శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 డిశెంబరు 2020 (12:03 IST)

ఆన్‌లైన్ వెడ్డింగ్ : వెబ్ కాస్టింగ్ ద్వారా వివాహం... ఫుడ్ డోర్ డెలివరీ...

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రతి ఒక్కరూ జడుసుకుంటారు. ఈ వైరస్ కారణంగా అంగరంగ వైభవంగా జరగాల్సిన విందులు, వినోదాలు, శుభకార్యాలు, ఆధ్యాత్మిక వార్షిక ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పెళ్లిళ్లు సైతం నలుగురిని ఇంటికి పిలిచి వివాహాలు జరిపించలేని పరిస్థితి నెలకొంది. 
 
ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త కుటుంబం తమ ఇంటి వివాహాన్ని వెబ్ కాస్టింగ్ ద్వారా నిర్వహిచారు. పైగా, వివాహ విందు భోజనాన్ని ఆహ్వానితులకు డోర్ డెలివరీ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తమిళనాడుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త కుటుంబం తమ ఇంట పెళ్లిని తలపెట్టింది. పెళ్లిని వైభవంగా జరిపించాలని ప్లాన్ చేసింది. కానీ, తాము ఆహ్వానించాలనుకున్న అతిథులు వచ్చే వీల్లేకపోవడంతోనే ఈ విధంగా వినూత్నంగా ఆ కుటుంబం ఆలోచించింది. 
 
అంతే.. పెళ్లి విందును ఆహ్వానితుల ఇంటికే పంపడం, పెళ్లి ఆహ్వానపత్రికతో పాటు వెబ్ కాస్టింగ్ టైమింగ్, 'కల్యాణ సాపాటు' (వివాహ విందు)ను కూడా పంపించింది. నాలుగు రంగురంగుల టిఫిన్ బాక్సుల్లో మొత్తం 18 రకాల వంటకాలను ఇళ్లకే పంపింది.
 
పైగా, విందుతో పాటు అరిటాకులను, ఏ వంటకం ఎక్కడ వడ్డించుకోవాలన్న విషయాన్ని కూడా ఆ కుటుంబం ముందుగానే ఆహూతులకు తెలుపగా, దాన్ని అందుకున్న ఓ ట్విట్టర్ యూజర్, తన సోషల్ మీడియా ఖాతాలో ఫోటోలు పెట్టడంతో అదిప్పుడు వైరల్ అవుతోంది. మొత్తం ఆ పారిశ్రామికవేత్త తమ ఇంటి పెళ్లిని వెబ్ కాస్టింగ్ ద్వారా నిర్వహించినప్పటికీ.. దాన్ని ఘనంగానే పూర్తి చేశారు.