సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 18 ఆగస్టు 2019 (13:51 IST)

మీటింగూ లేదూ మినిట్సూ లేదు.. కాశ్మీర్ అంశం భారత్ అంతర్గత ఇష్యూ

కాశ్మీర్ అంశంపై పాకిస్థాన్‌ మరోమారు భంగపాటుకు గురైంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఈ అంశంపై చర్చకు పట్టుబట్టి ఓడిపోయింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన అధికరణ 370ని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు రద్దు చేసింది. దీన్ని అంతర్జాతీయ అంశంగా చేసి లబ్ది పొందాలని పాకిస్థాన్ లేనిపోని యాగీ చేసింది. పాకిస్థాన్‌కు చైనా సైతం వత్తాసు పలికింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమిత భద్రతా మండలిలో పాకిస్థాన్ భంగపాటుకు గురైంది. 
 
కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలని తహతహలాడిన పాక్‌కు, దాని మిత్ర దేశం చైనాకు ఐరాస భద్రతా మండలి తేరుకోలేని షాకిచ్చింది. కాశ్మీర్‌ సమస్య భారత్‌, పాకిస్థాన్‌కు సంబంధించిన ద్వైపాక్షిక అంశమని మెజార్టీ సభ్యదేశాలు తేల్చి చెప్పాయి. కాగా, మండలిలో శాశ్వత సభ్య దేశమైన చైనా విజ్ఞప్తి మేరకు మండలిలో శనివారం రహస్య సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. గంట పాటు జరిగిన ఈ భేటీలో ఒక ప్రకటన కోసం చైనా పట్టుబట్టగా బ్రిటన్‌ మద్దతు పలికింది. 
 
అయితే, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్య దేశాలతో జరిపిన చర్చల్లో భారత్‌ తన వాదనను సమర్థంగా వినిపించింది. సమావేశంలో అతిగా స్పందించడం వల్ల చైనాకు కూడా ఎదురుదెబ్బ తప్పలేదు. ఆఫ్రికా దేశాలు, జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్‌, రష్యాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. భారత్‌, పాక్‌ల మధ్య చర్చలు జరగాలని ఫ్రాన్స్‌ కోరింది. ఇండోనేసియా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
 
దీంతో మెజార్టీ సభ్యులు ససేమిరా అనడంతో కాశ్మీర్‌ అంశం భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక సమస్యని, ఆ రెండు దేశాలే తేల్చుకోవాలని ఐక్యరాజ్య సమితి తేల్చిచెప్పింది. మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకు భేటీ అనంతరం భద్రతా మండలికి నాయకత్వం వహిస్తున్న పోలండ్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు.