ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్‌కు ప్రత్యమ్నాయంగా రష్యా సొంతంగా దేశీయ ఇంటర్నెట్‌ను అభివృద్ధి చేసుకుంటోంది. దీన్ని విజయవంతంగా పరీక్షించినట్లు ఆ దేశం ప్రకటించింది. ఈ పరీక్షను ఎలా జరిపారన్నదాని గురించి పెద్దగా సమాచారం బయటకు రాలేదు. ప్రణాళిక ప్రకారం పరీక్ష మొత్తం సాగిందని అక్కడి వార్తా సంస్థలు కథనాలు రాశాయి.
అక్కడి సాధారణ వినియోగదారులకు మాత్రం మార్పులేమీ కనిపించలేదని రష్యా కమ్యునికేషన్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పరీక్ష ఫలితాలను రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సమర్పించనున్నారు. అయితే, ఇలాంటి వైఖరితో కొన్ని దేశాలు ఇంటర్నెట్‌ను నాశనం చేసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘‘ఇంటర్నెట్‌ను నాశనం చేసే దిశగా రష్యా సాగుతోంది. నిరంకుశ దేశాలు తమ పౌరులు ఏం చూడాలన్నది నియంత్రించాలనుకుంటున్నాయి. చైనా, ఇరాన్ ఇదివరకే ఇలా చేశాయి. అంటే, తమ దేశంలో జరుగుతున్నవాటి గురించి అక్కడి జనాలు చర్చించలేకుండా చేయాలని ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. వాళ్లను ఓ బుడగలో ఉంచాలనుకుంటున్నాయి’’ అని యూనివర్సిటీ ఆఫ సర్రేలోని కంప్యూటర్ సైంటిస్ట్ ప్రొఫెసర్ అలన్ వుడ్‌వార్డ్ అన్నారు.
దేశీయ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది?
‘ఓ కంపెనీ తమ ఉద్యోగులకు ఇంటర్నెట్ యాక్సెస్‌ను నియంత్రించినట్లుగా.. దేశంలో ఉన్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికాం సంస్థలను కూడా ఓ పెద్ద ఇంట్రానెట్‌లో భాగం చేసి దేనికి యాక్సెస్ ఉండాలన్నదాన్ని ప్రభుత్వం నియంత్రిస్తుంది’’ అని వుడ్‌వార్డ్ వివరించారు.
సముద్రాల గుండా వేసిన కేబుల్స్ ద్వారా, నోడ్స్ ద్వారా వివిధ దేశాలకు అంతర్జాతీయ వెబ్ సేవలు అందుతాయి. ఒక దేశానికి అందే, పంపే డేటాకు ఇవే కనెక్షన్ పాయింట్లుగా ఉంటాయి. వీటిని ఆపివేయడం లేదా నియంత్రించడం ద్వారా ఆ దేశంలో ఇంటర్నెట్‌ను నియంత్రించవచ్చు.
ఇందుకోసం ఆ దేశంలో ఉండే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికాం సంస్థల సహకారం అవసరం. కొన్ని దేశాల్లో ప్రభుత్వ సంస్థలు మాత్రమే ఈ సేవలను అందిస్తుంటాయి. అలాంటప్పుడు ప్రభుత్వాలకు ఈ పని మరింత తేలిక అవుతుంది. దేశంలో ఎన్ని ఎక్కువ నెటవర్క్‌లు ఉంటే, యాక్సెస్‌ను నియంత్రించడం అంత కష్టమవుతుంది.
ఇరాన్‌లో ఇంటర్నెట్ యాక్సెస్‌ను నేషనల్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ అనే సంస్థ నియంత్రిస్తుంది. నెట్‌వర్క్‌లో ఉండే కంటెంట్‌ను, బయటి నుంచి వచ్చే సమాచారాన్ని నియంత్రిస్తుంది. ఇరాన్ ప్రభుత్వ టెలికాం సంస్థ దీన్ని నడుపుతుంది.
సాధారణంగా ప్రభుత్వాలు నిషేధించిన వెబ్ సర్వీస్‌లను కూడా వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్)ల ద్వారా ఎవరైనా వినియోగించవచ్చు. అదే, ఇంటర్నెట్ యాక్సెస్ మొత్తం ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తే, వీపీఎన్‌లు కూడా పనిచేయవు.
చైనాలో ఉన్న గ్రేట్ ఫైర్‌వాల్‌గా పిలిచే వ్యవస్థ కూడా ఇలాంటిదే. విదేశీ ఇంటర్నెట్ సేవల యాక్సెస్‌ను అది నియంత్రిస్తుంది. ఫలితంగా అక్కడి పౌరులు గూగుల్, ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి వెబ్‌సైట్లు వినియోగించలేరు. అక్కడ దేశీయంగా ఇలాంటి సేవలందించే పెద్ద టెక్ సంస్థలు తయారయ్యాయి.
రష్యాలో ఇప్పటికే యాండెక్స్, మలి.ఆర్‌యూ లాంటి పెద్ద టెక్ సంస్థలు ఉన్నాయి. దేశీయ ఇంటర్నెట్ తెస్తే మరిన్ని స్థానిక సంస్థలు ఎదగొచ్చు. తమ దేశ సాఫ్ట్‌వేర్ లేని స్మార్ట్‌ఫోన్లను దేశంలో అమ్మకుండా నిషేధం విధించేందుకు రష్యా ఓ బిల్లు ఆమోదించింది. సొంత వికీపీడియాను సృష్టించేందుకు కూడా ఆ దేశం ప్రణాళికలు చేసుకుంటోంది
సాంకేతిక సవాళ్లు
రష్యా అనుసరిస్తున్న విధానం భావ ప్రకటనా స్వేచ్ఛకు అణిచివేసేదని, అయితే ఇందులో ఆ దేశం విజయవంతం అవుతుందన్న నిర్ధరణకు కూడా రాలేమని ఓ నిపుణుడు అన్నారు.
‘‘ఇంటర్నెట్‌ను నియంత్రించే ప్రయత్నంలో ఇదివరకు కూడా రష్యా ప్రభుత్వం సవాళ్లు ఎదుర్కొంది. టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌ను రష్యన్లకు అందుబాటులో లేకుండా చేసేందుకు ప్రయత్నించి విఫలమైంది’’ అని న్యూ అమెరికా మేధో సంస్థకు చెందిన జస్టిన్ షెర్మన్ బీబీసీతో అన్నారు.
‘‘ఈ పరీక్ష గురించి మరింత సమాచారం తెలియకుండా, దేశీయ ఇంటర్నెట్‌ను సృష్టించే దిశగా రష్యా ఎంత పురోగతి సాధించిందో అంచనా వేయలేం. వాణజ్యపరంగానూ రష్యా తీరుపై స్వదేశంలో, అంతర్జాతీయంగా ఎలాంటి వ్యతిరేకత వస్తుందో చూడాలి’’ అని షెర్మన్ వ్యాఖ్యానించారు.