బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (17:58 IST)

నానీస్‌ 'గ్యాంగ్‌ లీడర్‌'‌లో లేడీస్ ఏం చేసారు (మూవీ రివ్యూ)

నటీనటులు: నాని - ప్రియాంక మోహన్‌ - లక్ష్మి - శరణ్య - కార్తికేయ - వెన్నెల కిషోర్‌ - ప్రియదర్శి - అనీష్‌ కురువిల్లా తదితరులు. 
 
సాంకేతిక వర్గం: ఛాయాగ్రహణం: మిరోస్లా కూబా, మాటలు: వెంకట్‌, సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని - రవిశంకర్‌ యలమంచిలి - మోహన్‌, రచన - దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.
 
నానితో 'మనం' దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమనగానే 'నానీస్‌ గ్యాంగ్‌లీడర్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. 'జెర్సీ' తర్వాత నాని చేస్తున్న చిత్రమిది. ప్రోమోల్ని బట్టి చూస్తే మంచి వినోదం పంచే చిత్రంలా కనిపించిన ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదెలా వుందో చూద్దాం.
 
కథ: 
పెన్సిల్‌ పార్థసారథి (నాని) ప్రతీకార కథలు రాసే రచయిత. ఇంగ్లీషు చిత్రాలను చూస్తూ కథలు రాస్తుంటారు. అలాంటి పెన్సిల్‌ దగ్గరకు అయిదుగురు ఆడవాళ్లు వచ్చి తమ పగకు, ప్రతీకారానికి హెల్ప్‌ చేయమని అడుగుతారు. మీరు రాసిన 28 కథలనుబట్టి కొత్తగా ఓ మర్డర్‌ను ప్లాన్‌ చేయమని అడుగుతారు. ఇంతకీ వారు టార్గెట్‌ ఎవరు? ఎందుకని వారంతా మర్డర్‌ చేయమన్నారు. వారికి జరిగిన అన్యాయం ఏమిటి? ఇందులో పెన్సిల్‌ పాత్ర ఏమేరకు వుందనేది మిగిలిన కథ. 
 
విశ్లేషణ: 
మర్డర్‌, మిస్టర్‌ కథలంటే చాలా ఆసక్తిగా వుండాలి. ప్రేక్షకుడు అప్పుడే కనెక్ట్‌ అవుతాడు. అయితే కొన్ని లాజిక్కులు వెతికితే కష్టమే. చిన్నపాటి లోపాలున్నా ఫ్యామిలీతో చూడతగ్గచిత్రంగా చెప్పవచ్చు. ఇలాంటి కథలకు మలుపులు చాలా ముఖ్యం. అలాంటి మలుపులకు ప్రేక్షకుడు కనెక్ట్‌ కావాలి. లేదంటే సప్పగా మారిపోతుంది. ఈ లోపాల్ని అధిగమించాలంటే స్టార్‌ కాస్ట్‌ అయినా వుండాలి. ఇందులో స్టార్‌ కాస్ట్‌ వుంది. అనుభవం వున్న దర్శకుడు వున్నారు. అందుకే వినోదానికి సెపరేట్‌ ట్రాక్‌ లేకుండా కథతోపాటు సాగే సన్నివేశాలే ఎంటర్‌టైన్‌ చేస్తాయి. 
 
ముఖ్యంగా వెన్నెల కిశోర్‌ పాత్ర అందరినీ నవ్విస్తుంది. బామ్మగా చేసిన లక్ష్మిపాత్రా మెప్పిస్తుంది. అయినా మరీ సినిమాటిగ్గా సాగిన రైటింగ్‌ 'గ్యాంగ్‌ లీడర్‌'కు ప్రతికూలత అయింది. ఇందులో పాజిటివ్స్‌ ఎన్ని ఉన్నాయో.. నెగెటివ్స్‌ కూడా అన్నే కనిపిస్తాయి. కాకపోతే కాలక్షేపానికి మాత్రం ఢోకా లేదు. విక్రమ్‌ కుమార్‌ '13బి.. మనం.. 24' చిత్రాలు చూస్తే అతనో మేథావి అని తెలుస్తుంది. స్క్రీన్‌ ప్లేతో మ్యాజిక్స్‌ చేయడం అతడికి అలవాటు. ఐతే తన చివరి సినిమా 'హలో'లో ఏమాత్రం కన్విన్సింగ్‌గా లేని కథాకథనాలతో పూర్తిగా నిరాశపరిచాడు విక్రమ్‌. అందులో స్క్రీన్‌ ప్లేతో ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేయాలని చూశాడు కానీ.. మొదలుపెట్టిన చోటే ఆగిపోయే ఆ కథతో ప్రేక్షకుడు కనెక్ట్‌ కావడమే కష్టమవుతుంది. 
 
