శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 18 జనవరి 2021 (11:24 IST)

అశోక్ గజపతి రాజుకు మరో అవమానం: రాముడి విగ్రహానికి ఇచ్చిన విరాళం తిరస్కరణ

సీనియర్ టిడిపి నాయకుడు, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుకు మరో అవమానం జరిగింది. ఎపి ఎండోమెంట్స్ విభాగం ఆయన ఇచ్చిన రూ .1,01,116 విరాళాన్ని తిరస్కరించింది. విజయనగరం జిల్లాలో రామతీర్థంలోని రాముని విగ్రహాన్ని కొన్ని వారాల క్రితం దుండగులు అపవిత్రం చేసిన సంగతి తెలిసిందే.
 
తన విరాళాన్ని తిరస్కరించడంపై గజపతిరాజు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసారు. “మొదట, వారు నన్ను ఏకపక్షంగా వంశపారంపర్య ధర్మకర్త/ఛైర్మన్ పదవి నుంచి తొలగించారు. సెక్షన్ 28కి పూర్తి విరుద్ధంగా నోటీసు కూడా జారీ చేయకుండా ఆ పని చేసారు. ఇప్పుడు ఆ రామచంద్రునికి ఇచ్చిన విరాళాన్ని తిరస్కరించారు. ” అని పేర్కొన్నారు.
 
కాగా ఆలయ పరిపాలనలో తన విధులను నిర్వర్తించడంలో టిడిపి నాయకుడు అశోక్ గజపతి రాజు విఫలమయ్యారని పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మూడు దేవాలయాల ఛైర్మన్ పదవి నుంచి ఆయనను తొలగించింది. కాగా ఆగమ మార్గదర్శకాల ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) శ్రీరాముడి కొత్త విగ్రహాన్ని తయారుచేస్తున్నట్లు ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ సి రంగారావు తెలిపారు.
 
మూడు అడుగుల పొడవైన విగ్రహాన్ని ఉచితంగా చేయడానికి టిటిడి ముందుకు వచ్చింది. రామతీర్థం వద్ద ధ్వంసమైన విగ్రహం రాతితో చెక్కబడింది, కొత్త విగ్రహం కూడా అలాగే ఉంటుంది. "కొత్త విగ్రహం కోసం చాలామంది విరాళాలతో ముందుకు వచ్చినప్పటికీ, టిటిడి విగ్రహాన్ని తయారు చేస్తున్నందున మేము వారి విరాళాలను తిరస్కరించాము" అని ఆయన చెప్పారు.