నెలకు సరిపడ నిత్యావసరాలతో ట్రాక్టర్లపై ఢిల్లీకి బయలుదేరిన రైతులు!
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. ఇవి రైతుల పాలిట శాపాలని, ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు ఛలో ఢిల్లీ పేరుతో కదంతొక్కారు.
ఢిల్లీ సరిహద్దుల్లో తిష్టవేసిన రైతులు గత 11 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అదేసమయంలో రైతుల సమస్యలపై కేంద్ర మంత్రులు చర్చలు జరుపుతూనే వున్నారు. అయినప్పటికీ, ఈ చర్చలు సఫలం కావడం లేదు.
ఈ క్రమంలో కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతు పెరుగుతోంది. ఈ నెల 8వ తేదీన తలపెట్టిన భారత్ బంద్‌కు అనేక పార్టీల మద్దతు ప్రకటించాయి.
మరోవైపు, రైతులను శాంతింపజేసేందుకు కేంద్రం చర్చలు జరుపుతున్నప్పటికీ ప్రతిష్టంభన మాత్రం తప్పడం లేదు. ఫలితంగా ఆందోళన విరమించేందుకు రైతులు ససేమిరా అంటున్నారు.
మరోవైపు ఎల్లుండి తలపెట్టిన భారత బంద్‌కు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
బిజ్నోర్, ముజఫర్‌నగర్, షామ్లీ, మీరట్ తదితర జిల్లాలకు చెందిన వందలాదిమంది రైతులు నెలకు సరిపడా నిత్యావసరాలతో ట్రాక్టర్లపై ఢిల్లీకి బయలుదేరారు. అలాగే, ఇతర రాష్ట్రాల నుంచి అనేక రైతు సంఘాల నేతలు కూడా ఢిల్లీ బాటపట్టారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి.