నటీనటులు : రామ్ చరణ్, అంజలి, కియార అద్వానీ, ఎస్ జె సూర్య, జైరాం, శ్రీకాంత్, సముద్రకని, బ్రహ్మానందం, సునీల్, రాజీవ్ కనకాల తదితరులు
సాంకేతికత: దర్శకుడు : ఎస్. శంకర్, నిర్మాత : దిల్ రాజు, సంగీత : థమన్ ఎస్, సినిమాటోగ్రఫీ : తిరు, కూర్పు : రూబెన్, షమీర్
సంక్రాంతి పండుగకు తొలుత విడుదలైంది రామ్ చరణ్ గేంఛేంజర్. తమిళ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సమకాలీన రాజకీయ అంశాలను తీసుకుని చేసిన సినిమా అనేది ముందునుంచే చిత్ర యూనిట్ చెబుతున్నదే. దిల్ రాజు కూడా శంకర్ తో ఒక్క సినిమా అయినా చేయాలని కలవుండేదనీ, అది ఈ సినిమాలో తీరిందని స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. మరి గ్లోబల్ స్టార్ తో తీసిన ఈ సినిమా నేడే విడుదలైంది. మరి అదెలా వుందో చూద్దాం.
కథ:
ఏపీలో బొబ్బిలి సత్య మూర్తి (శ్రీకాంత్) ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. అవినీతి పరుడు. ప్రజలను దోచుకునేవాడు. సరిగ్గా నిద్రపట్టదు. కళ్లముందు ఓ మహిళ, కుర్రాడు కనిపిస్తుంటాడు. షాక్ కు గురయి ఆసుపత్రిలో జేరవేస్తుండగా బ్రిడ్జి కూలిపోతుంది. దాంతో మోసుకుని వెళుతుండగా ప్రజలంతా వాడు చేసిన పాపాలకు దేవుడి పరిష్కారం ఇచ్చాడంటూ మాటలు చెవిన పడతాడు. దాంతో ఒక్కసారిగా పరివర్తనతో చివరి ఏడాదిపాటు ప్రజలకు సేవచేయాలని పార్టీ సమావేశంలో తీర్మానిస్తాడు.
దానికి ఆయన ఇద్దరు కొడుకులు ఎస్.జె. సూర్య, అరవింద్ ససేమిరా అంటారు. కుట్రలు పన్నుతారు. బొబ్బిలి మోపిదేవి(ఎస్ జే సూర్య) కు సి.ఎం. కుర్చీపై కన్నుపడుతుంది. ఏకంగా 30ఏళ్ళపాటు పాలించాలని కసిగా వుంటాడు. ఆ సమయంలోనే ఆ ఊరికి కలెక్టర్ గా ఛార్జ్ తీసుకుని రామ్ నందన్ (రామ్ చరణ్) వస్తాడు. కలెక్టర్ తన రూల్స్ ను ఫాలో చేస్తున్న రామ్ నందన్ ను అడుగడునా మంత్రి హోదాలో మోపిదేవి అడ్డుపుల్ల వేస్తాడు. అప్పుడు కలెక్టర్ గా తనేంచేశాడు? బొబ్బిలి సత్యమూర్తి ఏమయ్యాడు? అప్పన్నకు రామ్ నందన్ కు వున్న సంబంధం ఏమిటి? అంజలి ఫాత్ర ఏమిటి? కోపిష్టిగా వుండే రామ్ నందన్ శాంతమూర్తిలా ఎందుకు మారాడు? వంటి పలు సమాధానాలే ఈ సినిమా.
సమీక్ష:
ఈ సినిమా కథంతా పరిశీలిస్తే ఎ.పి.లో ఇంతుకుముందున్న ప్రభుత్వ అరాచకాలు కళ్లకు కనిపించేలా ప్రేక్షకుడు ఊహించుకునే వుంటాయి. సి.ఎం. పీఠం కోసం కాచుకుని కూర్చునే శ్రీకాంత్ కొడుకులు క్యారెక్టర్లు తమిలనాడు రాజకీయాలను గుర్తు చేస్తాయి. ప్రజలు ఏమయినా పర్వాలేదు అధికారం, డబ్బు దాహంతీర్చుకోవాడానికి ఏదైనా చేసే పాత్ర సూర్యది. మిగిలిన పాత్రలన్నీ కథలో అలా వస్తు పోతుంటాయి.
దర్శకుడు శంకర్ సామాజిక అంశాన్ని డీల్ చేశాడు. కలెక్టర్ పరిమితులు, విధులు అధికార దాహం వున్న మంత్రికి చెప్పడం, కలెక్టర్ గా, ఎలక్షన్ ఆఫీసర్ గా తానేమీ చేస్తానో చూడంటూ.. అన్ ప్రెడిక్టబుల్ అంటూ డైలాగ్ తో ఏదో కొత్తది చూపిస్తాడని అనుకునేలా క్రియేట్ చేశాడు. కానీ కలెక్టర్ పాత్రను లోతుగా వెళ్లకుండా దర్శకుడు లైట్ గా టచ్ చేశాడు. మంత్రులంతా పాలన తెలీనివాళ్ళే. వారికి ఓ ఐ.ఎ.ఎస్. లేకపోతే శాసనాలు ఎలా చేయాలి? ఏది అమలు జరపాలనే విషయాలు కనీస జ్నానం కూడా తెలీదంటూ వారిని తక్కువచేసి చూపినా అందులో కిక్ కనిపించదు. ఇదంతా రొటీనే. కామన్ మేన్ కు తెలిసిందే. కానీ అంతకుమించి అంశాన్ని ఆయన టచ్ చేసివుంటే బాగుండేది.
