ఎన్నికల టైమ్ : పరుగుల రాణిపై కన్నేసిన కమలం
కేరళ రాష్ట్ర శాసనసభకు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో కమలనాథులు ఉన్నారు. ఇందుకోసం ఆ పార్టీ నేతలు వ్యూహ రచనలు చేస్తున్నారు. ఇందుకోసం మంచి పేరున్న వారిని పార్టీలో చేరుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కర్నాటక రాష్ట్రానికి చెందిన మెట్రో మ్యాన్ శ్రీధరన్‌ను పార్టీలో చేర్చుకుంది. ఆ కోవలోనే పరుగుల రాణిగా గుర్తింపువున్న పీటీ ఉషను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
వ్యవసాయ చట్టాల విషయంలో ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చారు. ఈ మధ్యే ఉష చేసిన ట్వీట్లు కూడా బీజేపీకి మద్దతుగానే ఉన్నాయి. వ్యవసాయ చట్టాలపై గ్రెటా థన్‌బర్గ్, సింగర్ రిహానా చేసిన ట్వీట్లను ఖండించిన ప్రముఖుల్లో పీటీ ఉష కూడా ఉన్నారు. బీజేపీకి కేరళ నుంచి పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే అది కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్యే చేతులు మారుతోంది.
తన మిషన్ సౌత్‌లో భాగంగా ఈసారి కేరళలోనూ తన మార్క్ చూపించాలని బీజేపీ చూస్తోంది. శ్రీధరన్, పీటీ ఉషలాంటి ప్రముఖలతో ఓట్లకు గాలం వేయడానికి కాషాయ పార్టీ ఎత్తులు వేస్తోంది. ముఖ్యంగా వీళ్లు కేరళ పట్టణ ఓటర్లను ఆకర్షించగలరని ఆ పార్టీ బలంగా విశ్వసిస్తోంది. వీళ్లతోపాటు కేరళకు చెందిన ప్రముఖ సినిమా స్టార్లు, కళాకారులను కూడా తమ పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తోంది.