సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2019 (17:15 IST)

కాశ్మీర్‌: కేంద్రం చర్యతో సమాఖ్య స్ఫూర్తికి దెబ్బ.. ఈ పరిస్థితి ఏ రాష్ట్రానికైనా రావొచ్చు!

సమాఖ్య వ్యవస్థకు మద్దతుదారుగా, రాష్ట్రాలకు మరింత స్వతంత్రత ఉండాలని నమ్మే నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ తన గురించి తాను ఎప్పుడూ చెప్పుకొంటుంటారు. మోదీ ప్రభుత్వం ఆగస్టు మొదటి వారంలో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు (జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌) గా విభజించడం, కశ్మీర్‌లో ముందెన్నడూ లేనంతగా భద్రతాపరమైన ఆంక్షలు విధించడం, సమాచార వ్యవస్థలను స్తంభింపజేయడం చూసిన చాలా మంది ఈ చర్యలు భారత సమాఖ్య వ్యవస్థను ఎంతో బలహీనపరిచాయని భావిస్తున్నారు.
 
కొత్త కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లను దిల్లీలోని కేంద్ర ప్రభుత్వం నేరుగా పరిపాలిస్తుంది. రాష్ట్రాలతో పోలిస్తే కేంద్ర పాలిత ప్రాంతాలకు తక్కువ స్వతంత్రత ఉంటుంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌ (ఎల్‌ఎస్‌ఈ)లో అంతర్జాతీయ, సమకాలీన రాజకీయాల ప్రొఫెసర్ అయిన సుమంత్రా బోస్- కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వ 'గ్లోరిఫైడ్ మున్సిపాలిటీలు'గా ఎద్దేవా చేస్తారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేయడంతో భారత్‌లో ఉండే సున్నితమైన సమాఖ్య సమతౌల్యానికి విఘాతం కలిగిందని ఒక కామెంటేటర్ వ్యాఖ్యానించారు.
 
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగ అధికరణ 370ని ఇటీవల పార్లమెంటు సవరించే వరకు చాలా వరకు ప్రతీకాత్మకం (సింబాలిక్‌) గానే ఉండేది. ఆర్టికల్ 370 కింద హామీ ఇచ్చిన స్వయం ప్రతిపత్తిని తదనంతర కాలంలో వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులు క్రమంగా చాలా వరకు నామమాత్రం చేశాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని, వాస్తవానికి ప్రత్యేక ప్రతిపత్తి స్ఫూర్తి కొనసాగడమే ముఖ్యమని చాలా మంది చెబుతారు. ప్రధాన స్రవంతికి దూరంగా ఉన్నామనుకొనే వర్గాలను కూడా కలుపుకొని పోతూ, వారికి చోటు కల్పించే సౌలభ్యం భారత రాజ్యాంగంలో ఉందనే సంకేతాన్ని ఇది పంపేదని అంటారు.
 
ఏకీకృత కేంద్ర, సమాఖ్య వ్యవస్థల మధ్య సున్నితమైన సమతౌల్యం కోసం భారత రాజ్యాంగం ప్రయత్నిస్తుందని దిల్లీలోని మేధో సంస్థ 'సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్' చీఫ్ ఎగ్జిక్యూటివ్ యామినీ అయ్యర్ అంటారు. భారత సమాఖ్య వ్యవస్థ తీరుతెన్నులపై సందేహాలు ఎప్పుడూ ఉన్నాయి. రాష్ట్రాల గవర్నర్లను కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. వీరు సాధారణంగా కేంద్రంలోని పాలక పక్ష నాయకులే అయి ఉంటారు."రాజ్యాంగ యంత్రాంగం విఫలమైంది" అనే కారణంతో రాష్ట్రపతి పాలన పేరుతో రాష్ట్రాల్లో నేరుగా పాలన సాగించడానికి కేంద్ర ప్రభుత్వానికి వీరు సహకరిస్తుంటారు. 
 
భారత ప్రజాస్వామ్యానికి సమాఖ్య వ్యవస్థ అవసరమని రాజ్యాంగ రూపకర్తలు భావించారని, కానీ దీనికి మద్దతిచ్చేవారు 1947తో పోలిస్తే నేడు చాలా తక్కువ మంది ఉన్నారని, ఇది భారత ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని యామినీ అయ్యర్ అభిప్రాయపడ్డారు. జమ్మూకశ్మీర్‌ ప్రజలను, రాజకీయ నాయకులను సంప్రదించకుండా, జమ్మూకశ్మీర్ రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పుడు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడాన్ని భారత సమాఖ్య చరిత్రలో మరో మాయని మచ్చగా చాలా మంది భావిస్తున్నారు.
 
