శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 జూన్ 2020 (10:27 IST)

ఏపీకి మూడు రాజధానులు... పరిపాలన వికేంద్రీకరణ అత్యంత కీలకం

చరిత్రలో తొలిసారి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అసెంబ్లీకి రాకుండా రాజ్‌భవన్‌ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో మూడు రాజధానుల అంశాన్ని గవర్నర్ ప్రస్తావించారు. మూడు రాజధానుల అంశం కీలకం అని.. అది ప్రస్తుతం శాసన ప్రక్రియలో ఉందని గవర్నర్ ప్రకటించారు. ప్రభుత్వం సాధించిన విజయాలన్నింటినీ గవర్నర్ సభ్యుల ముందు ఉంచారు. 
 
ప్రజలకు ఇచ్చిన 122 హామీల్లో 77 హామీలు నెరవేర్చామని..39 హామీలు పరిశీలనలో ఉన్నాయని ప్రకటించారు. మేనిఫెస్టోలో లేని 40 హామీలను కూడా అమలు చేశామన్నారు. సంక్షేమ పథకాల ద్వారా 3.92 కోట్ల మందికి ఏడాదిలో రూ.42 వేల కోట్లు పంపిణీ చేశామన్నారు. 
 
రాష్ట్ర బడ్జెట్‌పై ప్రసంగంలో గవర్నర్‌ మూడు రాజధానుల అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిపాలన వికేంద్రీకరణ అత్యంత కీలకమన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే తన ప్రభుత్వ ఉద్దేశమని గవర్నర్ తెలిపారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యానిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుందని మరోసారి గుర్తుచేశారు.
 
ప్రస్తుతం మూడు రాజధానుల బిల్లు శాసన ప్రక్రియలో ఉందని అన్నారు. మూడు రాజధానులకు తన ప్రభుత్వం కట్టుబడివుందని తెలిపారు. భవిష్యత్తులో తన ప్రభుత్వానికి మంచి రోజులు వస్తాయని, ఈ బిల్లు కూడా ఆమోదం పొందుతుందని గవర్నర్ ఈ సందర్భంగా తెలిపారు.