బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (12:06 IST)

వినూత్న... విభిన్నమైన కథ '2అవర్స్‌ లవ్‌' (మూవీ రివ్యూ)

నటీనటులు:  శ్రీపవార్‌, కృతిగర్గ్‌, తనికెళ్ళభరణి, నర్సింగ్‌యాదవ్‌, అశోక వర్ధన్‌ తదితరులు
 
సాంకేతికత: కెమెరా: ప్రవీణ్‌ వనమాలి, సంగీతం: గ్యాని సింగ్‌, పాటలు: వీఎస్‌వి రమేష్‌కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: అఖిల గంజి, రచన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీపవార్‌.
 
ఇటీవల నూతన తరం కొత్త కొత్త ఆలోచనలతో ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ప్రేమకథలో భిన్నమైన ఆలోచనలతో 'ఆర్య' వంటి చిత్రాన్ని తీసిన సుకుమార్‌.. హీరో ఆలోచనలు ఇంత చిత్రంగా వుంటాయా! అనిపించేట్లుగా వుంది. దాన్ని యూత్‌ బాగా ఆదరించారు. ఇప్పుడు సుకుమార్‌ బాటలో మరో హీరో కమ్‌ దర్శకుడు శ్రీపవార్‌ ముందుకు వచ్చాడు. అసలు ఈ కథను విజయ్‌దేవరకొండతో చేయించాలని కున్నా ఆదిలోనే సాధ్యపడలేదు. అందుకే తనే హీరోగా మారి దర్శకత్వం వహించాడు శ్రీపవార్‌. ఈ శుక్రవారమే విడుదలైన ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
 
కథ: 
ఓ దొంగను కొందరు వెంటాడుతుంటే పారిపోతూ ఖాళీగా వున్న ఓ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ వస్తువులన్నీ మూటగట్టుకుని బయలుదేరుతుండగా ఓ డైరీ ఆకట్టుకుంటుంది. ఆ డైరీ చదవడమే సినిమా కథ మొదలవుతుంది. కాలేజీ చదివే అవికా (కృతిగర్గ్‌) భిన్నమైన ఆలోచనలు గల అమ్మాయి. అలాంటి అమ్మాయికి చూసీచూడంగానే ప్రేమను వ్యక్తంచేస్తాడు అదితి (శ్రీపవార్‌). కానీ తను ఓ కండిషన్‌ పెడుతుంది. రోజుకు రెండు గంటలు మాత్రమే ప్రేమిస్తానంటుంది. దానికి తగ్గట్లు తన షెడ్యూల్‌కూడా రాసి ఇస్తుంది. 
 
అలా సాయంత్రం 4నుంచి 6గంటలవరకు టైం పెట్టుకుని మరీ ప్రేమించుకుంటారు. ఓ దశలో విసుగుచెందిన అదితి తనకూ ఈప్రేమ రోజంతా కావాలంటూ బెదిరిస్తాడు. రోజంతా అతనితో అయిష్టంగా వుంటుంది. అలా ఎందుకు వున్నదనే విషయంతో ఇంటర్‌వెల్‌ పడుతుంది. ఈ కథంతా డైరీద్వారా తెలుసుకున్న దొంగ.. తర్వాత ఏమయిందనేదానిపై ఆసక్తిగా వుండాలని తనికెళ్ళభరణి అనే పబ్లిషర్‌ వద్దకు వెళ్ళి పుస్తకంగా ప్రింట్‌ చేయిస్తాడు. ఆ పుస్తకంలో వున్నట్లు వీరిద్దరి ప్రేమ తర్వాత ఎటు మలుపు తిరిగింది? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ: 
తను ప్రేమించిన అమ్మాయిని మరొకరు ప్రేమిస్తున్నా.. తన ప్రేమ ఎలా వుంటుందనేది ఆ అమ్మాయికి చూపిస్తూ  ఒకరకమైన టార్చెర్‌పెడుతూ చూసేవారికి ఎంటర్‌టైన్‌  చేసే కథాంశం ఆర్య. సరిగ్గా ఇలాంటి ప్రవర్తన అమ్మాయిలో వుంటే ఎలా వుంటుందనేది '2లవర్స్‌ ప్రేమ'. రెండుగంటలే అతనితో ఎందుకు ప్రేమలో వుంటాననేది చిత్రంలోని ముఖ్యమైన పాయింట్‌. దానికి ఓ అగ్రిమెంట్‌ పత్రం కూడా రాసుకుంటారు. ప్రేమను కేవలం కళ్ళతోనే వ్యక్తం చేస్తూ రొమాన్స్‌ చేయడం. స్కూల్‌ హాలీడేస్‌లా ప్రేమకు రెండు నెలలు హాలీడేస్‌ ప్రకటించడం వంటి చిత్రమైన అంశాలు ఇందులో వున్నాయి. వాటిని తెరపై చూడాల్సిందే. 
 
