మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 జూన్ 2021 (08:02 IST)

కళ్లముందే కారు మాయం... చూస్తుండగానే భూమిలోకి కుంగిపోయిది.. (VideoViral)

నైరుతి రుతుపవనాల ప్రభావంతోపాటు... అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనద్రోణి ప్రభావం కారణంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. గత కొన్నిరోజులుగా కురుస్తున్న ఈ వర్షాలతో ముంబై నగరం తడిసి ముద్దయింది. 
 
ఈ వర్షాల ధాటికి ముంబై మహానగరంలో ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో నగరంలోని ఘట్కోపర్ ప్రాంతంలో ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. నిలిపి ఉంచిన కారు... ఒక్కసారిగా భూమి కుంగిపోవడంతో, ఆ గుంతలోకి జారిపోయింది. 
 
కుంగిన భూమిలో నీరు ఉబికి రాగా, ఆ నీటిలో కారు పూర్తిగా మునిగిపోవడం దిగ్భ్రాంతి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. అయితే ఆ కారుకు అటూ ఇటూ నిలిపి ఉంచిన వాహనాలు మాత్రం యథాతథంగా ఉన్నాయి.
 
దీనిపై ముంబై ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ఆ కారు నిలిపి ఉంచిన ప్రాంతంలో ఒకప్పుడు బావి ఉండేదని, కాలక్రమంలో దాన్ని మట్టితో నింపేశారని తెలిపారు. కొందరు దానిపై కాంక్రీట్ వేసి పార్కింగ్ ఏరియాగా మార్చుకున్నారని వెల్లడించారు. 
 
ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండడంతో, భూమి కుంగిపోయి ఉంటుందని వివరించారు. ఈ ఘటన జరిగిన సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది.