శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 ఆగస్టు 2021 (13:01 IST)

విమానం టైర్లను పట్టుకొని వెళ్ళిన ఆ ఇద్దరు అన్నదమ్ములు... (video)

మొన్న అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం టైర్లను పట్టుకొని వెళ్లడానికి ప్రయత్నించి ముగ్గురు వ్యక్తులు కింద పడి మరణించిన ఘటనకు సంబంధించిన వీడియో ఎంత వైరల్ అయిందో తెలుసు కదా. ఇది చూసి ప్రపంచమంతా నివ్వెరపోయింది. అయితే తాజాగా అలా కింద పడిన ముగ్గురిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నట్లు ఓ రిపోర్ట్ వెల్లడించింది.
 
వివరాల్లోకి వెళితే.. విమానం నుంచి కింద పడిన ముగ్గురిలో ఇద్దరు తోబుట్టువులు 17 ఏళ్ల రెజా, 16 ఏళ్ల కబీర్ (రిపోర్ట్‌లో పేర్లు మార్చారు) ఉన్నారు. వాళ్లు కింద పడుతున్న సమయంలో చూసిన వాళ్లు ఆ ఇద్దరి వివరాలు వెల్లడి కావడంలో సాయం చేశారు. ఈ ఇద్దరిలో పెద్ద వాడైన రెజా మృతదేహం ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరలోని ఓ భవనంపైన లభించింది. అతని కుటుంబ సభ్యులు గుర్తించారు. కబీర్ జాడ మాత్రం ఇంకా తెలియలేదు. 
 
రెజా కిందపడినప్పుడు అతని కాళ్లు, చేతులూ పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. అతన్ని నేనే తీసుకెళ్లి ఖననం చేశానని ఓ కుటుంబ సభ్యుడు తెలిపాడు. అయితే కబీర్ జాడ మాత్రం ఎంత వెతికినా దొరకలేదని అతడు చెప్పాడు.
 
ఆఫ్ఘనిస్థాన్ మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని తెలియగానే ఈ ఇద్దరు అన్నదమ్ములు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో కెనడా లేదా అమెరికాలో 20 వేల మంది ఆఫ్ఘన్లకు ఆశ్రయమిస్తున్నట్లు ఎవరో ఇరుగుపొరుగు మాట్లాడుకుంటే విని ఈ ఇద్దరూ ఎయిర్‌పోర్ట్‌కు పరుగు తీశారు. 
 
ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన గుర్తింపు కార్డు తీసుకొని వెళ్లిపోయారని సదరు కుటుంబ సభ్యుడు చెప్పాడు. తాలిబన్లంటే భయంతోనే ప్రతి ఒక్కరూ ఇలా దేశం విడిచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆ వ్యక్తి తెలిపాడు. ఆ కుటుంబంలో మొత్తం 8 మంది సంతానం కాగా.. ఈ ఇద్దరే అందరి కంటే పెద్ద వాళ్లు.