గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 20 ఫిబ్రవరి 2021 (22:17 IST)

అయోధ్య రామాలయానికి కుప్పలుతెప్పలుగా విరాళాలు, రూ. 1500 కోట్లు దాటేసింది...

అయోధ్య రామాలయం అంచనా వ్యయం రూ. 1500 కోట్లు. ఈ మేరకు ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి. రానున్న మూడేళ్లలో ఆలయాన్ని అంగరంగవైభవంగా నిర్మించాలని నిర్ణయించారు. ఆలయ నిర్మాణానికి 1500 కోట్లు అవుతాయని అంచనా వేయగా, ఆ మొత్తాన్ని ప్రభుత్వం భరించడం సాధ్యం కాదు కనుక విరాళాలు సేకరించాలని ఆలయ ట్రస్ట్ భావించింది.
ఈ మేరకు విరాళాలు సేకరించాలని నిర్ణయించి, అది కూడా ఫిబ్రవరి 27 వరకు మాత్రమే గడువు విధించారు. దీనితో రామన్న ఆలయానికి మావంతు సాయం అని దేశవ్యాప్తంగా ఎంతోమంది తమ విరాళాన్ని అందించారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ మాజీముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ అయోధ్య మందిరానికి ఏకంగా రూ. 11 లక్షల చెక్కును శనివారం అందించారు.
ఐతే ఈ మొత్తం తను వ్యక్తిగతంగా ఇస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల తరుపున కాదన్నారు. ఎందుకంటే... ఇప్పటికే ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ ఈ విరాళాల సేకరణపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఐతే వాటిని పక్కనపెట్టి అపర్ణ విరాళం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఏదేమైనప్పటికీ రాజకీయాలకతీతంగా అయోధ్య రామాలయానికి అనుకున్న మేరకు నిధులు సమకూరాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రూ. 1511 కోట్లు అందినట్లు ఆలయ ట్రస్ట్ వెల్లడించింది. మరో వారం రోజుల సమయం వుంది కనుక ఈలోపు మరెంతమంది తమ విరాళాలను అందిస్తారో చూడాలి.