మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 6 జనవరి 2021 (17:01 IST)

అత్యాచార బాధితులకు 'కన్యత్వ పరీక్షలు' చేయడాన్ని నిషేధించిన పాకిస్తాన్ కోర్టు

అత్యాచార కేసుల విచారణలో భాగంగా కన్యత్వ పరీక్షలు చేయడాన్ని నిషేధిస్తూ పాకిస్తాన్‌లోని ఒక ప్రాంతీయ కోర్టు ఇచ్చిన తీర్పును మానవ హక్కుల సంస్థలు స్వాగతించాయి. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సు వరకే వర్తించే ఈ తీర్పు ఫలితంగా, అత్యాచార బాధితులకు కన్నెపొర చిరిగిందా, లేదా అనేది తెలుసుకోడానికి జననాంగంలో రెండు వేళ్లు చొప్పించి చేసే పరీక్షలకు ఇక తెరపడనుంది.

 
లాహోర్ హైకోర్టు జడ్జి ఆయేషా మాలిక్ ఈ పరీక్షలను 'అవమానకరమైనవిగా, ఎలాంటి ఫోరెన్సిక్ విలువలు' లేనివిగా చెప్పారు. పంజాబ్ ప్రావిన్సులోని మానవ హక్కుల సంస్థ కార్యకర్తలు వేసిన రెండు పిటిషన్లపై కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

 
అత్యాచార కేసుల్లో వైద్య పరీక్షల్లో భాగంగా నిర్వహించే ఈ కన్యత్వ పరీక్షలను నిషేధించాలని వీరు చాలా కాలంగా కోరుతున్నారు. సోమవారం కోర్టు ఇచ్చిన తీర్పు పంజాబ్‌ వరకే అమలైనా, మిగతా ప్రావిన్సు హైకోర్టుల్లో ఉన్న పిటిషన్లకు ఇది ఒక ఉదాహరణగా నిలవనుంది. ఇలాంటి ఒక పిటిషన్ ప్రస్తుతం సింధ్ హైకోర్టులో కూడా పెండింగులో ఉంది.

 
"లైంగిక హింసకు సంబంధించిన ఏ కేసులో అయినా నిర్వహించే కన్యత్వ పరీక్షలకు ఎలాంటి ఫోరెన్సిక్ విలువలు లేవని ఈ తీర్పు చాలా స్పష్టంగా చెప్పింది" అని లాహోర్‌ కేసులో పిటిషనర్ల తరఫున వాదించిన లాయర్ సమీర్ ఖోసా బీబీసీతో అన్నారు. ఈ తీర్పుతో విధానాలను మార్చుకుంటారని, కన్యత్వ పరీక్షలకు శాశ్వతంగా ముగింపు పలుకుతారని తాను ఆశిస్తున్నట్లు ఖోసా చెప్పారు.

 
రెండు వేళ్ల పరీక్ష అంటే
స్త్రీ లైంగిక చర్యలో పాల్గొందా, లేదా.. అది ఏ మేరకు అనేది నిర్ధరించడానికి బాధితురాలికి కన్నెపొర ఉందా, అది ఎంత వదులుగా ఉందో తెలుసుకోడానికి మహిళ యోనిలో మనుషులు ఒకటి లేదా రెండు వేళ్లు చొప్పించి పరీక్ష చేస్తారు. ఒక మహిళ మొదటిసారి లైంగిక దాడికి గురైంది అనేది కూడా ఈ పరీక్ష ద్వారా నిర్ధరించవచ్చని కొంతమంది డాక్టర్లు చెబుతున్నారు. లైంగిక అనుభవం ఉందని చెప్పడం ద్వారా అత్యాచారానికి గురైన బాధితురాలిని కించపరచడానికి ఈ పరీక్షను ఉపయోగిస్తున్నారు.

 
ఈ పరీక్షకు శాస్త్రీయత లేదని, అలా చేయడం మానవ హక్కులను ఉల్లంఘించినట్లే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. జస్టిస్ మాలిక్ తన తీర్పులో ఈ పరీక్షను అత్యంత దురాక్రమణగా చెప్పారు. శాస్త్రీయపరంగా, వైద్యపరంగా దీని అవసరం లేదని అన్నారు. "ఇది ఒక అవమానకరమైన పద్ధతి. నిందితుడిపై, లైంగిక హింసపై దృష్టి పెట్టడానికి బదులు దీనిని బాధితురాలిని సందేహించడానికి ఉపయోగిస్తున్నారు" అని అన్నారు.

