ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2019 (16:04 IST)

రూ.3,208 కోట్ల విలువైన బిట్‌కాయిన్లు మాయం .. క్రైమ్ థ్రిల్లర్‌‌ను తలపించే స్టోరీ

ఒక క్రైమ్ థ్రిల్లర్‌ సినిమాను తలపించే కథనం ఇది. సుమారు రూ.45 కోట్ల డాలర్ల (రూ.3208 కోట్ల) విలువైన బిట్ కాయిన్లు, ఇద్దరు రష్యా ఐటీ నిపుణులు, ఒక రష్యా సంపన్నుడు, ఎఫ్‌బీఐ ఏజెంట్ల చుట్టూ తిరిగే ఈ కథ అనేక ఆసక్తికర అంశాలను ముందుకు తెస్తుంది.
 
రష్యాలో 'వెక్స్' అనే క్రిప్టోకరెన్సీ సంస్థ కార్యకలాపాలు 2018లో పూర్తిగా ఆగిపోయాయి. అందులోని సుమారు 45 కోట్ల డాలర్ల ఇన్వెస్టర్ల సొమ్ము ఏమైందో అంతుచిక్కడం లేదు. ఇది ఏమైందో తెలుసుకోవడానికి బీబీసీ రష్యన్ కొన్ని నెలలపాటు పరిశోధన చేసింది.
 
క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ సంస్థ 'వెక్స్(డబ్ల్యూఈఎక్స్- వరల్డ్ ఎక్స్‌చేంజ్ సర్వీసెస్)‌' కీలక వ్యక్తుల్లో ఒకరు అలెక్సీ బిల్యుచెంకో. 2017 జులైలో ఆయన గ్రీస్‌లో అరెస్టు నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇద్దరూ ఆన్‌లైన్లో కలిశారు.. వ్యాపారంలోకి దిగారు. బిల్యుచెంకో గతంలో ఒక ఫర్నీచర్ వ్యాపార సంస్థలో ఐటీ మేనేజర్‌గా పనిచేశారు.
 
2011లో బిల్యుచెంకో, ఎలక్ట్రానిక్ నగదు బదలాయింపులో నిపుణుడైన అలెగ్జాండర్ వినిక్ తొలిసారిగా ఆన్‌లైన్లో కలుసుకున్నారు. తమ జీవితాలను మార్చేసే ఒక కీలకమైన నిర్ణయం అక్కడే తీసుకున్నారు. అదేంటంటే- క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్. వినిక్, బిల్యుచెంకో ఇద్దరికీ సిగ్గు ఎక్కువని, మనుషుల కంటే కంప్యూటర్లతో ఉండటానికే మొగ్గుచూపుతారని వీరు స్నేహితులు చెబుతారు. వీరిద్దరూ కలసి 'బీటీసీ-ఈ' అనే క్రిప్టోకరెన్సీ సంస్థను ఏర్పాటు చేశారు.
 
ప్రపంచంలోని ఇలాంటి ఇతర ఎక్స్‌చేంజీల మాదిరే తమ వద్ద కూడా సాధారణ డబ్బుతో వర్చువల్ కరెన్సీలను కొనొచ్చని బీటీసీ-ఈ ఇన్వెస్టర్లకు చెప్పింది. అయితే ఐరోపా, అమెరికాల్లోని ఇతర ఎక్స్‌చేంజీల మాదిరి కాకుండా, బీటీసీ-ఈ తన వినియోగదారులను ఐడీ(గుర్తింపు) అడగలేదు. ఇది సిసలైన ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే నేరగాళ్లు వారి డబ్బును ల్యాండరింగ్ చేసేందుకు వీలు కల్పించింది.
 
