శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: శనివారం, 16 అక్టోబరు 2021 (15:35 IST)

బాబోయ్ చిరుతలు, ఒకటి రెండు కాదు ఒకేసారి నాలుగు తిరుపతిలో..

తిరుపతి నగరంలో చిరుతల సంచారం కలకలం రేపుతున్నాయి. శేషాచలం అటవీ ప్రాంతానికి సమీపంలోనే విశ్వవిద్యాలయాలు ఉండడంతో చిరుతలు ప్రత్యక్షమవుతున్నాయి. మొన్న శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ నేడు వెటర్నరీ యూనివర్సిటీ. ఇలా చిరుతలు తిరుపతి వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
 
తిరుపతిలోని వెటర్నరీ యూనివర్సిటీలో ఒకేసారి నాలుగు చిరుతలు ప్రత్యక్షమయ్యాయి. అది కూడా యూనివర్సిటీ ప్రధాన గేటు నుంచి రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్ళాయి చిరుతలు. ఈ దృశ్యాలన్నీ సి.సి. కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. తెల్లవారుజామునే చిరుతలు ఆ ప్రాంతంలో సంచరించాయి.
 
గతంలోను శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలోని ఇ-బ్లాక్ సమీపంలో చిరుత కనిపించింది. దీంతో ఆ బ్లాక్‌లో విద్యనభ్యసిస్తున్నవిద్యార్థులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. అటవీశాఖాధికారులు చిరుత కోసం వెతికారు. కానీ ఎక్కడా కనిపించలేదు. 
 
దీంతో అటవీశాఖాధికారులు ఘటనా స్థలం నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈరోజు తెల్లవారుజామున ఒకేసారి నాలుగు చిరుతలు కనిపించడంతో వెటర్నరీ యూనివర్సిటీ సిబ్బందితో పాటు అక్కడ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. 
 
విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలంలోకి అటవీశాఖాధికారులు చేరుకున్నారు. సి.సి.ఫుటేజ్‌ను పరిశీలించడంతో పాటు చిరుత సంచరించిన ప్రాంతానికి చేరుకున్నారు. చుట్టుప్రక్కల ఎక్కడా చిరుతలు అటవీశాఖాధికారులకు కనిపించలేదు. ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో దట్టమైన అటవీ ప్రాంతం నుంచి జనావాసాల మధ్యకు వచ్చేస్తున్నట్లు అటవీశాఖాధికారులు భావిస్తున్నారు.