శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By మోహన్ మొగరాల
Last Updated : గురువారం, 14 ఫిబ్రవరి 2019 (19:26 IST)

ఒక్క హెయిర్ కట్‌కు రూ.28వేలా?

సాధారణంగా కటింగ్‌కి వెళ్లిన వాళ్లు స్థాయికి తగ్గట్టు ఖర్చు చేస్తారు. అందులో 2 వేల వరకు కూడా ఖర్చు చేస్తున్న వాళ్లను చూస్తున్నాము. అయితే ఇప్పుడు అహ్మదాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి ఒక్క చిన్న కటింగ్‌తో రూ.28,000 సంపాదించాడు. అతని నిజాయితీ కారణంగా ఈ మొత్తాన్ని బహుమతిగా పొందడం విశేషం. 
 
నార్వేకు చెందిన హెరాల్డ్ బాల్డర్ దేశ విదేశాలు తిరుగుతూ చిన్న చిన్న వీడియోలను రూపొందించి, వాటిని యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తుంటాడు. భారత పర్యటనకు వచ్చిన అతడు అహ్మదాబాద్‌లో ఆరు బయట వీధిలో ఉన్న సెలూన్‌లో హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు. తొందరగా ట్రిమ్ చేయమని చెప్పి, ఆ తతంగాన్ని అంతా యూట్యూబ్ ఛానెల్ కోసం చిత్రీకరించాడు. 
 
హెరాల్డ్ అతడిని వ్యాపారం గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాడు. అలాగే అతనితో సెల్ఫీలు దిగాడు. కటింగ్‌కి ఎక్కువ అడుగుతాడని భావించిన హెరాల్డ్ ఒక్కసారిగా అతను కేవలం రూ.20 మాత్రమే ఇవ్వమని అడగ్గా ఆశ్చర్యపోయాడు. వెంటనే అతడి జేబులో నుండి 400 డాలర్లు(రూ.28,000) తీసి కటింగ్ చేసిన అతడికి ఇచ్చాడు. 
 
తన ప్రయాణంలో కలిసిన ఒక మంచి వ్యక్తికి బహుమతి ఇచ్చాను అంటూ అతడిని మెచ్చుకున్నాడు. ఆ డబ్బుతో ఏదైనా పరికరం కొనుక్కోమని, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోమని సూచించాడు. చివరగా హెయిర్ డ్రెస్సర్ హెరాల్డ్‌కు ఒక కప్పు కాఫీ కొనిచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు.