గురువారం, 7 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 ఆగస్టు 2025 (21:09 IST)

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

online bettings
ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటు పడి, చేసిన అప్పులు తీర్చలేక కేంద్ర ప్రభుత్వానికి చెందిన పోస్టల్ ఉద్యోగి ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బెట్టింగ్స్ గేమ్స్ ఆడకుండా ఉండలేక, అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్నట్టు మృతుడు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన నరేశ్.. భార్య కీర్తి, కుమార్తె భవ్యతో కలిసి వనస్థలిపురంలోని ఓ కాలనీలో నివాసముంటున్నారు. కొన్నేళ్లుగా ఆన్‌లైన్‌ బెట్టింగులకు బానిసై ఆర్థికంగా నష్టపోయిన నరేశ్.. సుమారు రూ.15 లక్షలు అప్పు చేసినట్టు సమాచారం.
 
ఇటీవల అనారోగ్యంతో ఇంట్లో ఉన్న నరేశ్.. అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వరకట్న వేధింపులు... పెళ్లయిన 3 నెలలకే నవ వధువు ఆత్మహత్య 
 
ఏపీలోని కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఓ విషాదకర ఘటన జరిగింది. అత్తింటి వేధింపులు కారణంగా నవ వధువు పెళ్లయిన మూడు నెలలే తనువు చాలించింది. వరకట్న వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తూ బోరున విలపిస్తున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు... మొవ్వ మండలం కొండవరం గ్రామానికి చెందిన నాగరాజు, శివనందేశ్వరమ్మల కుమార్తె శ్రీవిద్య ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఈ యేడాది ఏప్రిల్ 23వ తేదీన కంకిపాడు మండలం కందేరుకు చెందిన అరుణ్ కుమార్‌తో ఆమె వివాహం జరిగింది.
 
శ్రీవిద్య ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తుండగా, అరుణ్ కుమార్ ఉయ్యూరు మండలం కలవపాములలో సర్వేయర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. అయితే వివాహం జరిగిన నాటి నుంచి అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధింపులకు గురిచేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శ్రీవిద్య అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. 
 
తమ కుమార్తెను అల్లుడే చంపి ఉంటాడని తండ్రి నాగరాజు ఆరోపిస్తున్నారు. ఉయ్యూరులోని తమ ఇంటిని అమ్మేసి డబ్బులు ఇవ్వాలని తన కుమార్తెను పెళ్లయిన రోజు నుంచే వేధిస్తున్నారని, అప్పటికే కట్నంగా రూ.10 లక్షల నగదు, రూ.10 లక్షల విలువైన బంగారం ఇచ్చినట్లు ఆయన వాపోయారు. మృతురాలి తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.