గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 12 జనవరి 2022 (21:51 IST)

సైనా నెహ్వాల్‌కు సిద్ధార్థ్ క్షమాపణలు: కానీ కేసు నమోదు

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పైన నటుడు సిద్ధార్థ్‌ చేసిన వ్యాఖ్యలపై సామాజిక కార్యకర్త ప్రేరణ తిరువాయ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనితో నటుడు సిద్ధార్థ్‌ పైన సెక్షన్‌ 67, ఐపీసీ 509 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

 
కాగా భారత స్టార్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు హీరో సిద్ధార్థ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై సిద్ధార్థ్ నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. సైనాపై సెటైరికల్‌గా చేసిన ట్వీట్ విమర్శలకు దారితీసింది. మహిళా సంఘాలు కూడా సీరియస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సిద్దార్థ్ ట్విట్టర్ ద్వారా సైనాకు క్షమాపణలు చెప్పడంతో పాటు వివరణ ఇచ్చుకున్నాడు.

 
'కొద్దిరోజుల క్రితం మీ ట్వీట్‌పై స్పందిస్తూ నేను వేసిన రూడ్ జోక్‌కి క్షమాణలు చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా విషయాల్లో మీతో ఏకీభవించకపోవచ్చు. ఒక జోక్‌కి మనం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. అది మంచి జోక్ కాదనే అర్థం. అలాంటి జోక్‌ను వాడినందుకు క్షమాపణలు.' అని సిద్దార్థ్ చెప్పుకొచ్చారు. 

 
తాను కూడా స్త్రీ పక్షపాతినే అని.. తన ట్వీట్‌లో లింగపరమైన విషయమేమీ లేదని... మీరొక మహిళ కాబట్టి మీపై దాడి చేసే ఉద్దేశం ఎంతమాత్రం లేదని అన్నారు. సిద్దార్థ్ క్షమాపణల ట్వీట్‌పై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. సిద్దార్థ్ పరిణతితో వ్యవహరించారని... సైనాకు క్షమాపణలు చెప్పడం స్వాగతించదగ్గ విషమని అభిప్రాయపడుతున్నారు.