బీటీసీ-ఈలో పెట్టుబడి పెట్టేందుకు వినియోగదారులు పోటెత్తారు. 'గ్లోబల్ విట్నెస్' సమాచారం ప్రకారం 2016 నాటికి అది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్‌చేంజ్‌గా అవతరించింది. బిల్యుచెంకో, వినిక్ ఇద్దరూ ఆన్‌లైన్లోనే సంప్రదింపులు జరిపేవారు. రోజువారీ బిట్‌కాయిన్ ట్రేడింగ్ 20 లక్షల డాలర్లకు చేరుకున్న సమయంలో తొలిసారిగా 2014లో వారు నేరుగా కలుసుకొన్నారు. 2016లో రోజువారీ ట్రేడింగ్ కోటి డాలర్లకు చేరుకొంది. అప్పట్లో మాస్కోలో కుటుంబ సమేతంగా రష్యా రాజధాని మాస్కోలో వేడుక చేసుకున్నారు.
 
2017 జులైలో వారు గ్రీస్‌కు విహార యాత్రకు వెళ్లారు. అంతర్జాతీయ మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై విచారణ జరుపుతున్న అమెరికా దర్యాప్తు సంస్థ(ఎఫ్‌బీఐ) ఏజెంట్లు తమ కోసం గాలిస్తున్నారనే విషయం అప్పటికి వారికి తెలియదు. ఎంటీ గోగ్స్ అనే మరో బిట్‌కాయిన్ ఎక్స్‌చేంజ్ నుంచి హ్యాకింగ్‌తో కొల్లగొట్టిన నిధులను దాయడంలో బీటీసీ-ఈ ఎక్స్‌చేంజ్‌ పాత్ర ఉందనేది ఎఫ్‌బీఐ అనుమానం. బీటీసీ-ఈని రష్యా హ్యాకింగ్ గ్రూప్ 'ఫ్యాన్సీ బేర్స్' ఉపయోగించుకొంటోందని సైబర్ నేరాల నిపుణులు భావించారు.
 
అలెగ్జాండర్ వినిక్ అరెస్టుకు వారెంట్ జారీ అయ్యింది. వినిక్ భార్య, పిల్లల ఎదురుగానే గ్రీస్‌లోని ఓ బీచ్‌లో ఆయన్ను గ్రీస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గురించి అలెక్సీ బిల్యుచెంకోకు వినిక్ తల్లి ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు బిల్యుచెంకో గ్రీస్‌లోనే మరో రిసార్ట్‌లో ఉన్నారు. భయాందోళనతో బిల్యుచెంకో తన ల్యాప్‌టాప్‌ను ధ్వంసం చేసి సముద్రంలోకి విసిరేశారు. వెంటనే మాస్కోకు విమానం పట్టుకొని వచ్చేశారు
 
తర్వాత బిల్యుచెంకో రష్యాలో నోవోసిబిర్స్క్ నగరానికి చేరుకున్నారు. 'వెక్స్’ ఏర్పాటు చేసి నష్టాలను పూడ్చుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. బీటీసీ-ఈ వెబ్‌సైట్‌ను అప్పటికే ఎఫ్‌బీఐ సీజ్ చేసింది. అయితే బ్యాకప్ సర్వర్లు బిల్యుచెంకో నియంత్రణలో ఉన్నాయి. 'వెక్స్' ద్వారా కొందరు బీటీసీ-ఈ క్లయింట్లకు ఆయన తిరిగి చెల్లింపులు చేయగలిగారు. ఈ దశలో తనకు ఎవరైనా పలుకుబడిగలవారి అండ అవసరమని బిల్యుచెంకో భావించారు. ఆయనే ఈ విషయాన్ని తర్వాత పోలీసులకు వెల్లడించారు.
 
మాస్కో సంపన్నుడు మలోఫెయెవ్‌తో పరిచయం  
ఈ క్రమంలో మాస్కోలో ఉండే సంపన్నుడు కాన్‌స్టాంటిన్ మలోఫెయెవ్‌తో తనకు పరిచేయం ఏర్పడిందని బిల్యుచెంకో తెలిపారు. మలోఫెయెవ్‌కు రష్యా అధికార వ్యవస్థతోపాటు రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్‌తో బలమైన సంబంధాలున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో ఆయన బాగా గడించారు.
 
