బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Modified: మంగళవారం, 6 జులై 2021 (21:24 IST)

మిజోరాం గవర్నర్​గా కంభంపాటి హరిబాబు, ఆయన ఏం చేసారో తెలుసా?

రాష్ట్రంలో భాజపా సీనియర్ నేత కంభంపాటి హరిబాబును మిజోరాం గవర్నర్​గా నియమించారు. ఆయన విశాఖపట్నం లోక్​సభ నుంచి.. 2014లో ఎంపీగా గెలుపొందారు. కంభంపాటి భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పని చేశారు.
 
హరిబాబు ప్రకాశము జిల్లాలోని తిమ్మసముద్రం గ్రామంలో జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ లో బిటెక్ చేశారు. తరువాత అదే విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్​డీ పొందారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనే అసోసియేట్ ప్రొఫెసర్​గా పనిచేసి 1993లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తరువాత క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు.
 
రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తా..
మిజోరాం గవర్నర్ గా నియమించడం సంతోషంగా ఉందని విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. విశాఖలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని,పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ ఎంపీగా, ఏపీ బిజెపి అధ్యక్షుడిగా, అనేక రాష్ట్రాలకు ఇన్​చార్జిగా పని చేసిన అనుభవంతో బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని చెప్పారు.
 
మిజోరాం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం, ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఆ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆ ప్రాంత ప్రజల అభివృద్ధికి పనిచేస్తానని అన్నారు. చిత్తశుద్ధితో పని చేస్తే మంచి అవకాశాలు వస్తాయని అభిప్రాయ పడ్డారు.
 
అభినందనలు..
మిజోరాం గవర్నర్‌గా నియమితులైన కంభంపాటి హరిబాబుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. మిజోరం అభివృద్ధిలో హరిబాబు భాగస్వామి కావాలని వెంకయ్య నాయుడు ఆశించారు.