వకీల్ సాబ్ వస్తున్నాడు... జన సేన రారండోయ్ !
బీజేపీతో మిలాఖత్ అయిన తర్వాత, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బొత్తిగా అమరావతికి రావడం మానేశారు. వకీల్ సాబ్ షూటింగుల్లో, ఇతరత్రా పనుల్లో బిజీగా ఉన్నారనేది ఆయన ఆంతరంగీకుల సమాచారం. విజయవాడ-గుంటూరుల మధ్య మంగళగిరిలో జనసేన రాష్ట్ర కార్యాలయంలో పవన్ సాబ్ మీటింగ్ పెట్టి చాలా రోజులు అయిపోయింది. మధ్యలో కరోనా రెండు వేవ్ కూడా వచ్చిపోయింది.
ఆయన ఎప్పుడు వస్తారో అని జన సైనికులు ఆశగా ఎదురుచూపులు చూస్తున్నారు. ఇపుడు మన వకీల్ సాబ్ వచ్చేస్తున్నాడోచ్....అని సమాచారం అందింది. కేడర్ అంతా కార్యాలయానికి వచ్చేయాలని పిలుపు వచ్చింది.
ఈ నెల 6న విజయవాడ పర్యటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తున్నారని ఆ పార్టీ ముఖ్య నాయకుడు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాకు ఉప్పు అందించారు. ఈ నెల 7న మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు జనసేనాని.
ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలు, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, జాబ్ లెస్ క్యాలెండర్ సహా పలు అంశాలపై జనసేన అధినేత చర్చించనున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా చర్చించనున్నారని వివరించారు. పార్టీకి సంబంధించిన పలువురు నేతలతో పవన్ సమావేశం అవుతారన్నారు.
అయితే, బీజేపీతో కలిశాక, పవర్ స్టార్ దర్శనమే కరువైందని పార్టీ క్యాడర్ వాపోతోంది. జనసేన ఇంతకు ముందు సొంతంగా కార్యక్రమాలు చేసేదని, బీజేపీతో కలిశాక అవి కూడా పలచబడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈసారి కోవిడ్ సెంకండ్ వేవ్ తర్వాత, ఫ్రెష్‌గా వస్తున్న జనసేనాని... జనసైనికుల్లో ఎలాంటి నవ్యోత్సాహాన్ని నింపుతారో చూడాలి.