష్టమే మనకు నిజమైన ఫలితాన్ని అందజేస్తుంది. నేను ఎప్పుడూ నమ్మే సిద్దాంతం. శ్రమైక సౌందర్యాన్ని గుర్తుచేసే ఈ రోజు ప్రపంచ కార్మికులకుందరికీ వందనాలు. అభివందనాలు.` అంటూ తన మేడే గళాన్ని వినిపించాడు.
మేడే సందర్భంగా శ్రమైక కార్మికులందరికీ, కర్షకులందరికీ వెబ్ దునియా శుభాకాంక్షలు తెలుపుతోంది.