ఇక 'గ్యాంగ్‌ లీడర్‌'కూడా సింపుల్‌గా లాగించేయాలని చూశాడు. ఈ క్రమంలో లాజిక్‌ అనే మాటను పక్కన పెట్టేశాడు. కేవలం వినోదంవైపే దృష్టిపెట్టాడు. ఇందులో బ్యాంక్‌ దొంగతనం చేసిన ఆరుగురు వ్యక్తుల్లో ఒకరు బతకడం. మిగిలిన వారు చనిపోవడం వంటి వాటిల్లో ఎక్కడా ప్రేక్షకుడు ఫీల్‌ కలగలేడు. దాంతో 'గ్యాంగ్‌ లీడర్‌' టేకాఫ్‌ అంత గొప్పగా అనిపించదు. పెన్సిల్‌ పాత్రకు సంబంధించి ఆరంభంలో వచ్చే మెరుపులన్నీ టీజర్‌.. ట్రైలర్లలో చూసినవే. ఆ తర్వాత ఏంటి అని చూస్తే నిరాశ తప్పదు. రచయిత పెన్సిల్‌ పాత్రలో మెరుపులేం లేవు. ఒక మామూలు క్యారెక్టర్‌ లాగే ప్రవర్తిస్తుంది హీరో పాత్ర.  ముఖ్యంగా కార్తికేయ పాత్ర చిత్రానికి హైలైట్‌. అతని పాత్ర తర్వాతే కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది. 
 
హీరో - విలన్‌ మధ్య క్యాట్‌ అండ్‌ మౌస్‌ ప్లే కథనాన్ని రక్తి కట్టిస్తుంది.  ప్రేక్షకుల్ని కొంత ఉత్కంఠకు గురి చేసే సన్నివేశాలు పడటంతో ద్వితీయార్ధం వేగంగా సాగిపోతుంది. మధ్య మధ్యలో విక్రమ్‌ మార్కు స్క్రీన్‌ ప్లే చమత్కారం ఆకట్టుకుంటుంది. చాలా వరకు సటిల్‌గా సాగిపోయే సినిమాలో వెన్నెల కిషోర్‌ కామెడీ ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంది.  ప్రీక్లైమాక్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. అక్కడ లక్ష్మి పాత్రకు సంబంధించిన మలుపు ప్రేక్షకుల్ని భిన్న అనుభూతికి గురి చేస్తుంది. మొతద్తంగా చూస్తే ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆ సమయానికి బాగానే ఎంటర్టైన్‌ చేస్తుంది కానీ.. ప్రత్యేకమైన అనుభూతిని కలిగించదు.
 
నాని పాత్ర పరంగా ఒదిగిపోయాడు. ఈ పాత్రను మొదలుపెట్టిన స్థాయిలోనే సినిమా అంతటా నడిపించి ఉంటే ఈ పాత్ర.. సినిమా ఓ రేంజిలో ఉండేవేమో. కానీ మధ్యలో పాత్ర గాడి తప్పింది. అయినప్పటికీ నాని ప్రతి సన్నివేశంలోనూ అలరించాడు. హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌ ఆకట్టుకుంది. ఆమెకు సినిమాలో పెర్ఫామ్‌ చేసేందుకు పెద్దగా స్కోప్‌ లేదు. పాలిష్‌ విలన్‌గా కార్తికేయ బాగా సూటయ్యాడు. శరణ్యతో పాటు హీరో గ్యాంగులో కనిపించే టీనేజ్‌ అమ్మాయి.. చిన్న పాప కూడా బాగా చేశారు.   ప్రియదర్శి ఓకే.
 
అనిరుధ్‌ రవిచందర్‌ పాటలు బాగున్నాయి. 'హొయనా హొయొనాతో పాటు ఇంకో రెండు పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతంలో అనిరుధ్‌ తన స్థాయిని చూపించాడు. మొదట్నుంచి చివరి వరకు తనదైన ఎనర్జీతో ఆర్‌ఆర్‌ తో సన్నివేశాల్ని నడిపించాడు. సినిమాటోగ్రాఫర్‌ మిరోస్లో కూబా పనితనం ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. ఇంటర్వెల్‌ షాట్‌ ఒక్కటి చూసి అతడి ప్రతిభను అంచనా వేయొచ్చు. ఇంకా మరెన్నో మెరుపులు కనిపిస్తాయి సినిమాలో. మైత్రీ వాళ్ల నిర్మాణ విలువలకు ఢోకా లేదు. వెంకట్‌ డైలాగులు బాగున్నాయి. ఫన్నీ నరేషన్‌తో దర్శకుడు ఆకట్టుకునే ప్రయత్నం చేసినా ప్రేక్షకుడు ఏ మేరకు ఆదరిస్తాడో చూడాలి.