Priyaprakash varrier, Nitin
తప్పుచేయనివాడికి అనుకోనివిధంగా జైలుశిక్ష పడడం, దాన్నించి తను ఎలా బయటపడాలనుకోవడం వంటి కథలు తెలిసిందే. కానీ చేయని తప్పుకు ఉరిశిక్ష వరకు వెళ్ళిందంటే అది సహించరానిదే. కానీ అలాంటి అంశాన్ని కథగా తీసుకున్నపుడు ప్రేక్షకుడిని కథలో ఇన్‌వాల్వ్ చేయడం అనే బాధ్యత దర్శకుడిదే. ఐతే సినిమా నుంచి గోపీచంద్‌తో సాహసం, మోహన్‌లాల్‌తో మనమంతా వంటి సినిమాలు తీసి ముందుచూపు గల దర్శకుడిగా చంద్రశేఖర్ ఏలేటికి పేరుంది.
మారిన పరిస్థితులు వల్ల ఒక బలమైన పాయింట్‌తో నితిన్ హీరోగా `చెక్` సినిమా చేశాడు. భవ్య క్రియేషన్స్ ఆనందప్రసాద్ సినిమా నిర్మించారు. రకుల్, ప్రియావారియర్ నాయికలుగా నటించారు. మరి వీరందరితో చేసిన చెక్ ప్రయోగం ఈ శుక్రవారంమే విడుదలైంది. మరి ఎంతమేర ఫలితం ఇచ్చిందో చూద్దాం.
కథగాచెప్పాలంటే,
కోర్ట్ సీన్‌తో సినిమా స్టార్ట్ అవుతుంది. నితిన్ (ఆదిత్య) సహా మరికొంత మందికి ఉరి శిక్ష వెయ్యాలన్న తీర్పుతో సీన్ వస్తుంది. అందుకు కారణం 40 మంది చావుకు కారణమైన ఉ్రగవాది అనే నెపం. నితిన్‌ను జైలుకు తరలిస్తారు. అక్కడ అతను చుట్టు పక్కల ఖైదీలతో నిరంతరం పోరాటం. అక్కడే చేయని తప్పుకు 20 ఏళ్ళుగా శిక్ష అనుభవిస్తున్న పెద్దాయన సాయిచంద్ వుంటాడు. తను చెస్ ప్లేయర్. ఆయన్ను చూసి చెస్‌లో మెళుకువలు నేర్చుకుంటాడు ఆదిత్య. అది చివరికి రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్ళేలా చేస్తుంది. ఉరిశిక్ష పడ్డ ఖైదీ కాబట్టి ఎన్నో అడ్డంకులు. అతని తరఫున న్యాయవాదిగా రకుల్ వాదించి తప్పుకుంటుంది. ఆ తర్వాత ఏమయింది? మరి చివరికి అతను బయటపడ్డాడా? లేదా? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణ:
ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథే ఈ చెక్. దర్శకుడు తీసుకున్న అంశం టెర్రరిజం. 40 మంది సామాన్యుల చావుకు తాను కారణంకాదంటూ ఎంత వేడుకున్నా ఫలితంలేదు. అసలు టెర్రరిజం అనే అంశమే కత్తికి రెండు వైపులా పదును అన్నట్లు వుండేది. ఏమాత్రం అటు ఇటూ అయినా సినిమా బెడిసికొడుతుంది. ఉరిశిక్ష పడ్డ ఖైదీ తాను టెర్రరిస్టు కాదని గట్టిగా వాదించే సందర్భం ఇందులో వుండదు. నిజంగా టెర్రరిస్టు అయితే అతన్ని తప్పించడానికి ఉగ్రవాద సంస్థలు ప్రయత్నించాలి.