తూర్పు ఉక్రెయిన్‌లోని రెబల్ ఫైటర్లతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో మలోఫెయెవ్‌పై అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్రస్తుతం ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఓ ఉన్నతస్థాయి షాపింగ్ ప్లాజాలో ఉన్న మలోఫెయెవ్‌ కార్యాలయాల్లో ఆయన్ను కలుసుకొనేందుకు తనను అనేకసార్లు మాస్కో పిలిపించారని బిల్యుచెంకో పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాల్లో చెప్పారు.
 
వెక్స్‌ సంస్థకు ఎంత ఆదాయం వస్తోంది, బీటీసీ-ఈపై ఎఫ్‌బీఐ చర్య తీసుకోవడానికి ముందు వరకు అందులో ఉన్న నిధులు ఏమై ఉండొచ్చు అనే ప్రశ్నలు తమ సంభాషణల్లో ప్రధానంగా వచ్చేవని బిల్యుచెంకో వెల్లడించారు.
 
వెక్స్ సంస్థ క్రిప్టోకరెన్సీ బ్యాలన్స్‌లు చూపించాలంటూ మలోఫెయెవ్‌ కొన్ని నెలలపాటు తనను డిమాండ్ చేశారని బిల్యుచెంకో పోలీసులకు చెప్పారు. బిల్యుచెంకోతోగాని, వెక్స్‌తోగాని తనకు ఏ సంబంధమూ లేదని మలోఫెయెవ్‌ చెబుతున్నారు.
 
ఆ వ్యక్తులు ఎవరు? 
2018 వేసవి నాటికి వెక్స్‌లో ట్రేడింగ్ నెమ్మదించింది. 2018 చివరి నాటికి పూర్తిగా ఆగిపోయింది. వెక్స్‌లో ఉన్న 45 కోట్ల డాలర్ల (సుమారు 3,208 కోట్ల రూపాయలు) విలువైన క్రిప్టోకరెన్సీ ఆచూకీ తెలియకుండా పోయింది.
 
ఈ పరిణామంతో క్లయింట్లు కోపోద్రిక్తులయ్యారు. తమ డబ్బు తమకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. రష్యాలోని చువాషియా ప్రాంతంలో ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
 
బిల్యుచెంకోను పోలీసులు ఒక సాక్షిగా విచారణకు పిలిపించారు. అప్పుడు ఆయన పోలీసులకు చెప్పిన విషయాలు విస్తుపోయేలా ఉన్నాయి. వెక్స్ అధికారికంగా మూతపడటానికి నెలల ముందే 2018లో వెక్స్‌ తన చేజారిపోయిందని ఆయన వెల్లడించారు.
 
మాస్కోలోని మలోఫెయెవ్‌ కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో కొందరు వ్యక్తులకు తనను పరిచేయం చేశారని బిల్యుచెంకో తెలిపారు. వాళ్లు ఎఫ్‌ఎస్‌బీ అనే సెక్యూరిటీ సర్వీస్‌ ఏజెంట్లు అని తాను అనుకొన్నట్లు చెప్పారు.
 
ఎఫ్‌ఎస్‌బీ ఉపయోగించిన ఒక భవనానికి వాళ్లు బిల్యుచెంకోను తీసుకెళ్లారు. మాస్కోలోని ప్రఖ్యాత బోల్షోయ్ థియేటర్‌కు దగ్గర్లోనే ఈ భవనం ఉంది. వెక్స్ గురించి సదరు ఏజెంట్లు బిల్యుచెంకోను ప్రశ్నించారు.
 
తర్వాత ఆయన్ను రష్యా విదేశీ వ్యవహారాలశాఖ కార్యాలయానికి సమీపంలోని విలాసవంతమైన లాటే హోటల్‌కు తరలించారు. అక్కడ రాత్రంతా తనకు కాపలా పెట్టారని ఆయన చెప్పారు.
 