అయితే ఇలాంటి భిన్నమైన కథను ఎంచుకుని అటు హీరోగా, ఇటు దర్శకుడిగా రాణించడం అనేది కష్టసాధ్యమే. అయినా దాన్ని సుసాధ్యం చేశాడు శ్రీపవార్‌. నటుడిగా తన హావభావాలు బాగా పండించాడు. అయితే మొదటి పార్ట్‌లో అతని ఆహార్యం సాయిధరమ్‌తేజను పోలివుండడం, ద్వితీయార్థంలో గడ్డెం తీసేసినప్పుడు సుధీర్‌బాబును పోలి వుండడం కన్పిస్తుంది. ఒకరకంగా అలా వుండడం శ్రీపవార్‌కు కొంచెం ఇబ్బందే. అందుకే తనను తాను నిరూపించుకునేందుకు రెండో భాగంలో బాగా నటించాడు. 
 
కృతి పాత్రపరంగా బాగానే నటించింది. టీవీ యాంకర్‌ దొంగగా నటించాడు. తనికెళ్ళభరణి పాత్ర మామూలుగానే వుంటుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల ప్రేమ ఎపిసోడ్‌ పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌లో సాగుతుంది. నిజమైన ప్రేమికులు పిలుచుకునే నాన్నా, బుజ్జి, డార్లింగ్‌, ఏరా.. అనే పదాలతో వారి ప్రేమ ఆసక్తికరంగా వుంటుంది. అదేవిధంగా తమ ప్రేమను వ్యక్తం చేసే క్రమాన్ని ఎక్కువశాతం లిప్‌కిస్‌లతోనే చూపించడం యూత్‌ను ఎట్రాక్ట్‌ చేయడమే.
 
ఇక సాంకేతికపంగా కెమెరామెన్‌ పనితనం బాగుంది. సాహిత్యం, సంగీతం రెండూ బాగా అమరాయి. పెద్ద చిత్రానికి వుండాల్సిన అంశాలు ఇందులో వున్నాయి. స్క్రీన్‌ప్లే ముందు, వెనుక ఫార్మెట్‌లో వున్నా ఎక్కడా బోర్‌ కొట్టదు. అయితే మధ్యలో అలకలు, అపార్థాలతో కథనం సాగుతూ  ఒకరినొకరు తెలీకుండా కిడ్నాప్‌ చేయించుకోవడంతో కొత్తగా వుంటుంది. ఆ తర్వాత ఏమయిందనేది ఆసక్తికరంగా వుంటుంది. 
 
దర్శకుడిగా శ్రీపవార్‌ కొత్తయినా చాలా జాగ్రత్తగా డీల్‌ చేశాడు. 'ఇదేకతా చూసేద్దాంపదా.. ప్రేమకు టైం ఇలా రెండేగంటలా ఇలలో.. అంటూ సాహిత్యంతోపాటు సంగీతం బాగుంది. తెలంగాణ యాసలో ఫ్రెండ్‌గా నటించిన వ్యక్తి కాస్త ఎంటర్‌టైన్‌చేస్తాడు. తనకున్న పరిధిమేరకు నిర్మాణపు విలువలతో దర్శకుడు ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సినిమాటిక్‌గా అనిపించినా యూత్‌ను బాగా ఆకట్టుకునే కథాంశమిది. లాజిక్కులను చూడకుండా కాసేపు టైంపాస్‌ చేయవచ్చు.