శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : శుక్రవారం, 24 జనవరి 2020 (16:35 IST)

చివరి కోరిక ఏమైనా వుందా? నిర్భయ దోషులకు జైలు అధికారుల ప్రశ్న

నిర్భయ కేసులో నలుగురు దోషులను మీ చివరి కోరిక ఏంటో చెప్పాలని కోరినపుడు, వారు ఏ సమాధానం ఇవ్వలేదని తీహార్ జైలు అధికారులు చెప్పినట్లు సాక్షి ఒక కథనం ప్రచురించింది. దిల్లీ నిర్భయ ఘటనలో దోషులు నలుగురినీ ఫిబ్రవరి 1వ తేదీన ఉరితీసేందుకు తీహార్‌ జైలు అధికారులు సిద్ధమవుతున్నారు. ఉరితీయడానికి ముందు ఏ ఖైదీనైనా వారి ఆఖరి కోరిక ఏమిటని అడగడం ఆనవాయితీ.
 
తీహార్‌ జైలు అధికారులు సైతం ఈ నలుగురినీ ఆఖరి కోరిక ఏమిటని ప్రశ్నించగా నలుగురిలో ఏ ఒక్కరు కూడా సమాధానమివ్వకుండా మౌనాన్ని ఆశ్రయించారనీ, వారి సమాధానం కోసం వేచి చూస్తున్నామని అడిషనల్‌ ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ రాజ్‌కుమార్‌ వెల్లడించినట్లు సాక్షిలో రాశారు. నలుగురినీ రాతపూర్వకంగా తమ చివరి కోరిక ఏమిటని జైలు అధికారులు ప్రశ్నించినట్టు ఆయన తెలిపారు.
 
దోషులు ఒకసారి వారు నోరువిప్పి తమ చివరి కోరిక ఏమిటో చెపితే దాన్ని తీర్చగలుగుతామా లేదా అనే విషయాన్ని జైలు అధికారులు పరిశీలిస్తారని ఆయన చెప్పినట్లు కథనంలో వివరించారు. 'అయితే అన్ని కోర్కెలూ తీర్చే అవకాశం ఉండదు. ఖైదీలు తమ కోర్కెను రాతపూర్వకంగా ఇచ్చిన తరువాత దానిపై అధికారులు నిర్ణయం తీసుకొంటారు' అని ఆయన చెప్పారు.
 
కనీసం, మీరు చివరిసారిగా ఎవరినైనా కలుసుకోవాలనుకుంటున్నారా? మీ ఆస్తులను, మీకు సంబంధించిన వాటిని ఎవరికైనా అప్పజెప్పాలనుకుంటున్నారా? అని కూడా వారిని ప్రశ్నించినట్టు అధికారులు తెలిపారు. ఢిల్లీ హైకోర్టు నిర్భయ దోషులైన వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ కుమార్‌(31), ముఖేష్‌ కుమార్‌ (32), పవన్‌(26)లను ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6గంటలకు ఉరి తీయాలని ఆదేశాలు జారీచేసింది.
 
నిర్భయ ఘటనలో దోషులకు మరణ శిక్ష విధించిన సెషన్స్‌ జడ్జి సతీష్‌ కుమార్‌ అరోరాను డిప్యుటేషన్‌ ప్రాతిపదికన అదనపు రిజిస్ట్రార్‌గా సుప్రీంకోర్టుకు బదిలీ చేశారని కూడా సాక్షిలో ప్రచురించారు.