శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జులై 2020 (15:34 IST)

మైన్ వికాస్ దూబే హూన్ - కాన్పూర్ వాలా : ఉజ్జెయిని ఆలయంలో అరెస్టు

కాన్పూర్‌ ఎన్‌కౌంటర్ కేసు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఉజ్జెయినిలోని మహాకాళ్ ఆలయానికి వచ్చిన వికాస్ దూబేను అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఉజ్జెయిని పోలీసులు అక్కడకు చేరుకుని వికాస్ దూబేను అరెస్టు చేశాయి.కాగా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబే త‌ల‌పై 5 ల‌క్ష‌ల రూపాయల రివార్డు ఉన్న విషయం తెల్సిందే. 
 
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జెయినిలో మ‌హాకాళేశ్వ‌రుడికి పూజ‌లు నిర్వ‌హించేందుకు వికాస్ రాగా, ఈ ఆల‌యంలో ప‌నిచేస్తున్న ఓ గార్డు అత‌న్ని నిర్బంధించిన‌ట్లు తెలుస్తోంది. వికాస్‌ను పట్టుకున్న ఆల‌య గార్డు.. ఆ విష‌యాన్ని ఉజ్జెయిన్ ఎస్పీ మ‌నోజ్ సింగ్‌కు తెలియ‌జేశాడు. 
 
ఆ త‌ర్వాత ఉజ్జెయిని పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు ఆ రాష్ట్ర డీజీపీ ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. దూబే అరెస్టు గురించి యూపీ సీఎం యోగికి శివ‌రాజ్ చెప్పిన‌ట్లు స‌మాచారం.
 
గ‌త వారం కాన్పూర్‌లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో 8 మంది పోలీసులు మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఆ కేసులో వికాస్ ప్ర‌ధాన సూత్రధారి. వికాస్ కోసం గ‌త అయిదు రోజుల నుంచి యూపీ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. 
 
ఇప్ప‌టికే ఈ కేసుతో లింకు ఉన్న న‌లుగురు నేరగాళ్లను పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశారు. కాన్పూర్‌లోని త‌న స్వంత ఇంటి నుంచి త‌ప్పించుకున్న వికాస్ ఆ త‌ర్వాత పోలీసులకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తూ వారికి చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న విషయం తెల్సిందే.