ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 25 అక్టోబరు 2024 (17:11 IST)

‘గంగవ్వ చిలుక పంచాంగం’: గంగవ్వపై కేసు ఏమిటి, చిలుకను పెంచుకోవడం నేరమా?

Gangavva
పంజరంలో బంధించిన చిలుకతో వీడియో షూట్ చేశారనే ఫిర్యాదుపై యూట్యూబ్ వీడియోల ద్వారా ప్రసిద్ధి పొందిన గంగవ్వతోపాటు రాజు అనే వ్యక్తిపై జగిత్యాల జిల్లా అటవీశాఖ కేసు నమోదు చేసింది. ఈ వీడియో రూపొందించిన మై విలేజ్ షో బృందానికి అటవీశాఖాధికారులు పాతిక వేల రూపాయల జరిమానా విధించారు. ప్రస్తుతం గంగవ్వ బిగ్ బాస్ షోలో ఉన్నారు.
 
అసలు వివాదం ఏంటి?
‘మై విలేజ్ షో’ అనే యూట్యూబ్ ఛానల్‌లో ‘గంగవ్వ చిలుక పంచాంగం’ అనే వీడియోను 2022 మే 20న అప్‌లోడ్ చేశారు. అయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం సంరక్షిత పక్షుల జాబితాలో ఉన్న చిలుకను పంజరంలో బంధించి, షూటింగ్‌కు వినియోగించారని దీనికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలంటూ 2024 అక్టోబర్ 6‌న ‘స్ట్రే యానిమల్ ఫౌండేషన్’కు చెందిన ఎదులపురం గౌతమ్ అనే వ్యక్తి తెలంగాణ అటవీశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియో షూటింగ్ జగిత్యాల జిల్లాలో జరిగినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
“ఈ వీడియో గురించి కొంతమంది జంతు ప్రేమికులు ఇటీవల మా దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌తో పాటూ సంబంధిత అధికారులకూ ఫిర్యాదు చేశాం. యూట్యూబ్ ద్వారా ఆర్థిక లబ్ధి పొందేందుకు, ఎక్కువ వ్యూస్ కోసం ఇలా వన్యప్రాణులను వాడటం నేరం. వన్యప్రాణి చట్టాలపై వారికి అవగాహన ఉండాలి’’ అని గౌతమ్ బీబీసీతో చెప్పారు.
 
‘జరిమానా వేసి, కౌన్సెలింగ్ ఇచ్చాం’
దసరా సందర్భంగా చేసిన మరొక వీడియో (దసరా షికారికి పోతే) కూడా వన్యప్రాణల వేటను ప్రోత్సహించేలా ఉందని, దీనిపై యూట్యూబర్స్‌కు అటవీ అధికారులు అవగాహన కల్పించాలని గౌతమ్ కోరారు. గంగవ్వ చిలుక జోస్యం వీడియోపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి జరిమానా విధించామని జగిత్యాల జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్ఓ) రవి ప్రసాద్ బీబీసీకి తెలిపారు. “ఈ వీడియోలో ఉన్న నటులు, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌లను విచారించి కేసు నమోదు చేశాం. చిలుక జోస్యం చెప్పే వ్యక్తి నుంచి చిలుకను షూటింగ్ కోసం అద్దెకు తీసుకున్నామని చెప్పారు. వన్యప్రాణి సంరక్షణ చట్టంపై వారికి కౌన్సెలింగ్ ఇచ్చాం. ఇలాంటివి పునరావృతం కావని వారి నుంచి లిఖిత పూర్వక స్టేట్‌మెంట్ తీసుకున్నాం. 25 వేల రూపాయల జరిమానా విధించి, ఈ కేసును ముగించాం’’ అని డీఎఫ్ఓ చెప్పారు.
 