"ఈ నిర్ణయంలో ఇమిడి ఉన్న అత్యంత ప్రధానమైన అంశం ఏమిటంటే- మనం ప్రజాస్వామ్య సూత్రాలకు తిలోదకాలు వదిలి ఏకీకృత కేంద్ర వ్యవస్థ వైపు సాగుతున్నాం. ఇది భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమే. కేంద్ర ప్రభుత్వ చర్యను స్వాగతిస్తూ ప్రజల్లో అత్యధికులు వేడుక చేసుకుంటున్నారు. కానీ అసలు విషయం వారికి అర్థమైనట్లు లేదు" అని 'డీమిస్టిఫైయింగ్ కశ్మీర్' పుస్తక రచయిత నవనీత చద్దా బెహ్రా వ్యాఖ్యానించారు. ఆమె అమెరికాలోని మేధోసంస్థ 'బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌'లో విజిటింగ్ స్కాలర్‌గా సేవలందించారు.
 
"జమ్మూకశ్మీర్‌కు ఎదురైన పరిస్థితే దేశంలో మరే రాష్ట్రానికైనా ఎదురుకావొచ్చు. ఇప్పుడు ఇదే ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వాన్నైనా రద్దు చేయొచ్చు. సంప్రదింపుల ప్రక్రియను పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు చేయొచ్చు. రాష్ట్రాన్ని విభజించవచ్చు. రాష్ట్రం హోదాను తగ్గించవచ్చు. మరో విషయం కూడా ఆందోళన కలిగిస్తోంది. అదేంటంటే- కేంద్ర ప్రభుత్వ చర్యకు ప్రతిఘటన దాదాపు లేకపోవడం. పౌర సమాజం, మీడియా, ప్రాంతీయ పార్టీల్లో అత్యధికం మౌనం దాల్చాయి లేదా వ్యతిరేకతను చాలా బలహీనంగా వ్యక్తంచేస్తున్నాయి" అని నవనీత చెప్పారు.
 
కేంద్రం చర్యను సమర్థించేవారి వాదన ఏమిటంటే...
జమ్మూకశ్మీర్ ఇతర రాష్ట్రాల మాదిరి కాదని, ఇది ప్రత్యేకమైనదని, సంక్షుభిత ప్రాంతమని వారు చెబుతారు. ఇది శత్రు దేశం పాకిస్తాన్‌కు ఆనుకొని ఉన్న ఇన్‌సర్జెన్సీ ప్రభావిత ప్రాంతమని, ఇక్కడ చర్చల ప్రక్రియతో ఏ ప్రయోజనమూ ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. 'బుజ్జగింపు రాజకీయాల'కు ఆర్టికల్ 370ని ఉదాహరణగా చెబుతూ, దీనిని రద్దు చేయాలని బీజేపీ చాలా సంవత్సరాలుగా డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర హోదాను తొలగించే వరకు, భారత్‌లో ముస్లిం మెజారిటీ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రంగా జమ్మూకశ్మీర్ ఉండేది.
 
గెరిల్లా పోరాట నాయకుడు సీఎం అయిన చరిత్ర ఉంది...
వేర్పాటువాద డిమాండ్లను సయోధ్యతో పరిష్కరించుకొన్న చరిత్ర కూడా భారత్‌కు ఉంది. స్వాతంత్ర్యం కోసం ప్రభుత్వంపై పాతికేళ్లపాటు గెరిల్లా పోరాటాన్ని నడిపించిన నాయకుడు ముఖ్యమంత్రి కావడం ఎక్కడైనా సాధ్యమేనా? ఇది భారత్‌లో, ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో సాధ్యమైంది. 1986లో భారత ప్రభుత్వం, మిజోరాం రెబల్ నాయకుడు లాల్డేంగ మధ్య ఒప్పందం కుదిరాక ఇది జరిగింది. అధికార పంపిణీ, అందరినీ కలుపుకొని పోవడం అనే అంశాలు భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశాయి.
 
సుప్రీంకోర్టుకు పరీక్షా సమయం...
రాష్ట్రాల కంటే కేంద్రానికి రాజ్యాంగం ఎక్కువ అధికారం కల్పించిందంటే దానర్థం రాష్ట్రాలు కేంద్రానికి కేవలం అనుబంధంగా ఉండేవని కాదని భారత సుప్రీంకోర్టు గతంలో స్పష్టంగా చెప్పింది. "రాష్ట్రాలు వాటి అధికార పరిధిలో అవే సర్వోన్నతమైనవి. రాష్ట్రాల అధికారాలను కేంద్రం తగ్గించలేదు" అని తెలిపింది. సమాఖ్య వ్యవస్థ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. జమ్మూకశ్మీర్‌పై కేంద్రం చర్యలో న్యాయపరమైన సవాళ్లు ఇమిడి ఉన్నాయని, వీటి విషయంలో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరమని నవనీత అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు స్వతంత్రకు ఇదో పరీక్షగా నిలుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.