శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 6 నవంబరు 2024 (21:21 IST)

డోనల్డ్ ట్రంప్: భారత్‌తో అమెరికా సంబంధాలు ఎలా ఉండనున్నాయి?

Modi-Trump
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డోనల్డ్ ట్రంప్ గెలిచారు. ట్రంప్ గతంలో 2017 నుంచి 2021 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన విధానాలు దాదాపుగా ప్రపంచం మొత్తానికి తెలుసు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి చాలా విషయాల్లో ట్రంప్‌ పాలనతో అనుభవం ఉంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు కానున్న తరుణంలో భారత్, అమెరికా మధ్య ఎలాంటి సంబంధాలు ఉండనున్నాయి. ఏయే రంగాలలో అనుకూలతలున్నాయి, ఏయే రంగాలలో ప్రతికూలతలు ఉన్నాయి? ట్రంప్ చాలాసార్లు నరేంద్ర మోదీని తన స్నేహితునిగా అభివర్ణించారు. కానీ, అదే సమయంలో భారత విధానాలను వ్యతిరేకించారు. ఈ ఎన్నికల్లో కూడా ప్రధాని మోదీ పేరును చాలాసార్లు ప్రస్తావించారు.
 
ఆర్థిక, వ్యాపార సంబంధాలు ఎలా ఉంటాయి?
ట్రంప్ ఆర్థిక విధానాలు ఎక్కువగా ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదానికి అనుగుణంగా ఉంటాయి. ట్రంప్ తన తొలి పదవీ కాలంలో అమెరికా పరిశ్రమల కోసం రక్షణాత్మక విధానాన్ని అనుసరించారు. భారత్, చైనా సహా చాలా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీ సుంకాలను విధించారు. అలాగే అమెరికా ఉత్పత్తులు, సేవల దిగుమతులపై అత్యధిక సుంకాలు విధించే దేశాలపై ఆయన కఠిన చర్యలు తీసుకోగలరు. భారత్ కూడా ఈ కేటగిరీలోకి వస్తుంది.
 
హార్లీ డేవిడ్‌సన్ మోటార్‌ సైకిళ్లపై సుంకాలను తగ్గించాలని లేదా తొలగించాలని అమెరికా, భారత్‌ను కోరవచ్చు. ‘‘వాణిజ్య నిబంధనలను భారత్ బాగా ఉల్లంఘిస్తుందని ట్రంప్‌ భావిస్తున్నారు. అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలను భారత్ విధించడం ఆయనకు నచ్చడం లేదు. తమ దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై కేవలం 20 శాతం వరకే సుంకాలను విధించాలని ట్రంప్ కోరుకుంటున్నారు’’ అని అంతర్జాతీయ వ్యవహారాలను నిశితంగా పరిశీలించే జర్నలిస్ట్ శశాంక్ మాతో ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
 
‘‘ఒకవేళ ట్రంప్ చెప్పిన సుంకాల నిబంధనలను అమలు చేస్తే, భారత జీడీపీ 2028 నాటికి 0.1 శాతం వరకు పడిపోతుందని కొందరు ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. భారత్, అమెరికా మధ్యలో 200 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఒకవేళ ట్రంప్ టారిఫ్ రేట్లను పెంచితే, భారత్ బాగా నష్టపోతుంది’’ అని రాశారు. ట్రంప్ వాణిజ్య విధానాలు భారత దిగుమతులను ఖరీదైనవిగా మార్చవచ్చు. దీనివల్ల ద్రవ్యోల్బణం రేటు పెరుగుతుంది. వడ్డీ రేట్లను తగ్గించడం సాధ్యం కాకపోవచ్చు. వినియోగదారులకు ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలకు సమస్యలు పెరుగుతాయి. వారి ఈఎంఐలు పెరగవచ్చు.
 
రక్షణ సంబంధాల పరిస్థితి ఏంటి?
డోనల్డ్ ట్రంప్‌ను చాలా వరకు చైనాకు గట్టి ప్రత్యర్థిగా పరిగణిస్తారు. తన తొలి పదవీ కాలంలో, అమెరికా-చైనాల మధ్య సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. ఇది భారత్-అమెరికాల మధ్య రక్షణ సంబంధాలు బలోపేతానికి కారణమైంది. ట్రంప్ తన తొలి పదవీ కాలంలో క్వాడ్‌ను బలోపేతం చేయడంలో క్రియాశీలకంగా కనిపించారు. క్వాడ్ అనేది ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్‌ల కూటమి. ఒకవేళ ట్రంప్ అధ్యక్షుడైతే, రెండు దేశాల మధ్యలో ఆయుధాల ఎగుమతులు, సంయుక్త సైనిక విన్యాసాలు, భారత్‌తో సాంకేతిక మార్పిడిల విషయంలో మెరుగైన సమన్వయం ఉంటుంది. ఇది చైనా, పాకిస్తాన్‌లపై భారత్ స్థానాన్ని మెరుగుపరుస్తుంది. ‘‘ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత్‌తో రక్షణ పరమైన అతిపెద్ద ఒప్పందాలను చేపట్టారు. ప్రధాని మోదీతో మంచి సంబంధాలను కొనసాగించారు. చైనాతో కఠిన వైఖరిని అవలంబించారు’’ అని శశాంక్ మాటో అన్నారు.
 
