శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (16:14 IST)

బిజెపికి జనసేన షాక్, కమలనాథుల పనైపోయిందా?

రాబోయే ఎన్నికల్లో అధికారం మాదేనని చెప్పే కమలనాథులకు పంచాయతీ ఎన్నికల్లో షాక్ తగిలింది. అసలు ఈ ఎన్నికల్లో కమలమే కనిపించలేదు. అటు బిజెపి కూడా ఈ ఎన్నికలకు పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. కానీ అక్కడక్కడ కమలం పార్టీ కార్యకర్తలు పోటీలో కనిపించారు. ఎన్నికల్లో బిజెపి బలపరిచిన అభ్యర్థులు పట్టుమని 50 మంది కూడా గెలవలేదు. కానీ జనసేన మాత్రం గట్టి పోటీ ఇవ్వడమే కాదు.. గౌరవప్రదమైన సీట్లను గెలుచుకుంది.
 
ఎపిలో కీలకంగా ఎదుగతామని చెప్పుకుంటున్న బిజెపికి పంచాయతీ ఎన్నికల్లో ఆశించినంతగా ఫలితాలు రాలేదు. 12 వేలకు పైగా గ్రామాల్లో ఎన్నికలు జరిగితే కనీసం 100 గ్రామాల్లో కూడా బిజెపి జెండా ఎగురలేదు. అటు బిజెపి రాష్ట్ర నాయకత్వం కూడా ఎన్నికలను అంత సీరియస్‌గా తీసుకోలేదు.
 
కిందిస్థాయి క్యాడెర్లో కొంత ఉత్సాహం కనిపించినా అధిష్టానం మాత్రం పట్టించుకోలేదు. అక్కడక్కడ ప్రభుత్వ అధికారులు సహకరించలేదని ఫిర్యాదు చేసిన పార్టీ నేతలు గ్రామస్థాయిలో ఏం జరుగుతుందో అనేది పట్టించుకోలేదు. దీంతో వారికి దిశానిర్దేశం లేకుండా పోయింది.
 
ఎన్నికల్లో అక్రమాలంటూ ఢిల్లీ వరకు వెళ్ళిన బిజెపి ఇక్కడ కనీస ప్రయత్నం చేయలేదంటున్నారు విశ్లేషకులు. ఒక్క సిఎం రమేష్ తప్ప ముఖ్య నేతలెవరూ కనీసం వార్డులలో కూడా గెలుచుకోలేకపోయారు. గ్రామస్థాయిలో విజయం సాధిస్తే పార్టీ నిర్మాణానికి దోహదపడతాయి.
 
లక్షల మంది కార్యకర్తలు ఉన్నారన్న బిజెపి ఆ ప్రభావం కొంతమేరకు కూడా చూపలేకపోయింది. గెలుపు సంగతి పక్కనబెడితే బిజెపి నుంచి కొన్ని చోట్ల నామినేషన్లు కూడా పడలేదు. పార్టీ పెద్దలు సీరియస్‌గా తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని కేడర్ అంటోంది. గెలుపు, ఓటమి ఎలా ఉన్నా పోటీ చేసి ఉంటే బాగుండేదన్నది పార్టీలోని చాలామంది వాదన.
 
ఇదిలా ఉంటే బిజెపితో ఉన్న జనసేన మాత్రం పంచాయతీ ఎన్నికల్లో ఉనికిని చాటుకుంది. చెప్పుకోదగ్గ స్థాయిలోనే విజయాన్ని కైవసం చేసుకుంది. ఎన్నికల ముందు వరకు చర్చలో లేని జనసేన పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల గట్టి పోటీనే ఇచ్చింది. ఆయా గ్రామాల్లో టిడిపితో సర్దుబాటు చేసుకుని వార్డులను గెలిచింది. గోదావరి జిల్లాల్లో గౌరవప్రదమైన స్థాయిలో సర్పంచుల స్థానాలను గెలుచుకుంది జనసేన. కానీ తామే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న కమలనాథులు మాత్రం పల్లెపోరులో ఉనికి చాటులేకపోయారు.