గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. సాహిత్యం
  3. కథలు
Written By ivr
Last Modified: బుధవారం, 5 అక్టోబరు 2016 (19:52 IST)

ఆపిల్ రంగు ఎరుపు కాదు తెలుపు...

ఒకరోజు, మా బడిలో అంతా హడావుడిగా ఉంది. అందరూ పరిగెడుతూ ఉన్నారు. అంతవరకు నేనెప్పుడూ చూడలేదు మా మాస్టర్లు, మేడంలు అలా హడావుడిగా స్కూల్లో తిరగడం. విషయం ఏమిటీ అని అడిగాను నా స్నేహితుడిని. రేపు మన స్కూల్‌కి DEO గారు వస్తున్నారట ఇన్స్పెక్షన్ కోసం అంటూ సమాధ

ఒకరోజు, మా బడిలో అంతా హడావుడిగా ఉంది. అందరూ పరిగెడుతూ ఉన్నారు. అంతవరకు నేనెప్పుడూ చూడలేదు మా మాస్టర్లు,  మేడంలు అలా హడావుడిగా స్కూల్లో తిరగడం. విషయం ఏమిటీ అని అడిగాను నా స్నేహితుడిని. రేపు మన స్కూల్‌కి DEO గారు వస్తున్నారట ఇన్స్పెక్షన్ కోసం అంటూ సమాధానం ఇచ్చాడు నా మిత్రుడు. 
 
మరుసటి ఉదయం కల్లా మా స్కూల్ చాలా కొత్తగా కనిపించింది. స్కూల్ ముందు తోరణాలు, రంగవల్లులు, శుభ్రపరిచి మరుగుదొడ్లు, పూల మాలలతో అలంకరించిన జాతీయ నాయకుల ఫోటోలు, పిల్లలకు ప్రార్థన గీతాలు నేర్పుతున్న మా పంతులమ్మలు, కొత్త కుండలలో చల్లని నీరు (కుండలపై మూతలు కూడా ఉన్నాయి చిత్రంగా), కొత్తగా అంతా కొత్తగా. మా స్కూలేనా అన్నట్లు మారిపోయింది. ప్రతీ చెట్టు క్రింద ఒక కుర్చీ చెట్టుకు ఆనించి బ్లాక్ బోర్డు, ప్రాంగణమంతా పండుగ వాతావరణంతో కళకళలాడుతూ ఉంటే, అందరమూ వారివారి తరగతి గదులకు వెళ్ళి నేలపై ఉన్న మా సీట్లలో కూర్చున్నాము. 
 
మా ప్రిన్సిపాల్ గారు ఎప్పుడూ కనీసం మా క్లాస్ వైపు రానివారు ఆదర బాదరగా అన్నీ క్లాస్‌లను తిరిగేస్తూ కంగారుపడిపోతున్నారు. ఇంతలో మా వాచ్‌మాన్ పరిగెత్తుకొంటూ వచ్చి, "సార్..... DEO సారూ వచ్చేసారూ" అంటూ ఆయాసపడుతూ చెప్పాడు. మా మాస్టర్ ఏమో అందరిని నిశ్శబ్దంగా ఉండమని చెప్పి ఎంతో సీరియస్‌గా పాఠం మొదలెట్టారు. 
 
మేమంతా బుద్ధిగా చదివేవాళ్ళలా ఎంతో శ్రద్ధగా వింటున్నట్లు నటిస్తున్నాము. ఇంతలో DEOగారు మా క్లాస్‌కు రానే వచ్చారు. వచ్చేముందు ఆయనగారు మా ప్రిన్సిపాల్ గారితో నవ్వుతూ ఎంతో నిజాయతీగా "మేము చూసిందే రాస్తాములే. అంతా మంచిగానే రాస్తాములే" అంటూ లోనికి వచ్చారు. 
 
ఇంతలో నా మిత్రురాలు అరుణ నాతో మెల్లిగా అంది " ఈ సారూ క్రితం సంవత్సరం కూడా వచ్చారుగా" అని. నేను నోటిమీద వేళ్ళు వేసుకొని నిశ్శబ్దంగా ఉండమన్నట్లు సైగ చేశా. DEO గారు రాగానే మా క్లాస్ లోనికి అందరమూ లేచి " గుడ్ మా.... ర్నిo.....గ్ గ్ గ్ గ్ " సార్ అంటూ నిలబడ్డాము. అందరినీ కూర్చోమని చెప్పిన ఆయన " పిల్లలూ... ఎలా చదువుతున్నారు? అంతా బాగుందా ఇక్కడ?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
ఇంతలో మా సార్ వచ్చి "ఇంగ్లీష్‌లో ఏమైనా అడగండి సార్ మావాళ్లు భలే చెబుతారు", అంటూ గొప్పలు చెప్పడం మొదలెట్టారు. 
DEO గారు "పిల్లలూ! ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానము చెప్పాలి" అన్నారు. 
 
