పాకిస్థాన్ ఏకాకి.. తాటాకు చప్పుళ్లు వద్దంటున్న చైనా - ఎమిరేట్స్ దేశాలు
కాశ్మీర్ వ్యవహారంలో భారత్ దూకుడు ప్రదర్శిస్తుంటే దాయాది దేశం పాకిస్థాన్ బెంబేలెత్తిపోతోంది. ఆర్టికల్ 370 రద్దు భారత అంతర్గత వ్యవహారమని, ఈ విషయంలో తలదూర్చలేని పలు ప్రపంచ దేశాలు స్పష్టం చేశాయి. కానీ, పాకిస్థాన్ మాత్రం తాటాకు చప్పుళ్లు చేస్తోంది. ఇది అంతర్గత వ్యవహారం కాదనీ, అంతర్జాతీయ అంశమంటూ గగ్గోలు పెడుతోంది. అయితే, పాకిస్థాన్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలంటూ కాళ్లావేళ్లాపడుతోంది.
తాజాగా చైనాను సంప్రదించారు. కాశ్మీర్ విషయంలో జోక్యం చెసుకోవాలంటూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ విజ్ఞప్తి చేశారు. అదీ కూడా తక్షణం స్పందించాలంటూ కోరారు. ఆయన వినతిని చైనా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, దక్షిణాసియాలో శాంతి నెలకొనేలా చూడాలని ఇరు దేశాలను మాత్రమే కోరగలమని చైనా తేల్చి చెప్పింది.
అలాగే, ముస్లిం దేశాలు కూడా పాకిస్థాన్‌కు వంతపాడటానిక ముందుకురాలేదు. ఆర్టికల్ 370 రద్దు భారత అంతర్గత వ్యవహారమని, తాము ఏమీ చేయలేమని అరబ్ ఎమిరేట్స్ దేశాలు తేల్చి చెప్పాయి. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా కూడా ఇదే తరహా వైఖరిని వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. దీంతో కాశ్మీర్‌తో పాటు 370 ఆర్టికల్ రద్దు అంశాలపై పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజంలో ఏకాకి అయింది.