వీసా విధానం ఎలా ఉండనుంది?
ట్రంప్ విధానాలు వలసవచ్చినవారికి చాలా సమస్యలు సృష్టిస్తాయి. ట్రంప్ ఈ విషయంపై చాలాసార్లు బహిరంగంగానే ప్రకటనలు చేశారు. అమెరికా ఎన్నికల్లో ఇది ముఖ్యమైన అంశం. అక్రమ వలసదారులు అమెరికా ప్రజల ఉద్యోగాలను లాగేసుకుంటున్నారని, వారిని వెనక్కు పంపుతానని ట్రంప్ వాగ్దానం చేశారు. అమెరికా టెక్నాలజీ రంగంలో భారతీయులు చాలా మంది పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది హెచ్-1బీ వీసాపై అక్కడికి వెళ్లారు. ఈ వీసా నిబంధనల విషయంలో ట్రంప్ గతంలో కఠినంగా వ్యవహరించారు. ఇది భారత ఉద్యోగులు, టెక్నాలజీ కంపెనీలపై ప్రభావం చూపించింది. ఒకవేళ ఇదే విధానం కొనసాగితే, అమెరికాలో భారతీయులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి. భారత టెక్ కంపెనీలు సైతం అమెరికా కాకుండా మిగిలిన దేశాలలో పెట్టుబడులు పెడతాయి.
 
చైనా, పాకిస్తాన్, బంగ్లా విషయంలో ట్రంప్ ఏం చేస్తారు?
కమలా హారిస్, ట్రంప్ ఇద్దరూ కూడా చైనాకు అడ్డుకట్ట వేయాలని అనుకున్నారు. దీనికోసం, ఆసియాలో వారికి అత్యంత అనువైన భాగస్వామి భారత్. అయితే కొన్ని విషయాలలో ట్రంప్ భారత్‌కు అనువుగానూ లేరు. ‘‘కశ్మీర్ విషయంలో భారత్, పాకిస్తాన్ మధ్యలో మధ్యవర్తిత్వాన్ని ఆయన ప్రతిపాదించారు. కానీ, భారత్‌కు అది నచ్చలేదు. తాలిబాన్‌తో కుదిరిన డీల్‌పై ఆయన సంతకం చేశారు. అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా బలగాలను వెనక్కి తీసుకున్నారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయాలు దక్షిణాసియాలో భారత ప్రయోజనాలకు వ్యతిరేకం’’ అని శశాంక్ మాటో అన్నారు.
 
బంగ్లాదేశ్ విషయంలో ట్రంప్ బహిరంగంగానే భారత్‌కు మద్దతు ఇచ్చారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీల భద్రతపై ట్రంప్ పలు ప్రశ్నలను సంధించారు. ఇటీవలే హిందువులు, క్రిస్టియన్లు, ఇతర మైనార్టీలపై దాడుల గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై రాశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’పై దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్, ‘‘బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రిస్టియన్లు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న అనాగరిక హింసను తీవ్రంగా ఖండిస్తున్నా. అల్లరి మూక వారిపై దాడి చేసింది. వారిని దోచుకుంది. ఇది పూర్తిగా అరాచకం.’’ అంటూ ట్వీట్ చేశారు.
 
‘‘నా పదవీ కాలంలో ఇలా ఎప్పటికీ జరిగేది కాదు. కమలా, జో బైడెన్‌లు అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను పక్కనపెట్టారు. ఇజ్రాయెల్ నుంచి యుక్రెయిన్ వరకు, సొంత దేశంలోని దక్షిణ సరిహద్దులో అలజడికి వారు కారణమయ్యారు. కానీ, మళ్లీ మనం అమెరికాను బలంగా మార్చుకుందాం. ఈ బలం ద్వారా శాంతిని పున: స్థాపించుకుందాం’’ అని ట్రంప్ పిలుపునిచ్చారు. ‘‘రాడికల్ లెఫ్ట్‌కు చెందిన మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లను రక్షిస్తాం. మీ స్వేచ్ఛ కోసం పోరాడతాం. భారత్‌తో, నా మంచి స్నేహితుడు ప్రధాని మోదీతో ఉన్న ఉన్నతమైన భాగస్వామ్యాన్ని నా పాలనలో మరింత పటిష్టం చేసుకుంటాం.’’ అని ట్రంప్ చెప్పారు.
 
పాకిస్తాన్ విషయాన్ని తీసుకుంటే, అమెరికా ఇండో-పసిఫిక్ పాలసీలో కాస్త సందిగ్ధత ఉందని నిపుణులు అంటున్నారు. ‘‘అమెరికా అధికారులు ఈ విషయంలో అయోమయంగా ఉన్నారు. అమెరికా ఇండో-పసిఫిక్ పాలసీలో పాకిస్తాన్ స్థానం ఎక్కడ? చైనాకు పాకిస్తాన్ మిత్రదేశం. అమెరికా తన స్ట్రాటజీలో అఫ్గనిస్తాన్‌ను ఒక భాగంగా చూడటం లేదు. ఎందుకంటే, అక్కడ తాలిబాన్ అధికారంలో ఉంది’’ అని ‘ది విల్సన్ సెంటర్’ దక్షిణాసియా డైరెక్టర్ మైఖేల్ కుగెల్మాన్ అన్నారు. భారత్-రష్యా సంబంధాల విషయంలో ట్రంప్ కాస్త చూసీచూడనట్లు వ్యవహరిస్తారని మైఖేల్ చెప్పారు. కానీ, భారత్‌తో వాణిజ్యం, సుంకాల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించనున్నారని భావిస్తున్నారు.