శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : బుధవారం, 3 జులై 2019 (15:22 IST)

ముంబయి: భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం, 23 మంది మృతి

ముంబయి నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. గత రెండు రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన వానల కారణంగా 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

తూర్పు మలాడ్ ప్రాంతంలో గుడిసెలపై ఓ గోడ కూలి పడిపోవడంతో ఈ మరణాలు సంభవించినట్లు పేర్కొంది. వరదల వల్ల రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో రాకపోకలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించింది.
 
దశాబ్ద కాలంలో ఇదే అత్యంత భారీ వర్షం అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విచ్చలవిడి నిర్మాణాలు, పట్టణాభివృద్ధి ప్రణాళికల్లో లోపాల వల్లే ఏటా నగరంలో ఇలాంటి ఇబ్బందులు ఏర్పుడుతున్నాయని నిపుణులు అంటున్నారు. మలాడ్‌లో చనిపోయిన వారంతా భవన నిర్మాణ కూలీలని అధికారులు తెలిపారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నగరంలోని చాలా చోట్ల వరదలు వచ్చాయి. అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు..
 
ముంబయికి జీవనాడిగా వర్ణించే సబర్బన్ రైల్వే నెట్‌వర్క్ సేవలను కూడా చాలా మార్గాల్లో నిలిపివేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ముంబయిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో వర్షం కారణంగా ల్యాండింగ్ సమయంలో ఓ విమానం రన్‌వేపై జారిపోయింది. దీంతో, ప్రధాన రన్‌వేను మూసివేశారు. మంగళవారం నాటికి సుమారు 50 విమానాలను వేరే ప్రాంతాలకు మళ్లించారు. మరో 50కి పైగా విమానాలు రద్దయ్యాయి.
 
రెండో రన్‌వే నడుస్తున్నా, విమాన సర్వీసులు ఆలస్యం లేదా రద్దయ్యే అవకాశాలున్నాయి. 2017లోనూ ముంబయిలోని జనాలు వరదల వల్ల తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 2005‌లో వచ్చిన వరదల్లోనైతే 900కు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు.
 
జలాశయానికి గండి పడి, ఏడుగురు మృతి
మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఓ జలాశయానికి గండి పడటంతో, ఓ పల్లెటూరులో 12కు పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. దీంతో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గల్లంతయ్యారు. మొత్తం ఏడు గ్రామాలకు వరదలు వచ్చాయి. మంగళవారం రాత్రి 8.30కి జలాశయం నుంచి నీరు పొంగి రావడం ప్రారంభమైందని.. ఆ తర్వాత గంటకే గండి పడిందని స్థానిక అధికారులు తెలిపారు.
 
నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్) రంగంలోకి దిగి సహాయ, గాలింపు చర్యల్లో పాల్గొంటోంది. పరివాహక ప్రాంతంలో ఉన్న ఓ కయ్యలో ఏడుగురి మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు వివరించారు. రత్నగిరితోపాటు తీర ప్రాంతంలో ఉన్న చాలా చోట్ల నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ముంబయితో పాటు పుణె, కల్యాణ్ ప్రాంతాల్లోనూ గోడలు కూలి జనాలు మృత్యువాత పడ్డ ఘటనలు చోటుచేసుకున్నాయి.