థియేటర్ లో విజిల్స్ వేయించే సినిమా - దర్శకుడు సుశీల సుబ్రహ్మణ్యం
Director Sushila Subrahmanyam
విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "జెమ్". ఈ చిత్రాన్ని మహాలక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పత్తికొండ కుమార స్వామి నిర్మించారు. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న "జెమ్" చిత్రం ఈ నెల 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో "జెమ్" సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సుశీల సుబ్రహ్మణ్యం. సినిమా మీద కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ కొత్త దర్శకుడు "జెమ్" థియేటర్ లలో విజిల్స్ వేయిస్తుంది అంటున్నారు. చిత్ర విశేషాలను, తన కెరీర్ సంగతులను దర్శకుడు సుశీల సుబ్రహ్మణ్యం వివరించారు.
- మాది గుంటూరు జిల్లా తెనాలి. సినిమా మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చాను. రచయిత పోలూరు ఘటికాచలం దగ్గర సహాయ రచయితగా పనిచేశాను. ఆ తర్వాత డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేశాను. సుమంత్ `ఇదం జగత్` సినిమా కో డైరెక్టర్ గా నా చివరి సినిమా. ఒక కమర్షియల్ కథ తయారు చేసి నిర్మాతకు చెబితే ఆయన కాంపాక్ట్ బడ్జెట్ లో చేద్దాం అన్నారు. అలా ఈ కథ శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజా దగ్గరకు తీసుకెళ్లాం.
- ఇద్దరి అమ్మాయిల మధ్య చిన్నప్పటి నుంచి పెరుగుతూ వచ్చిన అహం ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చింది అనేది కథ. ఈ ఇద్దరు అమ్మాయిల మధ్య అబ్బాయి ఇరుక్కుంటాడు. అనేక సమస్యలు ఎదుర్కొంటాడు. వీళ్ల ఈగో ప్రాబ్లమ్స్ పరిణామాలు ఎదుర్కొంటూ తన ప్రేమను హీరో ఎలా సాధించుకున్నాడు అనేది ఆసక్తికరంగా చూపించాం.
- జెమ్ సినిమాకు పవర్ ఫుల్ నేపథ్యం ఉండాలని రాయలసీమ బ్యాక్ డ్రాప్ పెట్టాం. అంతే కానీ ఈ కథకు రాయలసీమ బ్యాక్ డ్రాప్ కు ఎలాంటి సంబంధం ఉండదు. ఈ కథలో హీరో క్యారెక్టర్ వీడు జెమ్ రా అనిపించేలా ఉంటుంది. అతను చాలా ఇంటెలిజెంట్ గా, ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటాడు. అతనిలో సూపర్ హీరో లక్షణాలు ఉంటాయి. అందుకే టైటిల్ జెమ్ అని పెట్టాం.
- రాశీ సింగ్, నక్షత్ర, విజయ్ రాజా ఈ మూడు క్యారెక్టర్స్ సినిమాలో కీలకం. వాళ్లు ఆ క్యారెక్టర్స్ ను సూపర్బ్ గా పర్మార్మ్ చేశారు. జెమ్ రిలీజ్ అయ్యాక ఈ ముగ్గురికీ మంచి పేరొస్తుంది.
- దర్శకుడిగా నా దృష్టిలో సినిమా అంటే ఎంటర్ టైన్ మెంట్. సినిమాకు వచ్చిన ప్రేక్షకుడు నవ్వుకోవాలి, థ్రిల్ ఫీలవ్వాలి, పాటలను ఎంజాయ్ చేయాలి. నా సినిమాల్లో అదే ఉండేలా చూసుకుంటాను. ప్రేక్షకులకు ఏదో కొత్త విషయం చెప్పాలి, నేర్పించాలి అనుకోను.
- జెమ్ సినిమాకు టెక్నీషియన్స్ ప్రాణం పోశారు. సునీల్ కశ్యప్ సంగీతం, ఆండ్రూ సినిమాటోగ్రఫీ మా సినిమాను మరో లెవెల్ లోకి తీసుకెళ్లాయి. నా నెక్ట్ సినిమా మల్టీస్టారర్ చేద్దామని అనుకుంటున్నాను. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆ సినిమా ఉంటుంది.