శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By మోహన్
Last Updated : బుధవారం, 3 జులై 2019 (12:35 IST)

సినీనటుడు శివాజీని అరెస్ట్ చేసిన పోలీసులు..

గతేడాది ఆపరేషన్ గరుడ అంటూ సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన హీరో శివాజీ మరోసారి ఫోర్జరీ కేసుతో వెలుగులోకి వచ్చాడు. సినీనటుడు శివాజీని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలంద మీడియాకు సంబంధించిన కేసులో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆయన్ను పట్టుకున్నారు. ఈ విషయంపై గతంలోనే శివాజీకి లుకౌట్ నోటీసులను పోలీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 
 
శివాజీ శంషాబాద్ నుంచి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు శివాజీని అదుపులోకి తీసుకుని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ నెల 11వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
 
ఏబీసీఎల్ సంస్థకు సంబంధించిన పత్రాల ఫోర్జరీ, నకిలీ పత్రాలను రూపొందించారన్న ఆరోపణల కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, శివాజీపై తెలంగాణ పోలీసులు గతంలో కేసు నమోదు చేసారు. వీరిని విచారణకు హాజరుకావాల్సిందిగా పలుమార్లు నోటీసులు పంపారు. అంతేకాకుండా వారు విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు లుక్‌అవుట్ సర్క్యులర్ కూడా జారీ చేసారు.