ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 16 జులై 2023 (14:15 IST)

పొరుగింటివారి గొడవతో మనస్తాపం - మహిళ ఆత్మహత్య - లారీ కింద పడి భర్త మృతి

పొరుగింటివారు గొడవపడ్డారు. దీన్ని చూసిన మహిళ తీవ్ర మనోవేదనకు గురైంది. దీంతో మనస్తాపంతో ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమె మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తరలిస్తుండగా.. భర్త లారీ కింద పడి మృతి చెందారు. జిల్లాలోని లక్సెట్టిపేట మండలంలోని ఎల్లారంలో ఈ ఘటన జరిగింది. 
 
పోలీసుల కథనం మేరకు.. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా లక్సెట్టిపేట మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన మల్లికార్జున్‌ రావు (31), శరణ్య (29) దంపతులు. పొరుగింటి వారితో జరిగిన గొడవతో మనస్తాపం చెంది ఈనెల 13న శరణ్య పురుగుల మందు తాగింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను కరీంనగర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ శరణ్య చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. 
 
ఆదివారం మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తున్న క్రమంలో.. లక్సెట్టిపేటలోని కరీంనగర్‌ చౌరస్తా వద్ద మల్లికార్జున్‌ రావు వస్తున్న బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మల్లికార్జున్‌ అక్కడికక్కడే మృతిచెందారు. దంపతుల మృతితో వారి ఇద్దరి పిల్లలు అనాథలు మారారని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.