మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 17 జులై 2021 (12:20 IST)

World Emoji Day: విష్ యు హ్యాపీ బర్త్ డే ఎమోజీ

ఈ రోజు జులై 17... వ‌ర‌ల్డ్ ఎమోజీ డే! అవును డిజిట‌ల్ మీడియా, సోష‌ల్ మీడియాలో ఉన్న‌వారికి ఎమోజీ సుప‌రిచిత‌మే. క‌ష్టం, సుఖం, బాధ‌, ప్రేమ‌, సంతోషం ఇలా ఏ ఫీలింగ్ క‌లిగినా ముందుగా... ముఖ్యంగా కుర్ర‌కారు వాడేది ఎమోజీ... అత్యంత సులువుగా త‌మ మ‌నోభావాల‌ను ఎదుటి వారికి డిజిట‌ల్ ప్లాట్ఫాంలో పంపే సింబ‌ల్‌నే ఎమోజీ అంటారు. అంటే ప్రేమ‌కు ల‌వ్ గుర్తు, ఓకే అన‌డానికి థ‌మ్స్ అప్ గుర్తు, ఇక విషాదానికి క‌న్నీరు కార్చే ఎమోజీ... ఇలా వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్ట‌ర్ లాంటి అన్ని డిజిట‌ల్ మీడియాల్లో ఎమోజీల పాత్ర చాలా ప్ర‌ముఖం.
 
అందుకే ఈ రోజు అంత‌ర్జాతీయ స్థాయిలో వ‌ర‌ల్డ్ ఎమోజీ డేని జ‌రుపుకుంటున్నారు. ఈ టెక్ యుగంలో ఎమోజీ డిజిటల్ క‌మ్యూనికేష‌న్లో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఎంతో పెద్ద భావాన్ని చిటిక‌లో వెల్ల‌డించ‌గ‌ల నేర్పు, కూర్పు ఎమోజీలో ఉంది. అన్న‌ట్లు ఈ ఎమోజీ ఎప్పుడు పుట్టిందో మీకు తెలుసా? స‌రిగ్గా పుష్క‌ర కాలం క్రితం... 1999లో జ‌పాన్‌కు చెందిన కంప్యూట‌ర్ కోడింగ్ చేసే షిగేత‌కా కురీతా ఈ ఎమోజీకి ఆద్యుడు.
 
జ‌పానీయులు త‌మ పేజ‌ర్‌కి హార్ట్ సింబ‌ల్ పంపుకునేలా తొలి ఎమోజీని ఈయ‌నే రూపొందించాడు. అది కాస్తా, అంద‌రికీ బాగా త‌లెకెక్కింది... మంచి కిక్ ఇచ్చింది. దీనితో యూనికోడ్ క‌న్సార్టియం అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో ఎమోజీ క్యారెక్ట‌ర్ల‌ను అన్ని సాఫ్ట్వేర్ రంగాల‌కు ప‌రిచ‌యం చేసింది. 
 
ఇప్ప‌టికీ అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన ఎమోజీ హార్ట్ సింబ‌లే కావడం విశేషం. ఈ హార్ట్ సింబ‌ల్ ఇపుడు ర‌కర‌కాలున్నా... అందులో రెండు బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. ఒక‌టి రెడ్ హార్ట్ సింబ‌ల్, రెండోది హార్ట్ సూట్.
 
నేను నిన్ను ప్రేమిస్తున్నా... అంటూ, పేజీల‌కు పేజీలు క‌విత‌లు రాసేక‌న్నా... చిటిక‌లో... ఒక్క రెప్ప‌పాటు కాలంలో... ఎదుటి వారికి ఈ హార్ట్ ఎమోజీ ద్వారా మ‌న ప్రేమ భావాన్ని వ్య‌క్తీక‌రించే సౌల‌భ్యం ఈ హార్ట్ ఎమోజీలో ఉంది. అందుకే, ప్రేమ కాముకులు, కుర్ర‌కారు ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ ల‌వ్ ఎమోజీని డిజిట‌ల్ ప్లాట్ఫామ్ లో తెగ వాడేస్తున్నారు.
 
అలాగే, బాధ‌, దుఃఖం, నిర్లిప్త‌త‌, అస‌హాయ‌త‌ల‌ను వ్య‌క్తీక‌రించ‌డానికి టియ‌ర్స్ ఆఫ్ జాయ్ క‌న్నీళ్ల బొమ్మ ఉండ‌నే ఉంది. ప్రేమ విఫ‌లం అయినా, ప్రేమ త‌గ్గుతున్నా... బాధిస్తున్నా ఈ సింబ‌ల్‌ని ప్రేమికులు చ‌టుక్కున వాడేస్తారు. త‌న భాగ‌స్వామికి త‌న బాధ‌ను క‌న్నీటి ఈమోతో తెలియ‌జెపుతారు. ఇది కూడా ఎమోజీల్లో ఎక్కువ‌గా వాడుతున్న సింబ‌ల్‌నే. సోష‌ల్ మీడియాలో రెండు బిలియ‌న్ల సార్లు అంటే, రెండు వంద‌ల కోట్ల‌కు పైగా ఈ సింబ‌ల్‌ని వాడార‌ని అంచ‌నా.
 
ఇక ప్రొఫెష‌నల్‌గా, కూల్‌గా... ఓకే ఓకే అంటూ చాలా మంది వాడేది థ‌మ్స్ అప్... ఏదైనా ఎవ‌రైనా చెప్పినా, ప్ర‌శ్నించినా, మీకు ఇష్ట‌మేనా... ఈ ప‌ని చేస్తారా? అని అడిగిన‌పుడు జ‌స్ట్ ధ‌మ్స్ అప్ సింబ‌ల్ పెట్టాస్తారు. నాకు ఓకే అని చెప్ప‌డానికి ఈ ఎమోజీని త‌ర‌చూ వాడుతున్నారు. ఇక ఫేస్ బుక్ ల‌లో ఎక్కువ‌గా స్మైలింగ్ ఫేస్ విత్ హార్ట్ ఐస్ ఎమోజీని ఎక్కువ‌గా వాడుతుంటారు.
 
వ‌ర‌ల్డ్ ఎమోజీ సంద‌ర్భంగా గ‌ణాంకాలు తీస్తే, అందులో ఈ సింబ‌ల్‌కే ఎక్కువ మార్కులు ప‌డ్డాయ‌ట‌. ఇక బ‌ర్త్ డే కేక్, క్యాండిల్స్, పువ్వ‌ులు, కాయ‌లు, జంతువులు, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు... ఒక‌టా రెండా ల‌క్ష‌ల ఎమోజీ ఇపుడు డిజిట‌ల్ ప్లాట్ఫాంలో రాజ్య‌మేలుతున్నాయి. అందుకే ఈ ఎమోజీల‌కు హ్యాపీ బ‌ర్త్ డే చెప్పేద్దామా.