శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (14:05 IST)

అసభ్యతకు తావులేని క్లీన్ మూవీ "నీ కోసం" (రివ్యూ)

నటీనటులు: అరవింద్‌ రెడ్డి, అజిత్‌ రాధారామ్‌, శుభాంగి పంత్‌, దీక్షితా పార్వతి తదితరులు
 
సాంకేతిక వర్గం: నిర్మాత: భారతి అన్నపురెడ్డి, కథ కథనం, దర్శకత్వం: అవినాష్‌ కొటకి, ఎడిటర్‌: తమ్మిరాజు..
 
కొత్తవారితో ప్రేమకథలు వస్తూనే వున్నాయి. వారు తమ టాలెంట్‌ను నిరూపించుకునే రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అరవింద్‌ రెడ్డి, అజిత్‌ రాధారామ్‌లు తమను తాము నటులుగా నిరూపించుకునేందుకు చేసిన ప్రయత్నమే 'నీకోసం'. వారికోసం దర్శకుడు అవినాష్‌ ఎటువంటి ప్రయత్నం చేశాడు అనేది శుక్రవారమే విడుదలైన చిత్రం చూసి తెలుసుకుందాం.
 
కథ: 
కౌటి (అరవింద్‌ రెడ్డి) తన స్నేహితుడ్ని రిసీవ్‌ చేసుకోవడానికి బస్టాండ్‌కు వెళతాడు. ఆ సమయంలో జరిగిన బాంబ్‌బ్లాస్ట్‌లో గాయాలతో ఆసుపత్రిపాలవుతాడు. ప్రేయసి కార్తిక (శుభాంగ్‌ పంత్‌) సపర్యలు చేస్తుంది. అయితే ఆ బాంబ్‌బ్లాస్ట్‌లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతారు. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి. ఇది టీవీలో చూసిన కౌటి చలించిపోతాడు. తను రికవరీ అయ్యాక ప్రమాదంలో దొరికిన ఓ డైరీ ఆధారంగా ప్రశాంత్‌ (అజిత్‌ రాధారామ్‌), సియా (దీక్షిత పార్వతి) లవ్‌స్టోరీ ఇంట్రెస్ట్‌ కల్గిస్తుంది. వారిని వెతికేందుకు కౌటి సిద్ధమవుతాడు. చివరికి ప్రశాంత్‌ చనిపోయాడని రూఢీచేసుకుని అతని సంబంధీకులకోసం వేట మొదలుపెడతాడు. ఆఖరికి ప్రశాంత్‌ తల్లిని కలిసినా తను చనిపోయాడనే విషయాన్ని చెప్పలేకపోతాడు. ఆ తర్వాత అనుకోకుండా ప్రశాంత్‌ కనపడడంతో కౌటి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ జర్నీలో కౌటి, కార్తిక ప్రేమ ఏమయింది? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ:  
ఈ పేరుతో ఇంతకుముందు రవితేజతో సినిమా వచ్చింది. అందుకే టైటిల్‌ ఆసక్తిగా వుంది. ఇద్దరు ప్రేమ జంటలను ఒకరికి ఒకరు తెలీయకుండా కలుపుతూ సాగే ప్రేమ కథ ఇది. ఈ ప్రేమకథలో మధ్యతరగతి జీవితం, హైసొసైటీ జీవితాలు ఎలా వుంటాయనేది ప్రశాంత్‌, కౌటి, సియా పాత్రల ద్వారా చూపించారు. జాబ్‌ లేదని చుట్టుపక్కల వారు అనే మాటలు సందర్భానుసారంగా వున్నాయి. 'జాబ్‌వచ్చాక.. పెళ్లి.. తర్వాత పిల్లలు. ఇలా అడిగేవారు ఎప్పుడూ వుంటూనే వుంటారని' తల్లితో ప్రశాంత్‌ చెప్పడం వాస్తవంగా వుంది. 'కష్టపడడం కాదు. ఇష్టపడు.. జాబ్‌ అదే వసుంది. ఇష్టంతో..ఏదైనా. చేయవచ్చునే' తల్లి స్పూర్తి నివ్వడం వంటి సంభాషణలు బాగున్నాయి. 
 