మొదటి ప్రశ్న "వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ స్కై?" అన్నారు. వెంటనే నేను లేచి "బ్లూ" అన్నాను. "గుడ్" అన్నారు. నేనేదో సాధించిన వాడిలా గర్వంగా కూర్చున్నాను. 
 
రెండవ ప్రశ్న "వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ ఆపిల్?" అన్నారు. నా పక్కనే వున్నా అరుణ ఠక్కున లేచి నిలబడి "వైట్" అని చెప్పింది. అందరూ నవ్వారు. నాతో సహా. 
 
మా సార్ అందుకొని "అరుణ! కలర్ ఆఫ్ ఆపిల్ " A.. P .. P .. L .. E ... " అని స్పెల్లింగ్ మరీ వత్తి చెప్పాడు. 
 
అరుణ మళ్ళీ తడబడకుండా "వైట్ " అనే చెప్పింది. 
 
సార్‌కి కోపం వచ్చింది నోర్మూసుకొని కూర్చో అంటుండగానే, ఇంతలో అరుణ ఇలా అంది "నిజమే సార్, ఈ సారూ క్రితం సంవత్సరం వచ్చారు, ఇప్పుడూ వచ్చారు, బడిలో ఏదైనా మారిందా? మన స్కూల్ వాతావరణం ఎలా ఉందో అలానే ఉంది. మనకు తాగడానికి మంచి నీళ్లు లేవు, ఆడపిల్లలకు సరైన బాత్రూములు లేవు, మా క్లాస్ రూమ్‌లకు సరైన కప్పు లేదు, పంతుళ్లు కూర్చునేందుకు కుర్చీలు లేవు, బల్లలు లేవు, పాఠాలన్నీ చెప్పడానికి మాస్టార్లు లేరు, ఆడుకొనేందుకు ప్లే గ్రౌండ్ లేదు, వస్తువులు లేవు, ఇక ఇంకా ఎన్ని లేవు. అవన్నీ మనకు కనబడవు సార్. ఒక రోజు మేము చెప్పే సమాధానాలు, మీరు చేసే మర్యాదలతో సార్ అంతా బాగుంది అని రిపోర్ట్ రాసేస్తారు. ఇప్పుడు ఆపిల్ రంగు రెడ్ అన్నట్లు, నిజం చెప్పడానికే భయపడే మీరందరూ నన్ను చూసి నవ్వుతారు. చెప్పే నేను మాత్రం ఎప్పిటికీ వెర్రిదానిలా అవమానంతో తలదించుకోవాలి" అన్నది. 
 
ఒక్కసారి అందరికి సిగ్గనిపించింది....
DEO గారు, కొంచెం అవమానంగా ఫీల్ అయ్యారు. వెంటనే వెళ్లి పోయారు. 
 
మరుసటి సంవత్సరం మా స్కూల్‌కి అన్నీ సదుపాయాలూ చేకూర్చబడ్డాయి. DEO గారు ప్రత్యేకంగా వచ్చి అరుణని మెచ్చుకొన్నారు. 
ఆ సంవత్సరంతో మా చదువులు అయిపోయాయి. 
 
పదిహేను సంవత్సరాలైంది.... ఈ రోజు మా స్కూలుకి వెళ్తే అక్కడ మా సార్ కనిపించారు. స్కూల్ చాలా మారింది. ఇప్పుడు ఏ సమస్యలు లేవు మా స్కూల్లో. ఎందుకంటే ఇప్పుడు మా స్కూలుని నడుపుతున్నది అరుణ కాబట్టి. మా కొత్త స్కూలును చూసి ఎంతో సంతోషమేసింది. 
 
"ఆపిల్ రంగు ఎప్పుడూ తెలుపే - ఎరుపు కాదని ఇప్పుడు అర్థమైంది మాకు. ఎందుకంటే మనుషులలోని మనస్సు చూడాలే కానీ - బయట ఉన్న వేషాలను కాదు అన్న విషయం అర్థమైంది” కాబట్టి.
-శరత్