శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జెఎస్కె
Last Modified: మంగళవారం, 6 జులై 2021 (10:42 IST)

కోవిడ్ సోకిన ప్ర‌భుత్వోద్యోగుల‌కు 30 రోజుల సెలవు!

కోవిడ్ సోకిన ప్ర‌భుత్వోద్యోగుల‌కు 30 రోజులు సెలవులు మంజూరు చేస్తూ జీవో ఎం.ఎస్. 45 విడుద‌ల అయింది. దీనితో ప్ర‌భుత్వోద్యోగులు ఏపీ ముఖ్య‌మంత్రి వై.ఎస్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. 2020 నుంచి అనేక దఫాలుగా జీవో జారీ చేసినందుకు కృత‌జ్ణ‌త‌లు తెలుపుతున్నారు.

గ‌త 2020 మార్చి 25 నుంచి కరోనా బారిన పడిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇపుడు ఈ సెల‌వులు మంజూరు చేశారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు, అంటే, 20 రోజుల సెలవు, 15 రోజుల ప్రత్యేక సాధారణ సెలవులను, అయిదు రోజులు ఎర‌న్ లీవ్, లేదా హెచ్పిఎల్ లను మంజూరు చేస్తూ జీవో విడుద‌ల అయింది. దీనితో ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాస రావు, కె.వి.శివా రెడ్డి సీఎం కు కృత‌జ్ణ్న‌త‌లు తెలియచేసారు.  
 
25-03-2020 నుండి సెలవులు మంజూరు చేయడం వల్ల అనేక మంది ఉద్యోగులు తమ ఆనందాన్ని, హర్షాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. దీని వలన తమకు పని ఒత్తిడి తగ్గి, త్వరగా కరోనా నుండి కోలుకోవడానికి దోహదప‌డుతుందని కరోనా సోకిన ఉద్యోగులు అంటున్నారు.

ఏపీ ఎన్జీవోల సంఘ నాయ‌కులు కార్యనిర్వాహక కార్యదర్శి బి.కృపావరం, కోశాధికారి ఏం.వెంకటేశ్వర  రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కె.జగదీశ్వర రావు, వి.సుబ్బా రెడ్డి, రామ్ ప్రసాద్, రంగారావు, బి.జానకి, బి.తులసి రత్నం లు త‌దిత‌రులు ముఖ్యమంత్రికి  కృతజ్ఞతలు తెలియచేసారు.