ప్రధాన లోపాలు
ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అప్పన్న పాత్రకు రంగస్థలం తరహాలో నత్తిపెట్టాడు. ఇది కొత్తప్రయోగం అనుకన్నాడు కానీ. ఆ నత్తిని మేనేజ్ చేసి పార్టీ పెట్టి మంచి చేసే నాయకుడిగా ఎదగనీయకుండా చేయడం చిన్నపాటి లోపంగా కనినిస్తుంది. అదే విధంగా కొండప్రాంతాల్లోని గ్రామాల్లో మైనింగ్ పేరిట బిజినెస్ మేన్ చేస్తున్న మోసానికి ఎదురొడ్డీ అప్పన్న (రామ్ చరణ్) సక్సెస్ అవుతాడు. దాంతో చుట్టుపక్కల పేరు రావడంతో అభ్యుదయం పార్టీ పెడతాడు. కేవలం నత్తివుండడం వల్లే తన వాయిస్ ను ఇంకోరిచేత చేయాలనుకునే క్రమంలో చుట్టుపక్కల తనవెన్నంటి వుండే రాజీవ్ కనకాలని కాదని ఎవడో అభిమాని అంటూ వచ్చిన శ్రీకాంత్ పెద్దపీట వేయడం. అతను సి.ఎం. కావడంతో కథలో ట్విస్ట్ అనిపించదు. రొటీన్ గా గతంలోని సినిమాల మాదిరిగానే అనిపిస్తుంది. ఇక చకచకా సాగే కథనం, రొటీన్ ఫార్మెట్ లో హీరోయిన్ కలవగానే పాటలు వుండడం ఇబ్బందిగా అనిపిస్తాయి.
ఇందులో రామ్ చరణ్ పాత్ర హైలైట్. కలెక్టర్ గా బాగా సూటయ్యాడు. అలాగే అప్పన్న భార్యగా అంజలి వయస్సురీత్యా చేసిన పాత్ర సరికొత్తగా వుంది. సునీల్ పాత్ర కూడా ఇంచుమించు అలానే వున్నా. ఎక్కువ సేపు ఆ పాత్రను చూడడం ఇబ్బంది అనిపిస్తుంది. ఎస్.జె. సూర్య స్టీల్ ది షో అన్నట్లు రామ్ చరణ్ తో నువ్వా? నేనా? అన్నట్లుగా వుంది. శ్రీకాంత్ మేకవన్నెపులిగా నటించాడు. హీరోయిన్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. వ్రుద్ధాశ్రమంలో వారిని మోటివేట్ చేయడం చిరంజీవి ఖైదీ నెం. 151 లోని ఓ అంశంగా కనిపిస్తుంది. బ్రహ్మానందంపాత్ర వుండాలి అన్నట్లుగా పెట్టారు.
ఈ చిత్రంలోని కథావస్తువు దేశరాజకీయ ముఖచిత్రమనే చెప్పాలి. రాజకీయనాయకుడు, కలెక్టర్ కు జరిగే వారే ఈ కథ. కలెక్టర్ చదివి పాలనసరిగ్గా సాగించాలంటే రాజకీయనాయకుల జోక్యం ఏవిధంగా చేయలేకపోతున్నారో చూపించినా, సినిమా కనుక అలాంటివారికి బుద్ధి చెప్పి తాను నిజమైన కలెక్టర్ అని నిరూపించేదే ఈ సినిమా.
మొదటి భాగంలో కాస్త సాదాసీదాగా సాగుతుంది. ఎక్కడా ఎగ్జయిట్ మెంట్ కనిపించదు. ఇంటర్ వెల్ బ్లాక్ ట్విస్ట్. ఆ తర్వాత ఏది? ఎందుకు జరుగుతుంది అనేది శంకర్ శైలిలో చెప్పాడు. కోట్లు ఖర్చు చేసి తీసిన పాట ప్రస్తుతం వెండితెరపై కనిపించలేదు. విజువల్స్ విఎఫ్ఎక్స్ వరకు సినిమాలో బాగలేవు. థమన్ సరైన స్థాయిలో సంగీతం లేదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. అయితే విఎఫ్ఎక్స్ లో ఇంకా బెటర్ గా చేయాల్సింది. జరగండి సాంగ్ థియేటర్స్ లో డిజప్పాయింట్ చేస్తుంది. తిరు సినిమాటోగ్రఫీ రిచ్ గా గ్రాండ్ విజువల్స్ తో బాగుంది. కార్తిక్ సుబ్బరాజ్ కథతో శంకర్ చేసిన ప్రయోగ విధానం బాగుంది. దాన్ని మరింత కొత్తగా తీసివుంటే బాగుండేది. కొంచెం రొటీన్ కథ పెద్దగా మలుపులులేవు. అయినా కుటుంబంతో చూసే సినిమా ఇది.
రేటింగ్ : 3/5