బాయ్‌ఫ్రెండ్ ఉంటేనే కాలేజీకి రండి : అమ్మాయిలకు కాలేజీ సర్క్యులర్ జారీ
సాధారణంగా పబ్‌లలోకి వెళ్లాలంటే అమ్మాయిలు తోడు ఉండాల్సిందే. లేదంటే పబ్బుల్లోకి అబ్బాయిలకు నో ఎంట్రీ. ఇపుడు ఓ కాలేజీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బాయ్‌ఫ్రెండ్ ఉంటేనే కాలేజీకి రావాలని అదీ కూడా ప్రేమికుల దినోత్సవమైన ఫిబ్రవరి 14వ తేదీ లోపు ఖచ్చితంగా బాయ్‌ఫ్రెండ్‌ను సెట్ చేసుకోవాలని విద్యార్థినులకు ఓ కాలేజీ సర్క్యులర్ జారీచేసింది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో వెలుగు చూసింది.
జగతసింగ్‌పుర్ జిల్లాలోని జిగత్‌సింగ్‌పుర్ స్వామి వివేకానంద మెమోరియల్ కాలేజీ (స్వయంప్రతిపత్తి) పేరుతో ఓ నోటీసు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో "ఆడపిల్లలు బాయ్‌ఫ్రెండ్స్‌తో కాలేజీకి రావాలని పేర్కొంది. బాయ్‌ఫ్రెండ్స్ లేకుంటే కాలేజీలోకి అనుమతించేది లేదని అందులో ఆదేశించారు. ఫిబ్రవరి 14వ తేదీ వరకు అందరు అమ్మాయిలకు కనీసం ఒక్క బాయ్‌ఫ్రెండ్ అయినా ఉండాలని. భద్రతా కారణాల దృష్ట్యా ఇది చేస్తున్నాం. సింగిల్ గర్ల్స్‌ను కాలేజీ పరిసరాల్లోకి అనుమతించేది లేదు. వారు తమ ప్రియుడితో దిగిన లేటెస్ట్ ఫోటోను చూపించాలి. ప్రేమను పంచండి" అంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు.
పైగా, కాలేజీ ప్రిన్సిపాల్ సంతకం కూడా ఉండటంతో ఇది నిజమని ప్రతి ఒక్కరూ నమ్మారు. ఈ నోటీసు వైరల్ కావడంతో తేరుకున్న ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కాలేజీ పరువు తీసేందుకే ఎవరో తమ కాలేజీ నకిలీ లెటర్‌హెడ్‌పై ఇలా ప్రచారం చేస్తున్నారని, విచారించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.