గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated : సోమవారం, 5 జులై 2021 (16:00 IST)

ఇక‌పై ఏపీలో దుకాణాలు రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు తెరిచే వుంచవచ్చు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇక‌పై దుకాణాలు రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు తెరిచి ఉంచ‌వ‌చ్చు. క‌రోనా ఉధృతి కార‌ణంగా పెట్టిన క‌ర్ఫ్యూలో స‌డ‌లింపుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న‌ర్ రెడ్డి స‌మ‌క్షంలో జ‌రిగిన కోవిడ్ స‌మీక్ష స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. 
 
ఒక తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల‌లో మాత్రం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ మాత్ర‌మే కర్ఫ్యూ సడలింపులుంటాయి. ఇక్క‌డ సాయంత్రం 6 గంటలకే దుకాణాల మూసివేయాలి. కోవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం లోపు వచ్చేంత వరకూ ఈ ఆంక్షలు కొన‌సాగుతాయి. 
 
మిగిలిన జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకూ సడలింపులుంటాయి. రాత్రి 9 గంటలకే దుకాణాలు మూసివేయాలి. అంటే మ‌రో అర‌గంట ప‌ది వ‌ర‌కు అంద‌రూ ఇళ్ళ‌కు చేరేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ప‌ది దాటాక తిరిగి ఉద‌యం 6 వ‌ర‌కు క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు అమ‌లులో ఉంటాయి. 
 
మ‌రో ప‌క్క సినిమా థియేట‌ర్లు, జిమ్ ల‌కు కోవిడ్ ప్రోటోకాల్స్ తో అనుమ‌తిస్తున్నారు. సినిమాల‌లో ప్రేక్ష‌కుల‌కు సీటుకు, సీటుకు మధ్య ఖాళీ ఉండేలా థియేటర్ల యాజ‌మాన్యాలు చ‌ర్య‌లు తీసుకోవాలి. రెస్టారెంట్లు, జిమ్స్, కళ్యాణ మండపాలు... ఇలా అన్నిచోట్లా కోవిడ్‌ ప్రోటోకాల్స్‌తో అనుమతి తీసుకోవాలి. 
 
జనం ఉండేచోట కచ్చితంగా సీటుకు సీటుకు మథ్యఖాళీ తప్పని సరి. శానిటైజర్, మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి. కోవిడ్‌ విస్తరణను పరిగణలోకి తీసుకుంటూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.