శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 జులై 2020 (14:52 IST)

వికాస్‌దూబే నేరాలు - ఘోరాలు.. ఎమ్మెల్యే కావాలనుకున్నాడు.. కానీ..?

Vikas Dubey
వికాస్‌దూబే ఓ పేరు మోసిన రౌడీ షీటర్‌. 1990లలో చిన్నపాటి దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు చేసే వాడు. తరువాత సొంతంగా తన గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని కాన్పూర్ డాన్‌గా మారాడు. అయితే తన నేరాలను కప్పి పుచ్చుకునేందుకు, వాటి నుంచి తప్పించుకునేందుకు అతను 1995-96లలో బీఎస్‌పీలో చేరి రాజకీయాల్లో ఉన్నాడు. 
 
యూపీలోని బిక్రు అతని సొంత గ్రామం. అది శివ్‌లి పోలీస్ స్టేషన్ కిందకు వస్తుంది. అయినా అక్కడి చౌబేపూర్ పోలీస్ స్టేషన్ అతని అక్రమాలకు అడ్డాగా మారింది. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే వికాస్ దూబేపై ఏకంగా 60 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 
 
అయినా ఇప్పటికీ అక్కడ అతను టాప్ 10 క్రిమినల్స్ జాబితాలో లేడు. కారణం.. చౌబేపూర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే పోలీసు అధికారులు, సిబ్బంది వికాస్ దూబేకు తొత్తులుగా ఉండడమే. అందువల్లే దాదాపుగా 3 దశాబ్దాల నుంచి వికాస్ దూబే నేరాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. గతంలో వికాస్ దూబేను పలుమార్లు అరెస్టు చేశారు. అయినా అతను చేసిన 60 నేరాలకు చెందిన క్రిమినల్ కేసులకు అతనికి ఇంకా శిక్ష పడలేదు. 
 
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న బీజేపీ నాయకుడు సంతోష్ శుక్లాను హత్య చేసింది కూడా వికాస్ దూబేనే. ఓ పోలీస్ స్టేషన్‌లో ఏకంగా 25 మంది సాక్షులు కూడా అతన చంపుతుండడాన్ని చూశారు. ఇది వికాస్ దూబే చేసిన కీలక నేరాల్లో ఒకటి. సంతోష్ శుక్లా హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు ముందు కూడా వికాస్ మరో హత్య చేశాడు. 
 
కాన్పూర్‌లో కేబుల్స్ బిజినెస్ చేసే దినేష్ దూబే అనే వ్యాపారవేత్తను అతను హత్య చేశాడు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనే తన నేరాలను కప్పి పుచ్చుకునేందుకు పలువురు పోలీసు అధికారులు, సిబ్బందితో అతను సత్సంబంధాలను నెలకొల్పుకున్నాడు. 
 
వికాస్ దూబే ఎమ్మెల్యే కావాలని అనుకునేవాడు. జిల్లా పంచాయతీ స్థాయిలో పలు పదవుల్లో పనిచేశాడు. అతని భార్య కూడా జిల్లా పంచాయతీ కమిటీలో సభ్యురాలిగా ఉండేది. వికాస్ సొంత గ్రామం బిక్రులో గత 15 ఏళ్ల నుంచి పంచాయతీ ఎలక్షన్లు లేవు. వికాస్‌కు నచ్చిన వారినే ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. అయితే తాజాగా కాల్పులతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని.. తర్వాత దొరికిపోయాడు.