 
"లైంగిక చరిత్రకు సంబంధించిన అశాస్త్రీయ అంచనాలతో బాధితులపై కళంకం వేయడానికి ఈ పరీక్షలను ఉపయోగిస్తున్నారు" అని లాహోర్ కేసు పిటిషనర్లలో ఒకరైన లాయర్ సహర్ బందియాల్ అన్నారు. సులభంగా లైంగిక చర్యలకు అంగీకరించేలా మహిళ గుణం ఉంటుందని ఒక అనుమానం ఉందని బందియాల్ అన్నారు.

 
ప్రపంచవ్యాప్త సమస్య
కన్యత్వ పరీక్షలుగా చెబుతున్నవి పితృస్వామ్య సంస్కృతిలో భాగమని మహిళా హక్కుల కోసం ఉద్యమించేవారు చాలా కాలంగా వాదించారు. లైంగిక దాడులు జరిగినప్పుడు మహిళలే ఆ నిందలు భరించడానికి అవి కారణం అవుతున్నాయని చెప్పారు. సమాజంలో పరువు పోతుందనే భయంతో బాధితులు బయటికి రాకపోవడంతో, పాకిస్తాన్‌లో అత్యాచార కేసులు తక్కువగా నమోదవుతుంటాయి. నమోదైన కేసుల్లో కూడా బలహీనమైన చట్టాలు, సంక్లిష్ట విధానాల వల్ల కొంతమందికే శిక్షలు పడుతుంటాయి.

 
2020 సెప్టెంబరులో లాహోర్ దగ్గర కారు రిపేరవడంతో ఆగిపోయిన ఒక మహిళను రోడ్డు పక్కకు తీసుకెళ్లి, ఆమె పిల్లల ముందే గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తింది. దేశవ్యాప్త నిరసనలకు, ఈ కేసుల్లో విచారణ వేగంగా జరిగేలా అధ్యక్షుడు కొత్త అత్యాచార బిల్లుకు ఆమోదముద్ర వేయడానికి ఈ ఘటన కారణమైంది. కానీ, పాకిస్తాన్‌లో కన్యత్వ పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. లాహోర్ కోర్టు తీర్పు ప్రభావం ఉండని దేశంలోని కొన్ని ప్రాంతాల్లో దీనికి చట్టబద్ధత ఉంది.

 
వలస పాలన కాలం నుంచీ దక్షిణాసియాలో ఈ పద్ధతి అమలులో ఉందని, ప్రపంచంలో కనీసం 20 దేశాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పద్ధతికి ముగింపు పలకాలని ఇటీవల రెండు సంస్థలు ప్రచారం చేశాయి. పాకిస్తాన్‌లో సోమవారం తీర్పు వినిపించిన జస్టిస్ మాలిక్... భారత్‌లో ఈ పరీక్షలను 2013లో నిషేధించారని చెప్పారు. బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌లో 2018లో ఈ పరీక్షలను నిషేధించారు. కానీ, గత ఏడాది సెప్టెంబరులో లాహోర్‌ అత్యాచార బాధితురాలిని కూడా ఈ పరీక్ష చేయించుకోవాలని బలవంతం చేశారని పాకిస్తాన్‌లోని ఒక స్వతంత్ర మానవ హక్కుల కమిషన్ చెప్పింది.

 
కనిపించేది తక్కువే
ఈ తీర్పును మైలురాయి అని సోమవారం పంజాబ్ కోర్టు తీర్పుపై స్పందించిన పాకిస్తాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి చౌధరీ ఫవాద్ వర్ణించారు. సోషల్ మీడియాలో కూడా పలువురు ఈ తీర్పును స్వాగతించారు. పిటిషనర్ జైనబ్ హుస్సేన్‌తో కలిసి మూడేళ్ల క్రితం పంజాబ్ కోర్టులో దీనిపై పిటిషన్ వేసేలా ప్రేరేపించిన ఒక వీడియోను ఎలా రూపొందించిందీ మానవ హక్కుల కార్యకర్త ఐమన్ రిజ్వీ వర్ణించారు. "దశాబ్దాలుగా ఈ పోరాటం చేస్తున్న మహిళలందరికీ నేను చాలా రుణపడ్డాను. రేపు పోరాటం కొనసాగిస్తాను, కానీ, మనకు కనిపించేది కొంతే, కనిపించనిది చాలా ఉందని మిగతా వారంతా మర్చిపోకూడదు" అని రిజ్వీ పోస్ట్ చేశారు.