ఈ అంశంపైన బీబీసీతో 'మై విలేజ్ షో' టీం సభ్యుడు గీల అనిల్ మాట్లాడారు. “వన్యప్రాణి చట్టం గురించి మాకు తెలియదు. ఇది రెండేళ్ల క్రితం చేసిన వీడియో. అటవీశాఖ అధికారులు విచారణ జరిపారు. జరిమానా కట్టాం. చిలుక జోస్యం వీడియోను తొలగించాం’’ అని ఆయన తెలిపారు.
 
వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏం చెబుతోంది?
వన్యప్రాణుల రక్షణ కోసం 1972లో భారత ప్రభుత్వం వన్యప్రాణి (సంరక్షణ) చట్టాన్ని తీసుకువచ్చింది. ఎంపిక చేసిన వన్యప్రాణులు, వృక్షజాతులను ఆరు జాబితాలుగా విభజించింది. ఇందులో చిలుక జాతిని 4వ జాబితాలో చేర్చింది. ఈ చట్టం ప్రకారం సంరక్షణ జాబితాలో ఉన్న జంతువులు, పక్షులను వేటాడటం, బంధించడం, వృక్షజాతులకు నష్టం కలిగించే వారికి గరిష్ఠంగా 25 వేల రూపాయల జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
నేరం పునరావృతం అయితే దోషులకు గరిష్ఠంగా ఏడేళ్ల వరకు శిక్ష పడుతుంది.
 
జంతువులు, పక్షులను పెంచుకోవాలంటే..
వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణ బాధ్యత చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌పై ఉంటుంది. ఎవరైనా వ్యక్తులు సంరక్షిత జాబితాలోని పక్షులు, జంతువులను పెంచుకోవాలనుకుంటే చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని డీఎఫ్ఓ రవి ప్రసాద్ తెలిపారు. ‘’అనుమతి పొందిన వారు ఆయా జంతువులు, పక్షుల పోషణ, ఆరోగ్యం ఇతర అంశాలపై హామీ ఇవ్వాల్సి ఉంటుంది. వాటి పట్ల క్రూరత్వం ప్రదర్శించకూడదనేది ఒక షరతుగా ఉంటుంది. స్థానిక అటవీశాఖ అధికారులు పర్యవేక్షణ వాటిపై ఉంటుంది. ఆ సమయంలో యజమానికి అవసరమైన సూచనలు చేస్తారు’’ అని ఆయన చెప్పారు.
 
చిలుక లేకుండానే జోస్యం
భారతీయ సంస్కృతిలో పక్షి జోస్యానికి ప్రాధాన్యం కనిపిస్తుంది. ఇందులో 'చిలుక జోస్యం' ప్రముఖమైనదిగా ఉంది. ఇదే జీవనాధారంగా బతికే కులాలున్నాయి. అటవీ అధికారుల చర్యలతో జోస్యం కోసం చిలుకలను బంధించడం ఇపుడు తగ్గింది. దీంతో ఒకప్పుడు 'చిలుక జోస్యం' చెప్పేవారంతా తమ మార్గాన్ని మార్చుకున్నారు. కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్‌కు చెందిన సుతారం స్వామి 30 ఏళ్లుగా 'చిలుక జోస్యం' వృత్తిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన చిలుక లేకుండానే జోస్యం చెబుతున్నారు.
 
“జోస్యం కోసం చిలుకలను బంధించొద్దని అటవీ అధికారులు చెప్పారు. భారీగా జరిమానాలు విధించారు. మూడేళ్లుగా చిలుక లేకుండానే జోస్యం చెబుతున్నాను. గతంలో పంజరం చూసే మా దగ్గరికి వచ్చేవారు. ఇప్పుడు చిలుక, పంజరం రెండూ మా వృత్తి నుంచి పోయాయి. ఇప్పుడు జోస్యం చెప్పించుకోవాలనుకునేవారు మేం ఎక్కడ కూర్చుంటామో తెలుసుకుని అక్కడికే వస్తున్నారు. ’’ అని స్వామి అన్నారు.