నిర్మాణ సంస్థ: లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్
తారాగణం: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్, నాజర్, చంద్రమోహన్ తదితరులు
సంగీతం: మిక్కి జె.మేయర్
ఛాయాగ్రహణం: కె.వి.గుహన్
కూర్పు: ఎం.ఆర్.వర్మ
కళ: ఎ.ఎస్.ప్రకాష్
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు
దర్శకత్వం: శ్రీనువైట్ల
'ముకుంద', 'కంచె', 'లోఫర్' వంటి విభిన్న సినిమాలతో మెగా హీరో వరుణ్ తేజ్ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా వరుణ్ చేసిన మరో సినిమా `మిస్టర్`. 'ఢీ', 'రెఢీ', 'దూకుడు' వంటి చిత్రాలతో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు శ్రీనువైట్ల. ఆ తర్వాత వచ్చిన 'ఆగడు', 'బ్రూస్‌లీ' చిత్రాలు వరుస ప్లాప్‌లను చవిచూశాయి. దీంతో ఎలాగైనా విజయాన్ని రుచిచూడాలన్న గట్టిపట్టుదలతో మిస్టర్ చిత్రాన్ని తీశాడు. ట్రావెల్, ట్రయాంగిల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాడు. మరి మిస్టర్ ఎలా మెప్పించాడో చూద్దాం..
కథా విశ్లేషణ...
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రా సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లో ఒక గ్రామం పిచ్చయ్య నాయుడు (నాజర్) ఆధీనంలో ఉంటుంది. లక్ష్మీ నరసింహ స్వామి ముందు ఊరి నడిబొడ్డున జరిగే కర్రసాములో ఎవరు నెగ్గితే వాళ్లకి ఆ ఊరిపై పెత్తనం ఉంటుంది. గుండప్పనాయుడు (తనికెళ్ల భరణి)కి, పిచ్చయ్య నాయుడుకి మధ్య జరిగిన పోటీలో పిచ్చయ్య నాయుడు గెలుస్తాడు. అయితే రాహుల్ ఒడయార్ (నికితన్ ధీర్)కి ఆ ఊరి చుట్టు పక్కల ఉన్న అడవుల్లో రంగురాళ్లు ఉన్నాయని తెలుసుకుంటాడు.
ఆ చుట్టుపక్కల ప్రాంతంపై అధికారం కోసం గుండప్ప నాయుడుతో చేతులు కలుపుతాడు. మరోవైపు పిచ్చయ్య నాయుడు మనవడు జై (వరుణ్) స్పెయిన్‌లో ఉంటాడు. అయితే, భారత్ నుంచి స్పెయిన్‌కు వచ్చిన ప్రియను ఎయిర్ పోర్టు నుంచి తీసుకుని రావడానికి వెళ్తాడు. అయితే అక్కడ ప్రియకు బదులు పొరపాటుగా మీరా (హెబ్బాపటేల్)ను తీసుకొస్తాడు. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు జై. కానీ ఆమె సిద్ధార్థ్ (ప్రిన్స్)ను ప్రేమిస్తున్నానని చెప్పి ఇండియా వచ్చేస్తుంది.
స్వదేశానికి వచ్చాక ఆమెకు... ఓ సమస్య ఎదురవుతుంది. దీంతో జైకు ఫోన్ చేసి చెపుతుంది. ఆమె ప్రేమను కలపడానికి వచ్చిన జైకు... దారిలో చంద్రముఖి (లావణ్య త్రిపాఠి)ని చూస్తాడు. చంద్రముఖి రాయల వంశానికి చెందిన వారసురాలు. అనుకోకుండా జైకి ఆమెతో నిశ్చితార్థం జరుగుతుంది. అంతకుముందే ఒడయార్‌కు, చంద్రముఖికి పెళ్లి చేయాలని మాటలు జరిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో జైకి, శరద్‌కి మధ్య కర్రసాము జరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా.
కథాబలం...
సినిమా ఆద్యంతం రిచ్‌గానే ఉంటుంది. కెమెరామేన్ గుహన్ పనితనం సినిమాకు చాలా ప్లస్ అయింది. లొకేషన్లు అద్భుతంగా ఉన్నాయి. రోడ్ సీన్లు, కార్ ఛేజ్‌లు, స్పెయిన్ అందాలు, పల్లెటూరి అందాలు.. ఇలా స్క్రీన్ మీద ప్రతి లొకేషనూ చాలా కొత్తగా, మరింత కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. వరుణ్ తేజ్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో మరింత స్టైలిష్‌గా ఉన్నాడని చెప్పొచ్చు. డైలాగ్ డెలివరీలోనూ మంచి మెచ్యూరిటీ కనబరిచాడు. ఇక డ్యాన్సులు పరంగా గట్టి ప్రయత్నమే చేశాడు. కాస్ట్యూమ్స్ బావున్నాయి. కామెడీ టైమింగ్ కూడా ఫర్వాలేదనిపించాడు. లావణ్య కనిపించినంతలో లంగాఓణీల్లో అందంగానే కనిపించింది. హెబ్బా పటేల్ రెగ్యులర్ కమర్షియల్ నాయికగా నటించింది. రఘుబాబు `ఊపిరి` స్పూఫ్ కాసింత ఊరట కలిగిస్తుంది. పృథ్వి, షేకింగ్ శేషు కామెడీ నవ్విస్తుంది. పాటలు బాగానే ఉన్నాయి. మిక్కి జె.మేయర్ సంగీతం అదనపు బలం.
బలహీనతలు:
చెప్పుకుంటే ఈ చిత్రానికి అనేక బలహీనతలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కథ లేకపోవడం. రచయిత గోపీమోహన్ సెకండాఫ్ కథ తేలిపోయింది. ఎక్కడా కొత్తదనం లేకపోవడం కూడా ఈ సినిమాకు పెద్ద మైనస్ పాయింట్. తెరనిండుగా ఆర్టిస్టులు ఉండటంతో ఎవరు ఎవరో, ఎందుకొచ్చారోననే అయోమయం ఏర్పడుతుంది. సినిమాలో ద్వితీయ భాగం చాలా గందరగోళంగా సాగుతుంది. శాంతిపురం కాన్సెప్ట్ తో షకలక శంకర్‌ని పెట్టి ఏం చెప్పాలనుకున్నారో అర్థం కాదు. చాలా చోట్ల ప్రేక్షకుడికి విసుగు కలుగుతుంది. తనికెళ్ల భరణి పాత్ర `అతడు`లో పాత్రకు కొనసాగింపుగా కనిపిస్తుంది. ఎక్కడా ఎమోషన్స్ బలంగా కనిపించవు. నాగినీడు పాత్ర కూడా మెప్పించదు. శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, షకలక శంకర్, సత్యం రాజేశ్ పాత్రలు కొంత నవ్వించినా, మరికొంత విసుగును కూడా పుట్టించాయి. కథ, స్క్రీన్ ప్లే సినిమాకు మేజర్ డ్రా బ్యాక్.
రేటింగ్: 2.5/5