అలాంటి లాజిక్ లేకుండా కథ రాసేసుకుని ఉరిశిక్ష పడ్డ ఖైదీని జైలులో వున్న ఇతర ఖైదీలు ఏవిధంగా బిహేవ్ చేస్తారు. అక్కడా ఎలాంటి మానవ మృగాలున్నాయి. జైలు అధికారులు, గార్డ్‌లు ఎలా ప్రవర్తించారనే దానిపైనే దర్శకుడు శ్రద్ధ పెట్టాడు. దాంతో సినిమాలో హీరోపై ఎటువంటి సానుభూతి వుండదు. దానికితోడు పూర్వం ఆదిత్య సాంకేతికతను అడ్డుపెట్టుకుని వైట్‌కాలర్ మోసాలు చేస్తుంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలో చిత్రంగా ప్రియావారియర్ ప్రవేశిస్తుంది. ఆమె ప్రవేశించిన తీరే చూసే ప్రేక్షకుడికి అనుమానాన్ని కలిగిస్తుంది. అది సినిమాకు మైనస్. ఎందుకు అతన్ని టార్గెట్ పెట్టింది అనేదానికి సరైన లాజిక్ లేదు.
ఇలా కథ నడక అంతా ఆదిత్య చెస్ ప్లేయర్‌గా అంతర్జాతీయస్థాయిలో ఎదిగాడనే దానిపై సినిమా సాగుతుంది. ఈ చెస్ అనేది మైండ్ గేమ్. ఇది అందరికీ అర్థంకాని గేమ్. ఇది కూడా సినిమాకు మరో మైనస్. ఇలా పలు మైనస్‌లతోపాటు తెలుగు ప్రేక్షకుడిని కట్టిపడేసే వినోదం కానీ, పాటలు కానీ లేవు. సీరియస్ కథను అంతే సీరియస్‌గా కామన్‌మేన్‌కు అర్థంకాని విధంగా సినిమా వుంది. చేయని తప్పుకు ఎంతో మంది ఖైదీలు ఉరిశిక్ష వరకు వెళ్లడం వుండివుండవచ్చు. అందులో ఓ కథను తీసుకున్నట్లుగానీ చెప్పివుంటే సినిమా మరోలా వుండేది. రాజమౌళి అందరికీ తెలీని రబ్బీగేమ్‌ను అప్పట్లో ఎంచుకుని నితిన్‌తో తీసి మెప్పించాడు. అయితే చెస్ గేమ్ తీసుకున్న అతని స్నేహితుడు ఏలేటి అంతలా మెప్పించలేకపోయాడు.
ఇక సాంకేతికంగా నేపథ్యసంగీతపరంగా కళ్యాణ్‌మాలిక్ బాగానే అందించాడు. ఒకే ఒక్క పాట వుంటుంది. సినిమాటోగ్రఫీ బాగానే వుంది. ఆర్ట్ పనితీరు బాగుంది. సంభాషణలు సాదాసీదాగానే వున్నాయి. ముఖ్యంగా కథకు మలుపులు అనేవి కీలకం. అవేవి ఇందులో కనిపించవు. కేవలం ఖైదీల జీవితం ఎలా వుందో చెప్పే ప్రయత్నం చేశాడు. ఫైనల్‌గా ఆదిత్య జైలునుంచి తప్పించుకునే విధానం కాస్త లాజిక్కుగా చూపించినా అంతలా చూసి ప్రేక్షకుడు క్లాప్ కొట్టే ప్థాయిలేదు. కమర్షియల్‌గా ఈ చిత్రం కష్టమనే చెప్పాలి.
ప్లస్‌పాయింట్లుః
- నితిన్‌తోపాటు నటీనటుల అభినయం,
- సెల్‌లో ఖైదీల అలవాట్లు, వారి ప్రవర్తన
- మైండ్‌గేమ్‌తో బయటకు రావడం.
- నేపథ్య సంగీతం.
మైనస్‌లుః
- టెర్రరిజం అనే పాయింట్
- ఎక్కడా ఫీల్ కలిగించని సన్నివేశాలు
- చాలా నిదానంగాసాగే కథనం.
- ఆకట్టుకోని దర్శకత్వం.