ఇక సమాజం సీత, ద్రౌపదికి అన్యాయం జరిగిందంటూనే.. మరోవైపు రేప్‌లు జరుగుతూనే వున్నాయంటూ.. మోడ్రనైజేషన్‌లో డ్రింగింగ్‌ ప్యాషన్‌ అయిపోయింది. డెవలప్‌మెంట్‌ ఎలా వుందనేది..  చెబుతూ.. గుడిమెట్లదగ్గర పసిపిల్లలు.. పాలకు ఏడుస్తుంటే. గుడిలో పాలాభిషేకాలు చేస్తున్నారు.. అంటూ దర్శకుడు సెటైరిక్‌గా చెప్పాడు. ఇక సాహిత్యపరంగా 'నన్నువీడి..నిన్ను క్షణం..', 'కనులు చూడని నిజమిది.. ఎదురు నలిచినా.. వరమిది.', 'వెల్లువాయా హృదయ.. కంటికి కానరావే చెలియా... ఎక్కడున్నా.. ఒక్కసారి.. తిరిగి రా... ఓ పావురమా..'. పాటల్లో మంచి సాహిత్యం.. చక్కటి మెలోడితో ఆకట్టుకున్నాయి. స్టార్‌ హీరోకూడా దొరకని మంచి సంగీతం, సాహిత్యం ఈ చిత్రానికి కల్గడం విశేషం. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.
 
జీవితంలో సంతృప్తి, మనశ్శాంతి ముఖ్యమని కొడుక్కు తండ్రి చెప్పే మాటలు.. ఇవన్నీ చక్కగా రాసుకున్న దర్శకుడు కథను మొత్తం ఆసక్తిగా చిత్రీకరిస్తే మరింత బాగుండేది. తను కొత్తకావడంతో కొన్ని చోట్ల తత్తరపాటు పడినట్లు కన్పిస్తుంది. ముఖ్యంగా ఆర్టిస్టులనుంచి మరింతగా నటనను రాబట్టుకునేలా చర్యలు తీసుకోవాల్సింది.  హీరోలిద్దరూ చూడచక్కగా వున్నారు. ప్రశాంత్‌ స్టయిలిష్‌గా కన్పించాడు. అరవింద్‌ రెడ్డి సూట్‌డ్రెస్‌లో మెరిపించాడు. తను ముఖకవళికల్ని మరింతగా మెరుగుదిద్దుకుంటే రాణిస్తాడు. శుభాంగి, దీక్ష ఇద్దరూ పాత్రల మేరకు నటించారు. 
 
మిగిలిన పాత్రలు బాగానే వున్నాయి. ప్రేమికుల మధ్య కౌగిలింత అనేది భయమేసినప్పుడు ధౌర్యాన్నిస్తుందనే .. డైలాగ్‌ లాజిక్క్‌గా అనిపిస్తుంది. ఇక ప్రేమలో చిన్నచిన్న విషయాలకు సీరియస్‌, మళ్ళీ కలుసుకోవడం వంటి సన్నివేశాలు ఇంట్రెస్ట్‌గా చూపించాడు.  'ప్రధానంగా మనిషిగా బతికుండటమే గొప్పవిషయం. అందుకే ప్రేమించే వ్యక్తి ఒకరుంటే చాలనే..'  పాయింట్‌ మీదనే కథంతా నడుస్తుంది. దీన్ని తనదైన శైలిలో దర్శకుడు ఆవిష్కరించాడు. కొన్ని లోపాలున్నా కొత్తవారయినా బాగానే నటించారు. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా ఫర్వాలేదనిపించే దర్శకుడు తెరకెక్కించాడు.