శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : ఆదివారం, 18 ఆగస్టు 2019 (15:44 IST)

కాశ్మీర్ అంశం ముగిసిపోయింది... ఇకపై పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పైనే చర్చలు

కాశ్మీర్ అంశం ఓ ముగిసిన అధ్యాయమని, ఇకపై భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలంటూ జరిగితే అది పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పైనే జరుగుతాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు. అదీ కూడా పొరుగు దేశం పాకిస్థాన్ ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వకుండా ఉంటేనే చర్చలు జరుపుతామని లేనిపక్షంలో చర్చలకు ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. 
 
బీజేపీ జనాశీర్వాద్ ర్యాలీని చేపట్టింది. ఇందులోభాగంగా, ఆదివారం హర్యానాలో జరిగిన కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్‌ అభివృద్ధిని ఆశించే 370 అధికరణనను రద్దు చేసినట్టు తెలిపారు. దీనిపై పాకిస్థాన్‌ అంతర్జాతీయ సమాజం ఎదుట రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. 
 
ఇక పాకిస్థాన్‌తో పీఓకేపైనే చర్చలు ఉంటాయన్నారు. బాలాకోట్‌ కంటే భారీ చర్యలకు భారత్‌ ఉపక్రమించిందని ఇటీవల పాక్‌ ప్రధాని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బాలాకోట్‌లో భారత్‌ జరిపిన చర్యలను పాక్‌ ప్రధాని గుర్తించినట్టు ఆయన వ్యాఖ్యలతో స్పష్టమైందని అన్నారు. 
 
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌ నిమిషాల వ్యవధిలో ఆర్టికల్‌ 370ను రద్దు చేసిందని, తాము ఎన్నడూ అధికార దాహంతో రాజకీయాలు చేయబోమని చెప్పారు. మేనిఫెస్టోలో ప్రస్తావించిన మేరకు ఆర్టికల్‌ 370ను రద్దు చేసి ఎన్నికల హామీని నెరవేర్చామని రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు.