శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 14 అక్టోబరు 2024 (17:16 IST)

ఆమ్రపాలి ఏపీకి వెళ్లాల్సిందేనా, ఐఏఎస్, ఐపీఎస్‌లకు కేడర్లు ఎలా కేటాయిస్తారు?

Amrapali
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో సీఎండీ రొనాల్డ్ రోస్ సహా 8 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లను ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ ఆదేశాల వెనుక ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఏపీ, తెలంగాణ కేడర్‌లుగా విభజించారు. అయినప్పటికీ, కొందరు అధికారులు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (సీఏటీ) ఆదేశాలతో తెలంగాణలో కొనసాగుతున్నారు. వారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది.
 
అలాగే, తెలంగాణకు కేటాయించినా, ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న వారు తెలంగాణలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం తెలంగాణ నుంచి ఐదుగురు ఐఏఎస్‌లు ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, ప్రశాంతి, వాణీ ప్రసాద్, ముగ్గురు ఐపీఎస్‌లు అంజనీ కుమార్, అభిషేక్ మహంతి, అభిలాష్ బిస్త్ ఏపీకి వెళ్లాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు సృజన, శివశంకర్, హరికిరణ్ తెలంగాణకు రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు కేడర్ అంటే ఏమిటి, కేడర్ బదిలీలు ఎలా చేస్తారు?
 
కేడర్ అంటే...
సివిల్స్ సర్వీసెస్‌లో కేడర్ అనేది ఒక ప్రాంతాన్ని సూచిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఒక రాష్ట్రాన్ని లేదా కేంద్రపాలిత ప్రాంతాన్ని కేడర్‌గా చెబుతారు. సివిల్ సర్వీసెస్ అధికారులకు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత డీఓపీటీ లేదా కేంద్ర హోంశాఖ వారిని ఏ రాష్ట్రానికి కేటాయిస్తారో.. దానిని ఆ రాష్ట్ర కేడర్‌గా పిలుస్తుంటారు. ఉదాహరణకు... రమేష్ అనే అధికారిని డీవోపీటీ ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తే ఆయన్ను ఏపీ కేడర్ అధికారి అంటారు. కేడర్‌లను ఐఏఎస్‌లకు డీఓపీటీ, ఐపీఎస్‌లకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్ణయిస్తాయి. డీఓపీటీ వివరాల ప్రకారం... ఇండియాను 5 జోన్లుగా విభజించారు. జోన్-5లో దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఉంటాయి.
 
గతంలో అంతా ఒకటే జోన్‌గా ఉండేదని, ప్రస్తుతం వాటిని 5 జోన్లుగా విభజించారని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. “అభ్యర్థులు పోస్టింగ్ కోసం జోన్లు, కేడర్ ఆధారంగా ప్రిఫరెన్సులు పెట్టుకోవాలి. ఖాళీలను ఇన్‌సైడర్స్‌ను 1/3 నిష్పత్తిలో, అవుట్ సైడర్స్‌ను 2/3 నిష్పత్తిలో భర్తీ చేస్తారు. ఇన్‌సైడర్స్ అంటే సొంత రాష్ట్రానికి చెందిన వాళ్లు, అవుట్‌సైడర్స్ అంటే వేరే రాష్ట్రానికి చెందినవాళ్లు” అని లక్ష్మీ నారాయణ చెప్పారు.
 
బదిలీలు ఎలా?
సాధారణంగా ఒకసారి కేడర్ కేటాయిస్తే దానిని మార్చడం కష్టం. కానీ, కొన్ని సందర్భాల్లో మాత్రమే బదిలీకి వెసులుబాటు ఉంది. అవేమిటంటే..
 
పెళ్లి:
వేరువేరు కేడర్‌లలో పని చేస్తున్న అధికారులు పెళ్లి చేసుకుంటే.. వాళ్లిద్దరూ ఒకే కేడర్ లో పని చేసేందుకు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. వీటిని డీఓపీటీ పర్యవేక్షిస్తుంది.
 
ఇంటర్ కేడర్ డిప్యుటేషన్:
“సర్వీసులో ఎప్పుడైనా సరే, ఓ 5 ఏళ్ల కాలం పాటు వేరే కేడర్‌లో పని చేసే అవకాశం ఉంటుంది. దీనికి పని చేస్తున్న రాష్ట్రం, పని చేయాలనుకుంటున్న రాష్ట్రం ఒప్పుకోవాలి. దీనిని ఇంటర్ కేడర్ డిప్యుటేషన్ అంటారు” అని లక్ష్మీనారాయణ చెప్పారు. ఇదే బాటలో.. ఇటీవల కేరళలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజను ఏపీ కేడర్‌లోకి తీసుకువచ్చారు. ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా పని చేస్తున్నారు. “ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం అవసరం మేరకు ఒక కేడర్ నుంచి వేరే కేడర్‌కు అధికారులను బదిలీ చేయవచ్చు. ఆ కోవలోనే నన్ను మహారాష్ట్ర కేడర్ నుంచి కొన్నాళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు బదిలీ చేశారు” అని లక్ష్మీనారాయణ చెప్పారు.
 
డీఓపీటీ, క్యాట్ ఏం చేస్తాయి?
ప్రభుత్వ కార్యాలయాలకు సమర్థవంతమైన మానవ వనరులను అందిచడం డీఓపీటీ ప్రధాన లక్ష్యం. దీని కింద యూపీఎస్సీ ఒక్కటే కాదు.. సెంట్రల్ ఇన్‌ఫర్మేషన్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, లోక్‌పాల్ వంటివి ఉంటాయని డీఓపీటీ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల నియామకాలు, బదిలీల వంటి విషయాల్లో సమస్యలు తలెత్తినప్పుడు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌ (క్యాట్)ను ఆయా ఉద్యోగులు ఆశ్రయించడం చూస్తుంటాం. క్యాట్ అనేది ఓ న్యాయ విభాగం. “కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల నియామకాలు, బదిలీల వంటి విషయాల్లో సమస్యలు తలెత్తితే ఈ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. దీని వల్ల ఉద్యోగుల సమస్యలు వేగంగా పరిష్కారమై కోర్టులపై భారం తగ్గుతుంది” అని క్యాట్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
 
అందరి దారి హైదరాబాదే
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో సివిల్ సర్వీస్ అధికారుల విభజన కోసం ప్రత్యూష్ సిన్హా కమిటీని నియమించారు. ఈ కమిటీ ఆధారంగా ఫైనల్‌ కేడర్లను 2015లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. “కొత్త రాష్ట్రం, అందులోనూ తెలంగాణలో మెట్రోసిటీ హైదరాబాద్ ఉండటంతో చాలా మంది అధికారులు ఇక్కడే పని చేయడానికి ఆసక్తి చూపారు. అందులో భాగంగా కొందరు క్యాట్‌ను ఆశ్రయించి దాని ఆదేశాల మేరకు ఇక్కడే కొనసాగుతున్నారు” అని లక్ష్మీనారాయణ చెప్పారు. కేంద్రం నిర్దేశించిన కేడర్లపై ఆమ్రపాలి 2015లో క్యాట్‌ను ఆశ్రయించారు. 2016లో డీఓపీటీ ఆదేశాలను కొట్టివేస్తూ.. ఆమ్రపాలి తెలంగాణలో పని చేసుకునేలా క్యాట్ తీర్పునిచ్చింది.
 
క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ 2017లో తెలంగాణ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది. 2024 జనవరిలో తెలంగాణ హైకోర్టు 2016లో క్యాట్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో, ఈ నెల 16లోగా తెలంగాణలో క్యాట్ ఆదేశాలతో కొనసాగుతున్న ఆమ్రపాలి రిలీవ్ అయి ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేయాలని డీఓపీటీ ఆదేశాలిచ్చింది.