ఇదో కామెడీ దెయ్యం... రివ్యూ రిపోర్ట్
ఇంట్లో దెయ్యం నాకేం భయం నటీనటులు : నరేష్, కతిక జయకుమార్, మౌర్యాని, రాజేంద్రప్రసాద్, ప్రభాకర్, శ్రీను, షకలక శంకర్ తదితరులు. సంగీతం : సాయి కార్తీక్, నిర్మాత : బివిఎస్‌ఎన్. ప్రసాద్,దర్శకత్వం : జి. నాగేశ్వర్ రెడ్డి. అల్లరి నరేష్ సినిమాలంటే అల్
ఇంట్లో దెయ్యం నాకేం భయం నటీనటులు : నరేష్, కతిక జయకుమార్, మౌర్యాని, రాజేంద్రప్రసాద్, ప్రభాకర్, శ్రీను, షకలక శంకర్ తదితరులు. సంగీతం : సాయి కార్తీక్, నిర్మాత : బివిఎస్‌ఎన్. ప్రసాద్,దర్శకత్వం : జి. నాగేశ్వర్ రెడ్డి.
అల్లరి నరేష్ సినిమాలంటే అల్లరి అల్లరిగా వుండాల్సిందే. అలాంటి కథల్నే తీసుకుని ఈసారి దెయ్యంతో పెళ్లి చేసుకునే ప్రయత్నం చేశాడు. 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' అనే పేరుతో వచ్చిన ఈ సినిమా అతని కెరీర్‌కు వుపయోగపడుతుందని చెబుతున్నాడు. అయితే గత నెలలోనే విడుదలవాల్సిన ఈ చిత్రం మోడీ కారణంగా... నోట్ల రద్దుతో వాయిదా పడింది. అగ్ర హీరోలతో సినిమా చేసే బివిఎస్‌ఎన్ ప్రసాద్ తొలిసారిగా చిన్న సినిమా తీశాడు. గతంలో 'సీమశాస్త్రి, సీమ టపాకాయ్' చిత్రాలకు దర్శకత్వం వహించిన జి. నాగేశ్వర్ రెడ్డి, నరేష్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ :
పెళ్ళిల్లకు బ్యాండ్ మేళం వాయించే నరేష్ (అల్లరి నరేష్), చమ్‌చంద్ర, షకలక శంకర్.. ఓ పెళ్లిలో చేసిన అతి వల్ల పెళ్లికూతురు నాన్న చనిపోతాడు. అక్కడనుంచి తప్పించుకుంటుండగా.. కృతికను లవ్ చేసేస్తాడు. ఆమె ప్రేమ కోసం అర్రులు చాచుతాడు. అనాథలకు సేవచేసే తత్త్వంవున్న ఆమె మనసు గెలుచుకునేందుకు ఓ రౌడీ దగ్గర 3 లక్షల అప్పు చేస్తాడు. కానీ దాన్ని ఎవడో ఎత్తుకుపోతాడు. అలాంటి టైమ్‌లో ఓ ఇంట్లో దెయ్యం వుందని దాన్ని తప్పిస్తే 10 లక్షలు ఇస్తానని రాజేంద్రప్రసాద్ ఫోన్ చేస్తాడు. ఇదే మంచి అవకాశమని.. 10 లక్షల కోసం దెయ్యాలను తరిమేసే భూతాల బాబాగా అవతారం ఎత్తుతాడు. అయితే.. ఆ దెయ్యం నరేష్‌ను టార్గెట్ చేస్తుంది. నరేష్‌కు దెయ్యానికి సంబంధం ఏమిటి? అనేది మిగిలిన కథ.
పెర్‌ఫార్మెన్స్:
అల్లరి నరేష్.. తన పాత్ర మేరకు అల్లరి చిల్లరిగా చేసేశాడు. ఏది చేసినా నవ్వు తెప్పించే ప్రయత్నం చేశాడు. అతని అనుచరులు శంకర్, చమక్‌చంద్ర కామెడీని పండించారు. రాజేంద్రప్రసాద్ కూడా తన పరిధి మేరకు హాస్యాన్ని పండించాడు. చలపతిరాజు, ప్రభాస్ శ్రీను, జయప్రకాష్‌రెడ్డి తదితరులు కూడా ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేశారు. బ్రహ్మానందం చాలా రోజుల తర్వాత మరలా కామెడీ చేశాడు. పోలీస్‌గా నటించాడు.
