1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 జులై 2023 (14:09 IST)

సీమా హైదర్‌ను పాకిస్థాన్‌కు పంపకుంటే 26/11 తరహా ఉగ్రదాడి పునరావృతం

ఆన్‌లైన్‌లో పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన వ్యక్తిని ప్రేమించి.. అతన్ని పెళ్లి చేసుకునేందుకు తన భర్తను వదిలిపెట్టి రెండు దేశాల సరిహద్దులు దాటి భారత్‌లో అడుగుపెట్టిన పాకిస్థాన్ మహిళ సీమా గులాం హైదర్‌ను తిరికి స్వదేశానికి పంపించాలని లేనిపక్షంలో 26/11 తరహా ఉగ్రదాడులు తప్పవని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు హెచ్చరించారు. ఈ మేరకు ముంబై పోలీసులకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి.

గురువారం ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూంకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఈ  కాల్ చేసిన వ్యక్తి ఉర్దూలో మాట్లాడాడు. కానీ ఇది ఫేక్ బెదిరింపుగా పోలీసులు భావిస్తున్నారు. బెదిరింపు సందేశం పంపించిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. 'ముంబై తరహా దాడులకు సిద్ధంగా ఉండండి... దీనికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలి...' అంటూ గుర్తు తెలియని హెచ్చరించాడు.

కాగా, నలుగురు పిల్లలు కలిగిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్‌కు పబ్జీ గేమ్ ద్వారా భారత వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి... అతనిని పెళ్లి చేసుకోవడానికి భారత్‌లో అక్రమంగా ప్రవేశించింది. ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘిస్తూ భారత్‌లో అక్రమంగా ప్రవేశించినందుకుగాను సీమా హైదర్‌ను, ఆమెకు ఆశ్రయం కల్పించినందుకు 22 ఏళ్ల సచిన్ మీనా, అతని తండ్రిని గ్రేటర్ నోయిడా పోలీసులు ఈ నెల ప్రారంభంలో అరెస్టు చేయగా, ఆ తర్వాత వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

సీమా హైదర్ పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని రింద్ హజానా గ్రామ నివాసిగా గుర్తించారు. పబ్జీ ద్వారా సచిన్ మీనాతో పరిచయం ఏర్పడింది. ఆమె తన నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ నుండి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించింది. ఎలాంటి వీసా లేకుండానే ఆమె గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతంలో నెల రోజులుగా ఉంటుంది.