మరుసటి రోజు ఉదయం తనను తిరిగి మలోఫెయెవ్ కార్యాలయానికి తరలించారని బిల్యుచెంకో చెప్పారు. వెక్స్ సంస్థ నిధులన్నీ 'ఎఫ్‌ఎస్‌బీ ఫండ్'కు బదిలీ చేయాలని అక్కడ తనకు గట్టిగా సూచించారని, అందుకు తాను అంగీకరించానని వెల్లడించారు. ఆ తర్వాత మళ్లీ మాస్కోకు వెళ్లినప్పుడు వెక్స్ నిధులన్నీ చెప్పిన విధంగా బదిలీ చేశానని తెలిపారు.
 
తాను మోసపోయానని, ఒక కుంభకోణం బాధితుడిని అయ్యానని తర్వాత తెలుసుకున్నానని బిల్యుచెంకో చెప్పారు. ప్రభుత్వ ఖజానాకు కాకుండా మలోఫెయెవ్ సంబంధీకులకు తాను డబ్బు బదలాయించేలా తనను మోసం చేశారని ఆయన ఆరోపించారు.
 
ఈ విషయాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటి నుంచి బిల్యుచెంకో అజ్ఞాతంలో ఉన్నారు. ప్రస్తుతం ప్రైవేటు భద్రతా సిబ్బంది ఆయన ఇంటికి కాపలా కాస్తున్నారు. వెక్స్ గురించి బీబీసీతోగాని, మరెవరితోనైనాగాని మాట్లాడేందుకు బిల్యుచెంకో నిరాకరిస్తున్నారు.
 
బిల్యుచెంకో చెబుతున్నది నిజమేనా? 
మోసపోయిన ఇన్వెస్టర్ల బృందానికి నాయకత్వం వహిస్తున్న అలెగ్జాండర్ టెరెంటీవ్, బిల్యుచెంకో వాదనను తాను నమ్మలేనన్నారు. అయితే ఇతర ఇన్వెస్టర్లలో ఇంత అపనమ్మకం వ్యక్తంకాలేదు.
 
2019 నవంబరు చివరి నుంచి నిత్యం వస్తున్న ఉత్తుత్తి బాంబు హెచ్చరికలతో మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరాల్లో కోర్టులు, ప్రభుత్వ భవనాలు, మెట్రో స్టేషన్లు, షాపింగ్ దుకాణాలు దాదాపు స్తంభించిపోయాయి.
 
అనేక ఈమెయిల్ హెచ్చరికల్లో- జాడ తెలియని 45 కోట్ల డాలర్ల వెక్స్ సొమ్ము, మలోఫెయెవ్ ప్రస్తావన ఉన్నట్లు రష్యా మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ బాంబు బెదిరింపులు మలోఫెయెవ్ పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసే యత్నాలంటూ ఆయనకు చెందిన టిసర్‌గ్రాడ్ టీవీ చానల్లో ఒక ప్రకటన వెలువడింది.
 
మలోఫెయెవ్‌కుగాని, ఆయన కంపెనీలకుగాని బిట్‌కాయిన్ల చౌర్యంతో, వెక్స్‌ సంస్థతో, దాని యాజమాన్యంతో ఏ సంబంధమూ లేదని ఆ ప్రకటన పేర్కొంది. ఈ కేసు గురించి బీబీసీతో మాట్లాడేందుకు మలోఫెయెవ్‌ నిరాకరించారు. స్పందన కోసం బీబీసీ చేసిన విజ్ఞప్తిపై ఎఫ్‌ఎస్‌బీ స్పందించలేదు.
 
జైల్లోనే వినిక్ 
గ్రీస్‌లో బీచ్‌లో అరెస్టయిన బిల్యుచెంకో ఒకప్పటి వ్యాపార భాగస్వామి వినిక్ నేటికీ అక్కడ జైల్లోనే ఉన్నారు. వినిక్‌ను తమకు అప్పగించాలని అమెరికా, రష్యా, ఫ్రాన్స్ కోరుతున్నాయి. రెండేళ్లుగా ఆయన తన భార్యను కలవలేకపోయారు. ఆమె ప్రస్తుతం బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. వినిక్ నిరాహార దీక్ష చేస్తున్నారని ఆయన న్యాయవాది తిమోఫీ ముసతోవ్ బీబీసీతో చెప్పారు.