సాంకేతిక విభాగం :
ముఖ్యంగా దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి తీసుకున్న కథను ఎంటర్‌టైన్ చేయడం కోసం నానా తంటాలు పడ్డాడు. హార్రర్ ఎలిమెంట్ కూడా బలహీనంగానే ఉంది. సాయి కార్తీక్ అందించిన సంగీతం కొన్ని పాటల్లో బాగుంది. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కాస్త కొట్టగానే అనిపించింది. ఎడిటింగ్ బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. గ్రాఫిక్స్ బాగా చేశారు. డైమండ్ రత్నబాబు డైలాగులు పర్వాలేదనిపించాయి. బివిఎస్‌ఎన్. ప్రసాద్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
విశ్లేషణ:
దెయ్యం కథ అంటే... దాదాపుగా ఒకేలా వుంటాయి. అందుకు నిదర్శనంగా దర్శకుడు పలు చిత్రాలను స్పూర్తిగా తీసుకున్నట్లు కన్పిస్తుంది. ప్రేమకథాచిత్రమ్, చంద్రకళ చిత్రాలు కళ్ళముందు కదలాడతాయి. అల్లరి నరేష్‌తో సినిమా చేస్తే ఎలా వుండాలో అలా తీశాడు. దానికి తగినట్లు సంభాషణలూ రాశాడు. వెటకారాలు తక్కువగా వున్నా మాస్‌ను అలరించే సన్నివేశాలు వున్నాయి. రొటీన్ కథ, కథనాలు కావడంతో మొదటి భాగం కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. హీరోయిన్ కలిస్తే చాలు పాట వచ్చేస్తుంది.
ఇక సెకండాఫ్‌లో దెయ్యాన్ని ఎలివేట్ చేస్తూ తీసిన కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. కేవలం ప్రధాన పాత్రలనే కాకుండా ఇతర పాత్రలతో చేయించిన కామెడీ, హర్రర్ సన్నివేశాలు కొంత వరకు బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్లో వచ్చే చిన్నపాటి ట్విస్ట్ కూడా బాగుంది. ఇక నరేష్, కతిక జయ కుమార్ లవ్ ట్రాక్ సరదాగా వుంది. దెయ్యం పాత్ర పోషించిన మౌర్యాని ఓకే అనిపించింది.
సంభాషణల పరంగా సన్నివేశానికి తగినట్లుగా రాసుకున్నట్లు కన్పిస్తుంది. బ్రహ్మానందం స్పెషల్ పోలీసు ఆఫీసర్ పరమేశంగా కన్పిస్తాడు. ఇతను రాకతో.. చలపతి చూసి.. ఈయన సర్వీస్ అయిపోయిందిగా! ఇంకా వచ్చాడేంటి? అనే డైలాగ్ పడడం.. దానికి.. సర్వీస్ అయినా.. బ్రాండ్‌లాంటివాడిని నేను.. నా అవసరం ఎప్పుడైనా వస్తుందంటూ.... తనపై వస్తున్న రూమర్లకు కౌంటర్‌గా రాయించుకున్నట్లుగా అనిపిస్తుంది.
ఇలాంటి హార్రర్ కామెడీకి కావలసిన అంశాలున్నా కథ చాలా రెగ్యులర్‌గా వుండడంతో రొటీన్ సినిమాగా మారిపోయింది. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ మినహా సెకండాఫ్‌లో జరగబోయే ప్రతి సన్నివేశాన్ని ముందుగానే ఊహించేంత రోటీన్‌గా ఉన్నాయి. అలాగే కథలోని ప్రధాన పాత్రలను కాకుండా ఇతర ప్రతి పాత్రను దెయ్యంతో ఇంటరాక్ట్ చేయడం కొంత వరకు బాగానే ఉన్నా కాసేపటికి అనవసర సన్నివేశాలు ఎక్కువై బోర్ కొట్టించాయి.
అయితే గతంలో నాగేశ్వర్ రెడ్డి, నరేష్ కాంబినేషన్లో వచ్చిన గత సినిమాలతో పోలిస్తే ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ తక్కువే. కథ మధ్యలో ప్రేమ జొప్పించినా దాన్ని చివరి వరకూ తీసుకురావడం, దానికి మంచి ఫీల్‌తో కూడిన ముగింపు ఇవ్వడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి. దెయ్యానికి రెండు లక్ష్యాలు ఏర్పడటంతో ఏ ఒక్కదానికీ న్యాయం జరక్క ముగింపు వెలితిగా అనిపించింది. నరేష్ కామెడీని హర్రర్ సినిమాల్ని ఇష్టపడే వారికి ఈ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది.
రేటింగ్ : 2.5/5