శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 జులై 2023 (16:23 IST)

ఢిల్లీలో పదేళ్ల బాలికపై అమానుషం... మహిళా పైలెట్ - ఆమె భర్తపై మూకదాడి..

mob attack
ఢిల్లీలో దారుణం జరిగింది. ఇంట్లో పనికి పెట్టుకున్న పదేళ్ల బాలికపై మహిళా పైలెట్, ఆమె భర్త చిన్నారి పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. బాలిక అని కూడా చూడకుండా ఆమెను తీవ్రంగా హింసించారు. ఈ విషయం తెలుసుకున్న చిన్నారి బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురై ఆ పైలట్‌, ఆమె భర్తపై మూకదాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
 
ఈ ఘటన ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానికంగా నివసిస్తున్న ఒక మహిళ ఓ విమానయాన సంస్థలో పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త కూడా ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగే. వీరు రెండు నెలల కిందట ఓ 10 ఏళ్ల బాలికను ఇంట్లో పనికి కుదుర్చుకున్నారు.
 
అయితే, ఈ ఉదయం బాలికను చూసేందుకు వచ్చిన ఆమె బంధువు ఒకరు చిన్నారి శరీరంపై గాయాలను గుర్తించారు. పైలట్‌, ఆమె భర్త.. చిన్నారిని హింసిస్తున్నట్లు తెలుసుకున్న బాలిక బంధువు పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే, పోలీసులు వచ్చేలోగా ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, బాలిక బంధువులు మహిళా పైలట్‌ ఇంటి ముందుకు వచ్చి ఆ దంపతులతో గొడవపడ్డారు. వీధిలోకి లాగి వారిపై మూకదాడికి దిగారు.
 
యూనిఫామ్‌లో ఉన్న మహిళా పైలట్‌ను కొందరు మహిళలు జుట్టు పట్టి లాగి, కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అడ్డువచ్చిన పైలట్‌ భర్తపైనా దాడి చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మూకను అడ్డుకున్నారు.
 
మైనర్‌ బాలికను పనిలో పెట్టుకున్నందుకు గానూ కేసు నమోదు చేసి పైలట్‌, ఆమె భర్తను అరెస్టు చేశారు. చిన్నారికి వైద్యపరీక్షలు నిర్వహించామని, ఆమెపై లైంగిక వేధింపులు జరగలేదని పోలీసులు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.