శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 డిశెంబరు 2019 (11:18 IST)

ద్వేష విషాన్ని వెదజల్లడమే బీజేపీ దినచర్య : రాహుల్ గాంధీ

భారతీయ జనతా పార్టీ ఎక్కడకు వెళ్లినా.. అక్కడ ద్వేషం అనే విషాన్ని వెదజల్లడమే దాని దినచర్యగా మారిపోయిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. అస్సోం రాష్ట్ర రాజధాని గౌహతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, బీజేపీ ఎక్కడికి వెళ్తే.. అక్కడ ఆ పార్టీ ద్వేషాన్ని వ్యాపి చేస్తుందన్నారు. 
 
సీఏఏ, ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా అస్సాంలోనూ, దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయన్నారు. మీరెందుకు ఆందోళనకారుల్ని కాల్చి చంపుతున్నారని రాహుల్‌ ప్రశ్నించారు. ప్రజల గొంతును బీజేపీ వినడం లేదన్నారు. అస్సామీ భాష, సంస్కృతిపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దాడిని అడ్డుకోవాలన్నారు. అస్సాంను నాగపూర్‌ నడిపించదన్నారు. అస్సాంను చడ్డీ వేసుకునే ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు ఏలరన్నారు. అస్సాంను అస్సామీలే పాలిస్తారని రాహుల్‌ స్పష్టం చేశారు. 
 
అంతేకాకుండా, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ను నోట్లరద్దు-2గా అభివర్ణించిన రాహుల్‌గాంధీ.. అవి నోట్ల రద్దు కంటే విపత్కరమైనవని ధ్వజమెత్తారు. కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ విధానాలతో అసోం మళ్లీ హింసామార్గం వైపు మళ్లే ప్రమాదం తలెత్తిందని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న యువతపై కాల్పులు జరుపడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.

ఆందోళన సందర్భంగా రాష్ట్రంలో ఐదుగురు మృత్యువాతపడడం బాధాకరమని, ఆ కుటుంబాలను తాను పరామర్శిస్తానని పేర్కొన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని, కానీ అందుకు బదులుగా తన మిత్రులైన పారిశ్రామిక వేత్తలకు రూ.3.5 లక్షల కోట్లు కట్టబెట్టారన్నారు.